అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-07-01T07:16:48+05:30 IST

యువత అవకాశాలను సద్వినియో గం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి అన్నారు. పోటీ పరీక్షలపై జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి

నల్లగొండ టౌన్‌, జూన్‌ 30: యువత అవకాశాలను సద్వినియో గం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి అన్నారు. పోటీ పరీక్షలపై జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఉన్నత స్థానం లో ఉంటే ప్రజలకు సేవ చేసే అవకాశంతో పాటు తృప్తితో పాటు కుటుంబ జీవితంలో సుస్థిరత లభిస్తుందన్నారు. జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొని పైకొచ్చిన వారమే ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో తెలుగు మీడియంలో చదివి ఐఏఎస్‌ అధికారిగా, జిల్లా కలెక్టర్‌గా ప్రజలకు సేవలందించానని అన్నారు. కసితో ఇష్టపడి ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఎకానమీ, పాలిటిక్స్‌, హిస్టరీ, మెంటల్‌ ఎబిలిటి, జనరల్‌నాలెడ్జ్‌ పుస్తకాలు చదవాలన్నారు. ఒక్క సబ్జెక్టును చాప్టర్‌గా విభజించుకుని చదివిన ముఖ్యమైన అంశాలను నోట్‌బుక్‌లో నమోదు చేయాలన్నారు. ఒక్కో సబ్జెక్టుకు ఒక పుస్తకాన్ని మాత్రమే ఎంచుకొని చదవాలన్నారు. సమయం కొద్దిగా ఉన్నందున సెల్‌ఫోన్‌, సినిమాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఇంటర్వ్యూ తొలగించినందున పరీక్షలో ఎక్కువ మార్కులు సాధిస్తే ఉద్యోగం పక్కాగా వస్తుందన్నారు. కలెక్టర్‌ రాహుల్‌శర్మ మాట్లాడుతూ పోటీ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు ఎన్నికల కమిషనర్‌ బోధించిన అంశాలను టైం మేనేజ్‌మెంట్‌, సబ్జెక్టుల వారీగా ఎలా చదవాలో చక్కగా వివరించినందున అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T07:16:48+05:30 IST