మైగ్రెయిన్‌ నొప్పికి కారణమేంటి? లక్షణాలు ఎలా ఉంటాయి?

ABN , First Publish Date - 2022-05-03T17:42:41+05:30 IST

ఏటా ప్రపంచవ్యాప్తంగా 52శాతం మందిని రకరకాల తలనొప్పులు వేధిస్తున్నాయి. వాళ్లలో 10% మందికి మైగ్రెయిన్‌ ఉంటుందని గణాంకాలు చెప్తున్నాయి. ఈ తలభారం

మైగ్రెయిన్‌ నొప్పికి కారణమేంటి? లక్షణాలు ఎలా ఉంటాయి?

ఆంధ్రజ్యోతి(03-05-2022)

ఏటా ప్రపంచవ్యాప్తంగా 52శాతం మందిని రకరకాల తలనొప్పులు వేధిస్తున్నాయి. వాళ్లలో 10% మందికి మైగ్రెయిన్‌ ఉంటుందని గణాంకాలు చెప్తున్నాయి. ఈ తలభారం ఎందుకొస్తుందో, ఎవరిని వేధిస్తుందో కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు కాబట్టి నొప్పిని ప్రేరేపించే అంశాలకు దూరంగా ఉంటూ, వైద్యులు సూచించిన మందులు వాడుకుంటూ మైగ్రెయిన్‌ను అదుపులో పెట్టుకోవాలి. 


తలలోని ట్రైజెమైనల్‌ నాడి, న్యూరోట్రాన్స్‌మీటర్లలో హెచ్చుతగ్గులు మైగ్రెయిన్‌కు కారణం. సెరోటినిన్‌ అనే న్యూరోట్రాన్స్‌మీటర్‌ మోతాదు తగ్గితే, శరీరం న్యూరోపెప్టైడ్స్‌ను విడుదల చేస్తుంది. దాంతో తల్లోని రక్తనాళాలు విప్పారి, ఎక్కువ రక్తం మెదడులోకి చేరుకుంటుంది. దాంతో తలభారం మొదలవుతుంది. స్థూలంగా మైగ్రెయిన్‌ నొప్పికి కారణమిదే!


మైగ్రెయిన్‌ను ప్రేరేపించే కారణాలు వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటాయి. ఒత్తిడి, శబ్దాలు, కొన్ని పరిసరాలు, హార్మోన్లలో మార్పులు, కొన్ని రకాల పరిమళాలు, మందులు, నిద్రలో మార్పులు.. ఇలా మైగ్రెయిన్‌ వేధించే పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. ఈ నొప్పికి వయసుతో కూడా సంబంధం లేదు. ఇవి రోజూ వేధించవచ్చు. లేదా కొంతకాలం ఆగిపోయి, హఠాత్తుగా మొదలవవచ్చు. అయితే ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కాబట్టి నొప్పి గురించిన భయంతో జీవన నాణ్యత దెబ్బతింటుంది. ఎవరినైనా కలవాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంటుంది. ఈ నొప్పి గుణాన్ని బట్టి నొప్పి రాబోతోందని ఎవరికి వారు తెలుసుకోగలుగుతారు. 


ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే....

తలకు ఎడమ వైపు, కుడి వైపు, పైన, వెనక... ఇలా తలలోని వేర్వేరు ప్రదేశాల్లో నొప్పి మొదలవుతుంది.  

ఈ ప్రదేశాలు కూడా వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటాయి. 

కొందరికి ఒకే ప్రదేశంలో తలెత్తితే, ఇంకొందరికి వేర్వేరు ప్రదేశాల్లో మొదలవుతూ ఉంటుంది. 

తల మీద కొట్టినట్టు, తల పగిలిపోతున్నట్టు నొప్పి ఉంటుంది. 

కళ్లు బైర్లు కమ్మడం 

నీరసం, చీకాకు 

శబ్దాలను, వెలుతురునూ భరించలేకపోవడం 

కడుపులో నొప్పి 

వాంతి వస్తున్న భావన కలగడం

వాంతితో పాటు తలనొప్పి తగ్గడం

శరీరం వేడిగా, లేదా చల్లగా ఉండడం


మహిళల్లో ఎక్కువ 

మైగ్రెయిన్‌కు వయో భేదం, వృత్తి భేదం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకూ ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. అయితే మైగ్రెయిన్‌ బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉంటారు. సున్నిత మనస్తత్వం, ఒత్తిడిని భరించే గుణం తక్కువగా ఉండడం వల్ల మహిళల్లో పార్శ్వపు నొప్పి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పూర్వంతో పోల్చుకుంటే ప్రస్తుత కాలంలో మైగ్రెయిన్‌ సమస్య పెరగడానికి ఒత్తిడితో కూడిన జీవనశైలే కారణం.

