ఏకవాక్యంలో మూడుసార్లు తలాక్‌ చెల్లదు

ABN , First Publish Date - 2022-08-06T08:35:30+05:30 IST

ఏకవాక్యంలో మూడుసార్లు తలాక్‌ చెల్లదు

ఏకవాక్యంలో మూడుసార్లు తలాక్‌ చెల్లదు

అలాచెబితే వివాహం రద్దయినట్టు కాదు

స్పష్టంగా చెబుతున్న సుప్రీంకోర్టు తీర్పు 

పెద్దలు సయోధ్య కోసమే ప్రయత్నించాలి

వీలుకానప్పుడే ముస్లించట్టం ప్రయోగించాలి

ప్రస్తుత కేసులో నిబంధనలు పాటించలేదు

భరణానికి భార్య అర్హురాలే: హైకోర్టు


అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): నోటిమాటగా ఏకవాక్యంలో మూడుసార్లు తలాక్‌ చెప్పడం ద్వారా వివాహం రద్దు అయినట్లుకాదని హైకోర్టు తేల్చిచెప్పిం ది. ముస్లిం చట్టం ప్రకారం నోటిమాటగా మూడుసార్లు తలాక్‌ చెప్పడం చెల్లుబాటు కానప్పుడు, తలాక్‌నామా రూపంలో రాసుకున్నా దానికి గుర్తింపు ఉండదని స్పష్టంచేసింది. ఒకే వాక్యంలో మూడుసార్లు తలాక్‌చెప్పి వివాహం రద్దు అయ్యిందని చెప్పడం రాజ్యాంగవిరుద్ధమని సయారాభాను కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేసింది. ఇస్లాం చట్ట నిబంధనల ప్రకారం ముందుగా భార్య, భర్తల తరఫున పెద్దలు మధ్యవర్తులుగా ఉండి వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించాలంది. అది సాధ్యం కానప్పుడు ముస్లిం చట్టంలో పేర్కొన్న విధంగా సరైన కారణాలతో మూడు వేర్వేరు సందర్భాల్లో తలాక్‌ చెప్పాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ప్రస్తుత కేసులో మధ్యవర్తులుగా ఇద్దరు వ్యక్తులు భర్త తరఫు నుంచే ఉన్నారు తప్ప భార్య వైపు నుంచి ఎవరూ లేని విషయం ప్రస్తావించింది. తలాక్‌ చెప్పేందుకు ముస్లిం చట్టంలో పేర్కొన్న  విధానాన్ని అనుసరించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. తలక్‌నామాను రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపించగా ఆమె తిరస్కరించారని భర్త చెప్పడం తప్ప, అందుకు సరైన సాక్ష్యాలు కోర్టు ముందు ఉంచలేదని పేర్కొంది. ఈ నేపధ్యంలో ఆమెకి ఇచ్చిన విడాకులు చెల్లుబాటుకావని, భార్యగానే ఆమెను గుర్తించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. భర్తనుంచి దూరంగా ఉంటున్న మహిళ భరణం పొందేందుకు అర్హురాలని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. సీఆర్పీసీ సెక్షన్‌ 125 ప్రకారం విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ జీవితాంతం(మళ్లీ పెళ్లి చేసుకోనంతవరకు) భరణం పొందేందుకు అర్హురాలని స్పష్టం చేసింది. 2006లో గుంటూరు రివిజన్‌ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దుచేసింది. పిటిషనర్‌తో పాటు కుమారుడికి భరణం చెల్లించాలంటూ ట్రయల్‌ కోర్టు(పొన్నూరు) తీర్పును సమర్ధించింది. జీవనభృతి పెంపును కోరుతూ పొన్నూరు కోర్టును ఆశ్రయించే వెసులుబాటు కల్పించిం ది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ తీర్పు ఇచ్చారు. భర్తను విడిచివెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడినప్పుడు భార్యపడే మానసిక వేదనను మర్చిపోకూడదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఈ సందర్భంగా న్యాయమూర్తి గుర్తు చేశారు. ఆమె తన సొంతకాళ్ల మీద నిలబడే వరకు తగిన జీవన భృతి సమకూర్చాలని ఆదేశించారు. భర్త నుంచి రూ.2 వేలు జీవనభృతి ఇప్పించాలని కోరుతూ పీ గౌస్‌ బీ 2004లో పొన్నూరు కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌తో పాటు ఆమె కుమారుడికి నెలకు రూ.800 చొప్పున భరణం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ భర్త జాన్‌సైదా గుంటూరు మొ దటి అదనపు సెషన్స్‌ కోర్టులో అప్పీల్‌ వేశారు. దానిని విచారించిన కోర్టు పొన్నూరు కోర్టు ఇచ్చిన తీర్పును పాక్షికంగా సవరించింది. కుమారుడికి జీవన భృతి ఇవ్వాలన్న ఆదేశాలను సమర్ధిస్తూ... భార్యకు మెయింటేనెన్స్‌ చెల్లింపుపై ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో గౌస్‌బీ 2006లో హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - 2022-08-06T08:35:30+05:30 IST