సామాజిక బాధ్యత తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-05-07T06:39:32+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రబలుతున్న నేపథ్యంలో అధికారులు అందరూ సామాజిక బాధ్యత తీసుకోవాలని, కరోనా మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని వైసీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ మాదాశి వెంకయ్య సూచించారు.

సామాజిక బాధ్యత తీసుకోవాలి
మాట్లాడ్‌తున్న ఎంపీడీవో రాజు

కొండపి, మే 6 : కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రబలుతున్న నేపథ్యంలో అధికారులు అందరూ సామాజిక బాధ్యత తీసుకోవాలని, కరోనా మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని వైసీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ మాదాశి వెంకయ్య సూచించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల టాస్క్‌ఫోర్స్‌ అధికారులతో గురువారం కొండపిలోని మండల పరిషత్‌ సమావేశం హాలులో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి పీవీ నారాయణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెంకయ్య మాట్లాడారు. కరోనా బారిన పడిన రోగులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వారికి ధైర్యం చెప్పాలన్నారు. వైద్య సూచనలు అందించాలని కోరారు. కరోనాతో బాధితులు మరణించిన సందర్భాల్లో అమానవీయ ఘటనలు జరగకుండా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు చూడాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. టంగుటూరు, శింగరాయకొండ మండలాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో శింగరాయకొండలో కోవిడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అధికారులు దాతల సాయంతో కోవిడ్‌ బాధితులను ఆదుకోవాలని, కరోనా మహమ్మారి ప్రజలకుండా గ్రామాల్లోని టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పనిచేయాలని కోరారు. సమావేశంలో డీఎల్‌డీవో జమీఉల్లా, డిప్యూటీ డీఎంహెచ్‌వో వాణిశ్రీ, కొండపి మండల వైసీపీ కన్వీనర్‌ గోగినేని వెంకటేశ్వరరావు మాట్లాడారు. సమావేశంలో తహసీల్దార్లు కామేశ్వరరావు, బాలకిషోర్‌, సువర్ణరావు, వెంకటరెడ్డి, ఉషారాణి, జరుగుమల్లి డిప్యూటీ తహసీల్దార్‌ మామిళ్లపల్లి శ్రావణ్‌, ఎంపీడీవోలు వై. శ్రీనివాసరావు, పమిడి పద్మజ, అజిత, ఎస్సైలు వి.రాంబాబు, రజియా సుల్తానా, నాయబ్‌ రసూల్‌, సంపత్‌కుమార్‌, బ్రహ్మనాయుడు, కొండపి సీహెచ్‌సీ వైద్యాధికారి పి.భక్తవత్సలం, పెట్లూరు పీహెచ్‌సీ డాక్టర్‌ సునీల్‌ గవాస్కర్‌, ఈవోఆర్డీలు, ఎంఈవోలు, ఏవోలు పాల్గొన్నారు.  

నిబంధనలు అమలు చేయాలి 

కొండపి : అన్ని గ్రామాల్లో కరోనా వ్యాప్తి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్‌ వి.కామేశ్వరరావు సూచించారు. గురువారం మధ్యాహ్నం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామాల టాస్క్‌ఫోర్స్‌ బృందాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్‌ జోన్‌లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిబంధనలను పాటించని వారికి జరిమానాలు విధించాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో వై.శ్రీనివాసరావు, ఎస్సై వి.రాంబాబు, ఎంఈవో కే.సురేఖ, ఈవోఆర్డీ ఎం.విజయలక్ష్మి పలు గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. 

దొనకొండ : కరోనా రోజురోజుకూ ఉధృతమవుతోందని, ప్రతి షాపు వద్ద శానిటైజర్‌ ఏర్పాటుతో పాటు భౌతికదూరం పాటించేలా చూడాలని ఎంపీడీవో రాజు సూచించారు. స్థానిక సచివాలయం-1లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై బి.ఫణిభూషణ్‌, డిప్యూటి తహసీల్దార్‌ పి.సురేష్‌బాబు, ఎంఈవో ఎన్‌.సాంబశివరావు, గ్రామ కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

కర్ఫ్యూ అమలును పర్యవేక్షించిన అధికారులు

లింగసముద్రం : మండలంలో అమలు జరుగుతున్న కర్ఫ్యూ ఆంక్షలను కరోనా మండల టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌, తహసీల్దార్‌ ఆర్‌ బ్రహ్మయ్య, ఎంపీడీవో మాలకొండయ్య, ఎస్సై రమేష్‌ పర్యవేక్షించారు. గురువారం  లింగసముద్రం, తిమ్మారెడ్డిపాలెం, విశ్వనాధపురం, వీఆర్‌ కోట, చినపవని, పెదపవని, మొగిలిచెర్ల తదితర గ్రామాల్లో వారు పర్యటించారు. పెదపవని, వీఆర్‌కోట గ్రామాలలో మాస్కులు లేకుండా సరుకులు విక్రయిస్తున్న దుకాణాదారులకు రూ.800 జరిమానా విధించారు. అలాగే విశ్వనాధపురం, తిమ్మారెడ్డిపాలేల్లో రెడ్‌జోన్‌ బోర్డులు  పీకేస్తే మళ్లీ పెట్టించారు.  

