ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ భాష మాట్లాడుతున్న కపిల్ సిబాల్‌‌.. సీడబ్ల్యూసీ తర్వాతా సెగలు

ABN , First Publish Date - 2022-03-15T21:45:06+05:30 IST

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు..

ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ భాష మాట్లాడుతున్న కపిల్ సిబాల్‌‌.. సీడబ్ల్యూసీ తర్వాతా సెగలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ఆగడం లేదు. పార్టీ అధినాకత్వంపై సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణిక్యం ఠాగూర్ మంగళవారంనాడు మండిపడ్డారు. ఆర్‌ఎస్ఎస్-బీజేపీ భాషలో కపిల్ సిబాల్ మాట్లాడుతున్నారంటూ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ విధేయుడుగా ఠాగూర్‌కు పేరు ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి గాంధీ కుటుంబీకులను తప్పించాలని బీజేపీ కోరుకుంటోందని, కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం, చేసి, ఐడియా ఆఫ్ ఇండియాను ధ్వంసం చేయడమే వారి ఉద్దేశమని ఠాగూర్ ఘాటు విమర్శలు చేశారు.


''నెహ్రూ-గాంధీలను నాయకత్వం నుంచి తప్పించాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎందుకు కోరుకుంటున్నాయి? ఎందుకంటే... గాంధీజీల నాయకత్వం లేకపోతే కాంగ్రెస్ పార్టీ జనతా పార్టీలా మారుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీని తేలిగ్గా మట్టుపెట్టవచ్చు. ఐడియా ఆఫ్ ఇండియాను చాలా సునాయాసంగా ధ్వంసం చేయవచ్చు. ఇదే ఆర్ఎస్ఎస్, బీజేపీల ఆలోచన'' అని ఠాగూర్ ట్వీట్ చేశారు. కపిల్ సిబాల్‌కు కూడా ఈ విషయం బాగా తెలుసునని, కానీ  ఆయన కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ భాషలో ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు.


కపిల్ సిబల్ ఏమన్నారంటే..

కపిల్ సిబల్ ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాంధీజీలు తప్పుకుని, పార్టీని నడిపే బాధ్యతను ఇతర నేతలకు అప్పగించాలని పేర్కొన్నారు. 'సబ్ కీ కాంగ్రెస్'ను తాను కోరుకుంటున్నానని, 'ఘర్ కీ కాంగ్రెస్'ను కాదని వ్యాఖ్యానించారు. గత ఆదివారంనాడు ఐదు గంటల సేపు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కపిల్ సిబాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలలో సోనియా కొనసాగాలని, పార్టీ పటిష్టతకు అవసరమైన మార్పులు వెంటనే చేపట్టాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది.

Updated Date - 2022-03-15T21:45:06+05:30 IST