సిండికేట్‌ దందా...

ABN , First Publish Date - 2022-06-25T05:44:53+05:30 IST

సిండికేట్‌ దందా...

సిండికేట్‌ దందా...
ప్రముఖ కంపెనీ మిర్చి విత్తన ప్యాకెట్‌తో అనుబంధంగా విక్రయించిన మరో విత్తన ప్యాకెట్‌

బ్లాక్‌లో ప్రముఖ కంపెనీల మిర్చి విత్తనాలు 

అన్నదాత అడిగిన వాటికి అనుబంధ విత్తనాలతో ముడి

జిల్లా వ్యాప్తంగా ఫర్టిలైజర్‌ దుకాణాల్లో ఇదే తంతు

జిల్లాలో 65 వేల ఎకరాల్లో మిర్చి సాగుకు సన్నద్ధం


మహబూబాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మిర్చి విత్తనాల విక్రయాల్లో సిండికేట్‌ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది ఫర్టిలైజర్‌ షాపుల యజమానులు సిండికేట్‌గా మారి ప్రముఖ కంపెనీల మిర్చి విత్తనాలు బ్లాక్‌ చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ఆయా కంపెనీల విత్తనాలు కావాలని వెళ్లిన రైతులకు బలవంతంగా మరికొన్ని అనుబంధ విత్తనాలతో ముడిపెడుతూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన రైతులకు అసలు విత్తనాలే లేవని షాపుల యజమానులు బుకాయిస్తున్నారు. దీంతో చేసేది లేక కొన్నైనా నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయన్న భావనతో షాపుల నిర్వాహకులు ఇచ్చిన ఇతర విత్తనాలను తీసుకోక తప్పడంలేదు. వ్యవసాయాధికారులు సైతం ఈ దిశగా దృష్టిసారించకపోవడంతో విత్తన దుకాణాల సిండికేట్‌ దందా జోరుగా కొనసాగుతోంది. 


బ్లాక్‌ మాయ... విత్తనాలకు లింకు...

జిల్లా వ్యాప్తంగా పలువురు ఫర్టిలైజర్‌ దుకాణదారులు ప్రముఖ కంపెనీల మిర్చి విత్తనాలను దిగుమతి చేసుకొని బ్లాక్‌ చేసినట్లు సమాచారం. షాపుల యజమానులు సిండికేట్‌గా ఏర్పడి ప్రముఖ కంపెనీ విత్తనాలను దాచిపెట్టి కృత్రిమ కొరతను సృష్టించి వాటికి మరింత డిమాండ్‌ను పెంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ డిమాండ్‌ను ఆసరా చేసుకొని అనుబంధ విత్తనాలతో ముడిపెట్టి అధిక ధరలకు గోప్యంగా విక్రయిస్తున్నట్లు కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు నర్సింహులపేట, మరిపెడ, దంతాలపల్లి, తొర్రూరు, కేసముద్రం, గూడూరు, డోర్నకల్‌,  కురవి మండలాల పరిధిలో మిర్చి విత్తనాల సిండికేట్‌ దందా అధికంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నర్సింహులపేట మండల కేంద్రంలో ఇద్దరు ఫర్టిలైజర్‌ యజమానులు సీజన్‌ వారీగా మిర్చి, పత్తి, విత్తనాలకు అనుబంధ విత్తనాలతో పాటు పురుగు మందులను రైతులకు బలవంతంగా కట్టబెడుతుండడం గమనార్హం. తొర్రూరు, మరిపెడ, దంతాలపల్లి, కురవి మండలాల్లో సైతం ఇలాంటి దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. 


ఎందుకీ డిమాండ్‌...

