taiwan china news : చైనాతో యుద్ధానికి సిద్ధమవుతున్న తైవాన్.. అధికారులు, సైనికులకు సెలవులు రద్దు..

ABN , First Publish Date - 2022-08-02T19:13:11+05:30 IST

తైవాన్ (Taiwan) - చైనా(China)ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు పతాక స్థాయికి చేరాయి. చైనా తన భూభాగంగా చెబుతున్న తైవాన్‌లో దాదాపు 25 ఏళ్ల తర్వాత అమెరికా అత్యున్నత స్థాయి నేత నాన్సీ పెలోసీ (Nancy Pelosi) పర్యటించనుండడం ఉద్రిక్తతలను రాజేసింది.

taiwan china news : చైనాతో యుద్ధానికి సిద్ధమవుతున్న తైవాన్.. అధికారులు, సైనికులకు సెలవులు రద్దు..

తైపీ సిటీ : తైవాన్ (Taiwan) - చైనా(China)ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు పతాక స్థాయికి చేరాయి. చైనా తన భూభాగంగా చెబుతున్న తైవాన్‌లో దాదాపు 25 ఏళ్ల తర్వాత అమెరికా అత్యున్నత స్థాయి నేత నాన్సీ పెలోసీ (Nancy Pelosi) పర్యటించనుండడం ఉద్రిక్తతలను రాజేసింది. యూఎస్ హౌస్ స్పీకర్‌గా ఉన్న నాన్సీ పెలోసి 4 దేశాల ఆసియా పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి తైవాన్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఆమె పర్యటనను చైనా  వ్యతిరేకిస్తోంది. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికాను  హెచ్చరించింది. ఈ పరిణామాలతో తైవాన్ అప్రమత్తమైంది. చైనాతో యుద్ధానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ మిలిటరీని హైఅలర్ట్ చేసిందని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొంతమంది అధికారులు, సైనికులకు సెలవులు కూడా రద్దు చేసినట్టు పేర్కొన్నాయి. తక్షణమే యుద్ధానికి సిద్ధమవ్వాలంటూ గగనతల రక్షణ దళాలకు ఆదేశాలు అందినట్టు తైవాన్ న్యూస్ సంస్థల రిపోర్టులు పేర్కొన్నాయి.


నిప్పుతో పెట్టుకుంటే పోతారు : చైనా

తైవాన్ తన సొంత భూభాగమని, అమెరికా ప్రతినిధి పర్యటన విషయంలో ముందుకెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనా వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తోంది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ ఘాటుగా స్పందించారు. ‘‘ నిప్పుతో చెలగాటమాడేవారు దానితోనే నాశనమవుతారు. పీపుల్ లిబరేషన్ ఆర్మీ చూస్తూ కూర్చోదు.. ఎలాంటి పరిణామాలు జరిగినా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవ్వాలని అమెరికాను మళ్లోసారి హెచ్చరిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు. కాగా అధికారిక సంబంధాలతో తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని చైనా బలంగా విశ్వసిస్తోంది. గతవారం ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఫోన్ కాల్‌లో కూడా మాట్లాడారు. తైవాన్ విషయంలో అమెరికా వైఖరిని బాహాటంగానే తప్పుబట్టిన విషయం తెలిసిందే. అయితే తమకు ఎలాంటి దురుద్దేశం లేదని అమెరికా చెబుతోంది. ఈ పర్యటనతో అమెరికా విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొంది. 


కాగా పౌర యుద్ధంలో కమ్యూనిస్టులు గెలుపొందాక 1949లో తైవాన్, చైనా వేరుపడ్డాయి. ఒకే దేశంగా కొనసాగుతామని అప్పట్లో ఇరు దేశాలూ చెప్పాయి. కానీ జాతీయ నాయకత్వం సూచించే ప్రభుత్వం విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఎలాంటి అధికారిక సంబంధాలు లేవు. అయితే వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో కొన్ని బిలియన్ డాలర్లు ఇరుదేశాలతో ముడిపడి ఉండడం గమనార్హం.

Updated Date - 2022-08-02T19:13:11+05:30 IST