తగ్గేదేలే...

ABN , First Publish Date - 2022-01-21T05:08:08+05:30 IST

కరోనా మహమ్మారి మరింత దూకుడు పెంచింది. రోజు రోజుకూ కేసుల దూకుడులో తగ్గేదేలే.. అంటోంది. రాజకీయ నాయకులు, జనం నిబంధనలను పాటించేంత వరకు నేను ఆగే ప్రసక్తే లేదంటూ వార్నింగ్‌ ఇస్తోంది. నిబంధనలు అలా గాలికి వదిలేయడంతో కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయి. బుధవారం 15.1 ఉన్న పాజిటివ్‌ రేట్‌ గురువారానికి ఏకంగా 20 శాతానికి ఎగపాకింది. సెన్సెక్స్‌, బంగారు ధరల తరహాలో పాజిటివ్‌ రేట్‌ పైపైకి పెరిగిపోతోంది.

తగ్గేదేలే...

రోజు రోజుకూ విస్తరిస్తున్న మహమ్మారి 

ఒక్క రోజులోనే 685 కేసులు 

కడప, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి మరింత దూకుడు పెంచింది. రోజు రోజుకూ కేసుల దూకుడులో తగ్గేదేలే.. అంటోంది. రాజకీయ నాయకులు, జనం నిబంధనలను పాటించేంత వరకు నేను ఆగే ప్రసక్తే లేదంటూ వార్నింగ్‌ ఇస్తోంది. నిబంధనలు అలా గాలికి వదిలేయడంతో కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయి. బుధవారం 15.1 ఉన్న పాజిటివ్‌ రేట్‌ గురువారానికి ఏకంగా 20 శాతానికి ఎగపాకింది. సెన్సెక్స్‌, బంగారు ధరల తరహాలో పాజిటివ్‌ రేట్‌ పైపైకి పెరిగిపోతోంది. గత 24 గంటల వ్యవధిలో గురువారం 685 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటినలో వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,034కు చేరుకున్నాయి. ఇప్పటివరకు 715 మంది మృతి చెందగా కోలుకున్న 174 మందిని డిశ్చార్జ్‌ చేశారు. రికవరీ సంఖ్య 1,18,894కు చేరుకుంది. ఆస్పత్రిలో 72, హోం ఐసోలేషనలో 2368, కేర్‌ సెంటర్‌లో 10 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కేసులను పరిశీలిస్తే కడప నగరంపై కరోనా పంజా విసురుతోంది. ఇక్కడ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా 280 కేసులు నమోదయ్యాయి. రాజంపేటలో 37, పులివెందులలో 35, జమ్మలమడుగులో 22, మైదుకూరులో 14, ఎర్రగుంట్లలో 9, కమలాపురం, సుండుపల్లెలో 8 చొప్పున కేసులు నమోదు కాగా మిగిలిన ప్రాంతాల్లో కూడా స్వల్పంగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


రిమ్స్‌లో వైద్య సిబ్బందిపై కరోనా పంజా 

కడప(సెవెనరోడ్స్‌), జనవరి 20: కడప నగర పరిధిలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్‌)లో పలువురు వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది కరోనా బారినపడ్డారు. 48 మంది వైద్య విద్యార్థులు, నర్సింగ్‌ సిబ్బంది 13 మంది, వైద్యులు ముగ్గురు కరోనా బారిన పడినట్లు సమాచారం. రిమ్స్‌ సిబ్బంది అందరికీ టెస్టులు చేస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కరోనా సోకిన వారిలో చాలా వరకు హాస్టల్‌ విద్యార్థులే కావడం గమనార్హం. అనేక జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, వైద్య సిబ్బంది పైనే కరోనా పంజా విసురుతుంటే ఇక విచ్చలవిడిగా గుంపులుగా తిరిగే సామాన్యుల పరిస్థితి మరింత భయానకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తమై అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉంటే మంచిది.


Updated Date - 2022-01-21T05:08:08+05:30 IST