9.5 ఎకరాల్లో లేఅవుట్‌.. రేపు HMDA నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-05-30T14:59:38+05:30 IST

9.5 ఎకరాల్లో లేఅవుట్‌.. రేపు HMDA నోటిఫికేషన్‌

9.5 ఎకరాల్లో లేఅవుట్‌.. రేపు HMDA నోటిఫికేషన్‌

హైదరాబాద్‌ సిటీ : నగర శివారులోని హైదరాబాద్‌-నాగార్జున్‌సాగర్‌ (Hyderabad-Nagarjuna Sagar) రోడ్డు వెంట తుర్కయాంజల్‌లో 9.5 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ (HMDA) లేఅవుట్‌ చేసింది. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదించిన ఈ లేఅవుట్‌లో కేవలం 34 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. బిల్డర్లు, డెవల్‌పమెంట్‌ సంస్థలు, వివిధ కంపెనీలు కొనుగోలు చేసేందుకు వీలుగా ఒక్కో ప్లాట్‌ విస్తీర్ణం 600 చ.గజాల నుంచి 1060 చ.గజాల వరకు ఉండే విధంగా తీర్చిదిద్దారు. ఈ ప్లాట్ల విక్రయానికి మంగళవారం హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ (Notification) జారీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ ఈ కామర్స్‌ ఆన్‌లైన్‌లోనే ఈ-వేలం వేయనుంది. 34 ప్లాట్ల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.120కోట్ల నుంచి రూ.150కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు.


ఈ లే అవుట్‌ పూర్తిగా మల్టీపర్పస్‌ యూజ్‌ జోన్‌లో ఉంది. రెసిడెన్షియల్‌, మల్టీపర్పస్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి అనుకూలంగా ఏర్పాటు చేశారు. గ్రౌండ్‌ ప్లస్‌ ఐదు అంతస్తులకు పైగా భవనాలకు వీలుగా, 40 ఫీట్ల నుంచి 60 ఫీట్ల రోడ్లు లే అవుట్‌లో ఉన్నాయి. రిజిస్ర్టేషన్‌ (Registration) చేసుకోవడానికి జూన్‌ 28 వరకు అధికారులు గడువు విధించారు. రూ.5లక్షలు చెల్లించి ఈ-వేలంలో పాల్గొనవచ్చు. జూన్‌ 30న ప్లాట్ల ఈ-వేలం రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ప్లాట్ల చదరపు గజానికి అప్‌సెట్‌ ధర రూ.40వేలు నిర్ణయించగా, వేలంలో పాల్గొనేవారు చదరపు గజానికి కనీసం రూ.500 అదనంగా ఆన్‌లైన్‌లో (Online) బిడ్‌ దాఖలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

Updated Date - 2022-05-30T14:59:38+05:30 IST