మిర్చిలో ఒక బ్రాండ్‌కు చెందిన ఒక రకం విత్తనాలు గత సీజన్‌లో అధిక దిగుబడులు వచ్చాయి. ఈ కంపెనీ కాయలు సన్నగా పొడవుగా గింజలు తక్కువగా ఉండి బరువు తగ్గినప్పటికీ దిగుబడి అధికంగా ఉండడంతో నష్టం ఏమీ జరగలేదని తెలుస్తోంది. దీంతో ఈ సీజన్‌లో రైతులు అధికంగా ఆ బ్రాండ్‌ విత్తనాల కోసం ఎగబడుతున్నారు. విత్తన ప్యాకెట్‌పై గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)ను ముద్రిస్తారు. ఈ ధర కంటే అధికంగా అమ్మడానికి వీలులేదు. కొన్ని సీజన్లలో కొన్ని రకాల కంపెనీల విత్తనాలకు అనుకోకుండా డిమాండ్‌ ఏర్పడుతుంది. ఈ సమయంలో ఇతర కంపెనీల విత్తనాలను కొనేందుకు ఎవరూ ముందుకు రారు. దీంతో దుకాణాదారులు ఇదే అదనుగా భావించి రైతు కోరుకున్న కంపెనీ విత్తనాలతోపాటు అమ్ముడుపోని విత్తన ప్యాకెట్లను అవసరం లేకున్నా అంటగడుతున్నారు. డిమాండ్‌ ఉన్న కంపెనీ విత్తన ప్యాకెట్‌ ధర రూ.713 ఉండగా డిమాండ్‌ లేని కంపెనీల విత్తనాల ప్యాకెట్‌ ధర రూ.500 నుంచి రూ.600 వరకు ఉన్నాయి. అయితే రైతు కోరుకునే కంపెనీ విత్తనాల 10 గ్రాముల ప్యాకెట్‌ను రూ.713కే విక్రయిస్తూ అమ్ముడుపోని కంపెనీల ప్యాకెట్‌ను ఎంఆర్‌పీకంటే తక్కువగా రూ.450 నుంచి రూ.500లకు(అండర్‌ సేల్‌) రైతుకు బలవంతంగా అంటగడుతున్నారు.  


మిర్చి సాగుకు మొగ్గు..

జిల్లాలో ఈ సీజన్‌లో 4,60,580 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనాలు రూపొందించారు. ఇందులో వరి తర్వాత అత్యధికంగా 65 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేసేందుకు రైతులు సిద్ధం కావడం గమనార్హం. మిర్చికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండడంతో రైతులు మిర్చి సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి అనుగునంగానే విత్తనాలు సైతం రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. 2020-21లో మిర్చి సాగు 56 వేల ఎకరాలు ఉండగా, ఈ ఏడాది మరో పది వేల ఎకరాల సాగు విస్తీర్ణం పెరగనున్నది. ఇక వరి 1,80,200 ఎకరాలు, పెసర్లు 8,284, కందులు 12,036, వేరుశనగలు 610, పసుపు 4,620, మొక్కజొన్న 32,630, పత్తి 1,40,600, ఇతర పంటలు 16,400 సాగు చేయనున్నట్లు ప్రణాళిక సిద్ధం చేశారు. ఏదేమైనా మిర్చిలో బ్రాండ్‌ ఉన్న విత్తనాల బ్లాక్‌ దందాను, ఇతర కంపెనీల విత్తనాలను అంటగట్టి విక్రయించడాన్ని అరికట్టి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 


బలవంతంగా ముడిపెడుతున్నారు : గుగులోతు సురేష్‌, రైతు, కౌసల్యదేవిపల్లి గ్రామం 

జిల్లా కేంద్రంలో ఓ ఫర్టిలైజర్‌ దుకాణంలో ఒక కంపెనీకి చెందిన మిర్చి విత్తనాలు కావాలంటే వాటితో పాటు మరో కంపెనీకి చెందిన ఒక రకం విత్తనాలు బలవంతంగా ముడిపెట్టారు. అవసరం ఉన్న కంపెనీ కోసం చేసేది ఏమిలేక లింకు పెట్టిన విత్తనాలను కూడా కొనాల్సివచ్చింది.


రైతులు అడిగిన విత్తనాలనే ఇవ్వాలి : చత్రునాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి, మహబూబాబాద్‌ 

రైతులు అడిగిన విత్తనాలనే విక్రయించాలి. కోరిన విత్తనాలు కాకుండా బలవంతంగా ఇతర విత్తనాలను అంటగడితే దుకాణ లైసెన్సును రద్దు చేస్తాం. ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదు చేస్తే రైతు పేరు గోప్యంగా షాపు యజమానులపై చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2022-06-25T05:44:53+05:30 IST