‘అన్నమయ్య పీఠం’ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి

Sep 25 2021 @ 01:45AM
అధికారులతో సమీక్షిస్తున్న టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి

టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ఆదేశం 


తిరుమల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలపై నిరంతర పరిశోధనలకు తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత వర్సిటీలో ‘అన్నమయ్య పీఠం’ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై ఆ వర్సిటీ వీసీతో చర్చించాలన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ధార్మిక ప్రాజెక్టులపై ఆయన అధికారులతో సమీక్షించారు. డిజిటలైజేషన్‌ చేసిన అన్నమయ్య సంకీర్తనలను టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచాలన్నారు. అన్నమయ్య, వెంగమాంబ సంకీర్తనలపై త్వరలో వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్‌ పోటీలు నిర్వహించాలన్నారు. ఇప్పటివరకు లభ్యమైన 14 వేల అన్నమయ్య సంకీర్తనలకు అర్థ, తాత్పార్య విశేషాంశాలతో ‘అన్నమయ్య సాహిత్య లహరి’ పేరుతో భక్తులకు అందుబాటులోకి తేవాలని చెప్పారు. దాస సాహిత్యానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు బెంగళూరు వర్సిటీతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. ఎస్వీబీసీలోనూ ప్రత్యేక టైం స్లాట్‌ కేటాయించాలన్నారు. ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్ట్‌ రికార్డు చేసిన 300 దాస సంకీర్తనలతో ‘దాస నమనం’ పేరుతో కర్టాటకలో పాటల పోటీలు నిర్వహించాలని ఈవో ఆదేశించారు. అనంతరం వివిధ ప్రాజెక్టులపై ఈవో సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు ఈవో ధర్మారెడ్డి, ఎఫ్‌ఏ అండ్‌ సీఏవో బాలాజీ, టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి విజయసారథి, అన్నమాచార్య, వెంగమాంబ ప్రాజెక్టుల సంచాలకుడు విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.