తాకనికట్టులో.. తహసీల్దారుపై వేటు

ABN , First Publish Date - 2020-07-14T10:00:29+05:30 IST

అమరావతి మండలం ముత్తాయపాలెంలో బ్యాంక్‌ తాకట్టులో ఉన్న భూమిని ఇళ్ల స్థలాలకు ఇచ్చి ..

తాకనికట్టులో.. తహసీల్దారుపై వేటు

భూకుంభకోణంపై కలెక్టర్‌కు నివేదిక అందజేసిన ఆర్డీవో 

ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన వారిపై చీటింగ్‌, క్రిమినల్‌ కేసులు


గుంటూరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): అమరావతి మండలం ముత్తాయపాలెంలో బ్యాంక్‌ తాకట్టులో ఉన్న భూమిని ఇళ్ల స్థలాలకు ఇచ్చి ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించిన వ్యవహారంలో అమరావతి తహసీల్దారు నిర్మలపై వేటు పడింది. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ఈ నెల 11న ‘ఇళ్ల స్థలాలకు తాకట్టు భూమి - నకిలీ దస్తావేజులు సృష్టించి నేతలు, అధికారులు కుమ్మక్కు’ అనే శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన జేసీ దినేష్‌కుమార్‌ ఈ భూ కుంభకోణంపై గుంటూరు ఆర్డీవోను దర్యాప్తు అధికారిగా నియమించారు. ఆర్డీవో భాస్కరరెడ్డి రంగంలోకి దిగి విచారణ జరపగా పలు అంశాలు వెలుగుచూశాయి. ముత్తాయపాలెంలోని కొందరు రైతులు కోళ్లఫారాలకు సంబంధించిన రుణం కోసం గుంటూరులోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తాకట్టు పెట్టారని, అదే భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఇచ్చారని విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి  ఎకరం రూ.60 లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి సొమ్ము కూడా తీసుకున్నారు.


బ్యాంకులో తాకట్టు ఉన్న వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టిలోకి రానివ్వకుండా తహసీల్దార్‌ నిర్మల ప్రతిపాదనలు నడిపారని ఆర్డీవో గుర్తించారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఆర్డీవో ఆదివారం కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌కు నివేదిక అందజేశారు. నివేదికలను పరిశీలించిన కలెక్టర్‌ తహసీల్దారును సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన భూ యజమానులపై చీటింగ్‌, క్రిమినల్‌ కేసులు  నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అమరావతి ఇన్‌చార్జి తహసీల్దారుగా పెదకూరపాడు తహసీల్దార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.


రహదారి లేకుండా భూ సేకరణ... 

అమరావతి- క్రోసూరు రోడ్డులో 400 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ముత్తాయపాలెంలో సేకరించిన భూములకు రహదారి సౌకర్యం లేదని అధికారుల విచారణలో తేలింది. రహదారి లేకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వడం వలకల ప్రయోజనం లేదని లబ్ధిదారులు అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ అంశాలను కలెక్టర్‌కు అందజేసిన నివేదికలో పొందుపరిచినట్లు  తెలిసింది. 


బ్యాంక్‌ రుణాన్ని చెల్లించిన రైతులు

అమరావతి: బ్యాంకులో తాకట్టు పెట్టి అదే భూమిని ప్రభుత్వానికి విక్రయించిన మండలంలోని ముత్తాయపాలేనికి చెందిన రైతులు మోదేపల్లి అచ్యుత రామారావు, శ్రీనివాసరావు బ్యాంకుకు నగదు చెల్లించారు.  విజయవాడలోని సెంట్రల్‌ బ్యాంక్‌ రీజియన్‌  కార్యాలయానికి వెళ్లి రుణానికి సంబంధించిన రూ.1.02 కోట్లు చెల్లించారు.  

Updated Date - 2020-07-14T10:00:29+05:30 IST