మరో దారి లేక...

ABN , First Publish Date - 2022-06-19T05:38:39+05:30 IST

తమకు అన్ని ఆధారాలు ఉండి, పట్టా భూమిలో ఇల్లు కట్టుకున్నా, అధికారులు ఆదేశించినా, తమ స్థలానికి ఉమ్మడిగా ఉన్న దారి మూసివేసి అక్రమ కట్టడాలు కట్టారని ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం సార్‌.. న్యాయం చేస్తారని ఆయనకు విషయం చెప్పుకుందామని వస్తే దారిలోనే ఆపేశారని వాపోయింది. వివరాల్లోకి వెళితే..

మరో దారి లేక...
వీల్‌చైర్‌లో బాపట్ల జిల్లా నుంచి సీఎంను కలిసేందుకు వచ్చిన కుటుంబం

 సీఎంను కలిసేందుకు బాపట్ల జిల్లా నుంచి వీల్‌చైర్‌లో వచ్చిన కుటుంబం 

కొలనుకొండ వద్ద నిలిపివేసిన పోలీసులు 

రహదారిపైనే బైఠాయింపు 


తాడేపల్లి : తమకు అన్ని ఆధారాలు ఉండి, పట్టా భూమిలో ఇల్లు కట్టుకున్నా, అధికారులు ఆదేశించినా, తమ స్థలానికి ఉమ్మడిగా ఉన్న దారి మూసివేసి అక్రమ కట్టడాలు కట్టారని ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం సార్‌.. న్యాయం చేస్తారని ఆయనకు విషయం చెప్పుకుందామని వస్తే దారిలోనే ఆపేశారని వాపోయింది. వివరాల్లోకి వెళితే..  


అద్దంకి మండలం గోపాలపురంలో గొట్టిపాటి సుధారాణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమె తన స్వగ్రామమైన  బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో రూ.15లక్షల వ్యయంతో ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటికి వెళ్దే రహదారిపై తమకు సర్వ హక్కులు ఉన్నాయని ఆ దారి మీదుగానే రాకపోకలు సాగిస్తున్నామని ఆమె తెలిపారు. అయితే.. అదే ప్రాంతంలో ఉంటున్న వైసీపీ మద్దతుదారులు ఎన్‌.వెంకటేశ్వర్లు, సుబ్బయ్య తదితరులు స్వప్రయోజనాల కోసం రహదారిని ఉన్న పళంగా గోడకట్టి మూసివేయడంతో తమకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందన్నారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, అధికారులు ఆదేశించినా వారు లెక్క చేయలేదని వాపోయారు. సుధారాణి కుమార్తె సుమహారిక ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. కుమారుడు తేజ తాడేపల్లిగూడెం నిట్‌లో, మరో కుమారుడు కార్తీక్‌ వెటర్నరీ మెడిసన్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. సీఎంను కలిసేందుకు ఈ కుటుంబం శుక్రవారం ఉదయం బొడ్డువానిపాలెంలో బయలుదేరింది. సుధారాణికి అనారోగ్యంతో ఉండడంతో వీల్‌చెయిర్‌లో తీసుకుని కుమార్తె, ఇద్దరు కుమారులు కలిసి నడుస్తూ ప్రయాణం చేశారు. శనివారం సాయంత్రానికి సీఎం కాం్యప్‌ ఆఫీసుకు వచ్చి, సీఎంను కలిసి తమ గోడు వివరిద్దామని భావించారు.


మా ఇంటికి దారి ఇవ్వండి.. సీఎం సార్‌ మీరే మాకు దిక్కు.. లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యం.. మాకు న్యాయం కావాలి అంటూ ప్లకార్డులు వారి చేతుల్లో ఉన్నాయి. తాడేపల్లి మండలం కొలనుకొండలో జయభేరి అపార్టుమెంట్స్‌ సమీపంలోకి రాగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు రహదారిపైనే బైఠాయించారు. తాము కూడా వైసీపీకి ఓట్లు వేశామని, అయితే ప్రత్యర్ధులు బలమైన వర్గం వారు కావడంతో తమకు న్యాయం జరగడం లేదని బాధితులు వాపోయారు. 


అధికారుల రాక 

కాగా సీఎం క్యాంపు ఆఫీస్‌ నుంచి సంబంధిత ప్రాంత తహసీల్దార్లకు సమాచారం వెళ్లడంతో మార్టూరు, కొరిశపాడు మండల తహసీల్దార్లు వెంకటరామిరెడ్డి, లక్ష్మీనారాయణలు శనివారం సాయంత్రం బాధితులు ఉన్న ప్రాంతానికి విచ్చేసి వారితో చర్చలు జరుపుతున్నారు. బాధితులు మాత్రం తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2022-06-19T05:38:39+05:30 IST