ప్రజల్లో అవగాహన కలిగించాలి

తాళ్లూరు : కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నందున సర్పంచ్‌లు ప్రజలకు అవగాహన కలిగించాలని ఎస్సై బి.నరసింహారావు చెప్పారు. స్థానిక ఎంపీడీవో సమావేశంలో గురువారం మండల టాస్క్‌ఫోర్సు, గ్రామసర్పంచ్‌ల సమావేశం జరిగింది. ఎస్సై మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్నందున ప్రజలకు గ్రామసర్పంచ్‌లు అండగా నిలవాలన్నారు. తహసీల్దార్‌ పి.బ్రహ్మయ్య మాట్లాడుతూ  పంచాయతీల్లో పారిశుధ్య పనులు చేయించాలని, శానిటైజేషన్‌ చేయించాలని చెప్పారు. ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు పాల్గొన్నారు.

కట్టుదిట్టంగా కర్ఫ్యూ

సింగరాయకొండ : మండలంలో కరోనా కేసుల ఉధృతి పెరిగిన తరుణంలో ఏర్పాటు చేసిన కర్ఫ్యూ కట్టుదిట్టంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుండి రోడ్లన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి.  గురువారం తహసీల్థార్‌ ఉషారాణి, ఎస్సై సంపత్‌ కుమార్‌ కర్ఫ్యూను పరిశీలించారు. కొవిడ్‌ ప్రవర్తనా నియమాళిని అతిక్రమించే సరైన కారణాలు లేకుండా బయట తిరిగే వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని వీరు హెచ్చరించారు.

తాళ్లూరు : ప్రాణాంతకమైన కరోనా సెకండ్‌ వేవ్‌తో ప్రజలు భయాందోళన చెందుతున్నందున ఎస్సై బి.నరసింహారావు ఆధ్వర్యంలో కర్ఫ్యూ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. రెండురోజులుగా గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలకు అవగాహన కల్గిస్తున్నారు. వీధుల్లో సంచరిస్తున్న వ్యక్తులను హెచ్చరిస్తున్నారు.  నిబంధనలు అతిక్రమించిన  పలువురిపై కేసులు నమోదు చేసి అపరాధరుసుం విధించారు. 

కొనసాగుతున్న కర్ఫ్యూ 

సీఎ్‌సపురం : కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూ సీఎ్‌సపురంలో కొనసాగుతుంది. కర్ఫ్యూతో సీఎ్‌సపురంలోని ప్రధాన రహదారులు జన సంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నాం 12గంటలు కాగానే స్థానిక పోలీసులు దుకాణాలను మూసి వేయించారు. కరోనా మహమ్మారికి భయపడి ప్రజలు కూడా బయటకు రావడం లేదు. స్థానిక ఎస్సై చుక్కా శివబసవరాజు తన సిబ్బందితో మండలంలో పర్యటించి కరోనాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

జనసంచారం లేని రోడ్లు

పామూరు : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ విధించడంతో పాటు పామూరులోని ప్రధాన రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం 12 గంటలు కాగానే పోలీసులు దుకాణాలను మూసి వేయిస్తున్నారు.  కాగా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆర్టీసీ బస్‌ సర్వీసులు డిపోలకే పరిమితం కావడంతో స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ అటు బస్‌లు లేక, ఇటు ప్రయాణికులు లేక వెలవెలపోతుంది.

 రెడ్‌జోన్లు ఏర్పాటు

కురిచేడు : మండలంలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో రెడ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. కురిచేడులో రెండు జోన్లు ఏర్పాటు చేసి రాకపోకలు లేకుండా కట్టడి చేశారు. అలాగే బయ్యవరం గ్రామంలోనూ రెడ్‌జోన్లు ఏర్పాటు చేశారు. ప్రజలందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని వైద్యాధికారి ప్రవీణ్‌ సూచించారు.  

నిబందనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ముండ్లమూరు : కరోనా ఉధృతంగా విస్తరిస్తుండటంతో దాని నివారణకు ప్రజలందరూ సహకరించాలని, అలాగే దుకాణాలను నిర్ణీత గడువులో మూసి వేయాలని ఎస్‌ఐ జీ వెంకటసైదులు చెప్పారు. గురువారం ఆయన ముండ్లమూరులో పలు దుకాణాలను మూసి వేయించారు. ఆయన ముండ్లమూరులోని తాళ్లూరు రోడ్డు, తమ్మలూరు, ఉమా మహేశ్వర అగ్రహారం, ఈదర, వేములబండ, చింతలపూడి గ్రామాలను సందర్శించారు. కార్యక్రమంలో సిబ్బంది విజయ్‌, శేషయ్యలు పాల్గొన్నారు. 

కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలుచేయాలి

పీసీపల్లి, మే 6: కటుదిట్టంగా కర్ఫ్యూను అమలు చేయాలని తహసీల్దార్‌ పీ.సింగారావు అన్నారు. స్థానిక స్త్రీ శక్తి భవనంలో గురువారం మండల కోవిద్‌ టాస్క్‌ఫోర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మహిళా పోలీస్‌, సచివాలయ కార్యదర్శులు, వీఆర్వోలు, పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బందితో ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ నియంత్రణకు ప్రభుత్వం కర్ప్యూను విధించినట్లు ఆయన తెలిపారు. కాగా గడచిన 24గంటల్లో ఏడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మండల ఆరోగ్య విస్తరణాధికారి బేగ్‌ తెలిపారు. పీహెచ్‌సీ పరిధిలో గురువారం 65 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి, 50 వ్యాక్సిన్‌ వేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-07T06:39:32+05:30 IST