 

చిట్కాలూ ఉన్నాయి... 

శబ్దాలు, వెలుగు నొప్పిని పెంచుతాయి కాబట్టి చీకటిగా, నిశ్శబ్దంగా ఉన్న గదిలో విశ్రాంతి తీసుకోవాలి. 

తలకూ, మెడకూ చల్లని లేదా వెచ్చని కాపడం పెట్టాలి. 

నీళ్లు ఎక్కువగా తాగాలి. కణతల దగ్గర మర్దన చేసుకోవాలి.

ధ్యానం సాధన చేయాలి. వ్యాయామంతో ఫలితం ఉంటుంది.

మనసు స్వాంతన పొందే పనులు చేయాలి. 

మైగ్రెయిన్‌ నొప్పికి కారణమయ్యే పరిస్థితులకు దూరంగా ఉండాలి. 



హోమియోతో అడ్డుకట్ట..

మైగ్రెయిన్‌ పరీక్షల్లో బయటపడే సమస్య కాదు కాబట్టి, లక్షణాలను, తీవ్రతలను బట్టి ఆ నొప్పిని అదుపులో ఉంచే చికిత్సను ఎంచుకోవలసి ఉంటుంది. ఈ పార్శ్వపు నొప్పి ఎంత తరచుగా వేధిస్తోంది, ఎంత తీవ్రంగా ఉంటోంది... మొదలైన అంశాల ఆధారంగా చికిత్స చేయవలసి ఉంటుంది. కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా, తరచూ తిరగబెట్టకుండా చేసే మందులు హోమియోపతిలో ఉన్నాయి. కొంత మందిలో ఈ మందులు మైగ్రెయిన్‌ను శాశ్వతంగా అరికడతాయి. అలాగే ఈ చికిత్సలో భాగంగా మైగ్రెయిన్‌తో పాటు అనుబంధంగా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కలిపి చికిత్స అందించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. అయితే ఈ మందులను వైద్యుల సలహా మేరకే వాడుకోవాలి. హోమియోలో మైగ్రెయిన్‌కు ఉపయోగపడే మందులు ఇవే! 


బెలడోన: అకాస్మాత్తుగా తీవ్రమైన నొప్పి మొదలై, కళ్లు, ముఖం ఎర్రబడతాయి. వెలుతురు చూడలేరు. 

బ్రయోనియా: ఏమాత్రం కదిలినా తలనొప్పి ఎక్కవవుతూ ఉంటుంది. వెలుతురు, శబ్దం భరించలేరు. అతి దాహం ఉంటుంది. తలను అదిమినట్టు పట్టుకుంటే ఉపశమనంగా ఉంటుంది.

జెల్సీమియం: తల బరువుగా ఉండడం, మెడ వెనక భాగం నుంచి నొప్పి మొదలవడం, తలలో పోట్లు, కళ్ల ముందు మెరుపులు కనిపించడం. 

శాంగ్వినేరియా: కుడి వైపు తల నొప్పి, మెనోపాజ్‌ దశకు చేరుకున్న స్త్రీలలో కనిపిస్తుంది. 

స్పైజీలియా: ఎడం వైపు తల నొప్పి, గుండె దడఐరిస్‌ వర్స్‌: తల కుడి భాగంలో నొప్పి, చెవి, కణతలు పగిలిపోతున్నంత బాధ, నొప్పి సూర్యోదయంతో మొదలై, సూర్యాస్తమయంతో ఉపశమనం పొందుతారు.

తూజా: ఎడమ కణతలో, తలలో నొప్పి, తలపై మేకులు గుచ్చినంత బాధ, వికారం 

లాక్‌ కేన్‌: తల నొప్పి ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు మారుతూ ఉంటుంది. 

ఇగ్నీషియా: కోపం, దిగులు, దుర్వార్తలు తెలియగానే మొదలయ్యే తలనొప్పి 

కాక్యులస్‌: ప్రయాణంతో వచ్చే తలనొప్పి, వాంతులు- సిడ్రాన్‌, పల్సటిల్లా, కాలీ ఫాస్‌, డామియానా, ఇపెకాక్‌ మొదలైన మందులతో కూడా ఫలితం ఉంటుంది. 


త్వరిత వైద్యం ఇలా... 

మైగ్రెయిన్‌ నొప్పిని అప్పటికప్పుడు తగ్గించే అత్యవసర మందులు హోమియోలో ఉన్నాయి. నొప్పి వచ్చే సందర్భాలు, లక్షణాల ఆధారంగా ఏ మందులతో నొప్పికి అడ్డుకట్ట వేయచ్చనేది అనుభవజ్ఞులైన హోమియో వైద్యులకు మాత్రమే తెలుస్తుంది. హోమియో మందులతో పది నుంచి 15 నిమిషాల్లో నొప్పి తగ్గడమే కాకుండా, తీవ్రత కూడా అదుపులోకొస్తుంది. అలాగే నొప్పి క్రమం కూడా క్రమేపీ తగ్గి, నొప్పి తలెత్తే వ్యవధి పెరుగుతూ, మైగ్రెయిన్‌ క్రమేపీ శాశ్వతంగా దూరమవుతుంది. 


మందుల పనితీరు ఇలా... 

రోగ లక్షణాల ఆధారంగ, కుటుంబ చరిత్ర లేదా దృష్టిలో తేడాలను బట్టి మైగ్రెయిన్‌ను నిర్థారించి, చికిత్స ఇవ్వవలసి ఉంటుంది. అలాగే సి.బి.పి, థైరాయిడ్‌, కిడ్రీ ఫంక్షన్‌, ఎలకొ్ట్రలైట్స్‌ మొదలైన పరీక్షలు మైగ్రెయిన్‌ నిర్థారణకు కొంత మేరకు తోడ్పడతాయి. మైగ్రెయిన్‌ సమస్యతో పాటు అనుబంధ సమస్యలకు కలిపి హోమియో మందులు వాడుకోవలసి ఉంటుంది. అయితే ఈ నొప్పి తీవ్రత, బాధించే సమయం ఎక్కువ కాబట్టి దాన్ని అదుపులో ఉంచడం కోసం మందు డోసును ఎక్కువసార్లు తీసుకోవలసి వస్తుంది. హోమియో మందులు మెదడు, శరీరాలు... రెండింటి మీదా ప్రభావం చూపిస్తాయి కాబట్టి మైగ్రెయిన్‌ నొప్పి త్వరగా తగ్గుతుంది. ఈ మందును నాలుక మీద ఉంచుకున్నప్పుడు, అక్కడి సున్నితమైన నరాల ద్వారా వేగంగా మెదడుకు చేరి, అక్కడి నరాల ఒత్తిడి తగ్గడం మూలంగా మైగ్రెయిన్‌ నొప్పి అదుపులోకొస్తుంది. 


నొప్పి నాలుగు దశల్లో... 

24 నుంచి 72 గంటల పాటు వేధించే పార్శ్వపు నొప్పి నాలుగు దశల్లో సాగుతుంది. అవేంటంటే...

ప్రొడోమ్‌: నొప్పికి రెండు గంటల నుంచి రెండు రోజుల ముందు వరకూ చోటుచేసుకునే అంశాల సమూహమిది. ఈ సమయంలో చీకాకు, ఒత్తిడి, ఆందోళన, వెలుతురు భరించలేకపోవడం, మెడనొప్పి లాంటి లక్షణాలుంటాయి.

ఆరా: నొప్పి మొదలయ్యే కొన్ని నిమిషాల ముందుండే దశ ఇది. చూపు మందగించడం, కళ్లకు ఎగుడుదిగుడు లైన్లు కనిపించడం, తలలో సూదులు గుచ్చినట్టు ఉండడం, మాటలు తడబడడం, నీరసం లాంటి లక్షణాలుంటాయి. 

ఎటాక్‌: ఈ దశ రెండు నుంచి మూడు రోజుల వరకూ ఉండవచ్చు. ఈ దశలో వాంతులు వేధిస్తాయి. 

పోస్ట్‌డ్రోమ్‌: ఈ చివరి దశలో నొప్పి తగ్గిపోయినా, తల భారం కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. 



డాక్టర్‌ దుర్గాప్రసాదరావు గన్నంరాజు

హోమియో వైద్య నిపుణులు,

నిత్య హోమియో క్లినిక్‌,

కాచిగూడ, హైదరాబాద్‌

Read more