TS News: ఎమ్మెల్సీ కవితను కలిసిన మంత్రి తలసాని

ABN , First Publish Date - 2022-08-23T16:10:50+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశారు.

TS News: ఎమ్మెల్సీ కవితను కలిసిన మంత్రి తలసాని

హైదరాబాద్ (Hyderabad): టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha)ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Srinivas Yadav) కలిశారు. నిన్న కవిత ఇంటిపై బీజేపీ (BJP) కార్యకర్తలు దాడికి దిగడంపై దాడిని ఖండిస్తూ కవితకు తలసాని సంఘీభావం తెలిపారు. మంత్రితోపాటు భారీగా కార్యకర్తలు చేసుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ  బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేసిన తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కవిత టార్గెట్‌గా బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత నివాసం వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య ఘర్షణ జరిగి పరస్పర దాడులకు దారితీసింది. బీజేపీ నాయకులను టీఆర్‌ఎస్‌ శ్రేణులు కర్రలతో వెంటపడి తరిమాయి. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని ఆరోపణలు రాగా, ఆమె తన పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా పలువురు బీజేపీ, బీజేవైఎం, మహిళా మోర్చా నాయకులు బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 14లోని కవిత నివాసాన్ని ముట్టడించేందుకు వచ్చారు.


విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు కవిత నివాసం వద్దకు వచ్చి రక్షణగా నిలిచాయి. మరోవైపు బంజారాహిల్స్‌ పోలీసులు కవిత నివాసానికి 300 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులను అక్కడే అడ్డుకున్నారు. అయితే కొందరు కార్యకర్తలు కవిత నివాసం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వారిలో కొంత మందిని పోలీసులు అరెస్టు చేసి డీసీఎం వ్యాన్‌ ఎక్కించారు. మరికొంత మంది కవిత నివాసం వైపు పరుగులు తీశారు. 


కర్రలతో తరుముతూ దాడి..కవిత నివాసం వద్ద రక్షణగా ఉన్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు.. బీజేపీ నాయకులు అటుగా రావడాన్ని చూసి రెచ్చిపోయారు. వాగ్వాదంతో మొదలై.. కొద్దిసేపటి తరువాత బీజేపీ నాయకులపై కర్రలతో దాడి చేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకుడు సామరంగారెడ్డి, మరో నాయకుడి దుస్తులు ఊడేలా తరిమారు. పోలీసులు అరెస్టు చేయడంతో డీసీఎం వ్యాన్‌లో ఎక్కిన బీజేపీ నేతలపై కూడా దాడి చేశారు. ప్రతిదాడి చేసేందుకు బీజేపీ నాయకులు కూడా డీసీఎం వ్యాన్‌ నుంచి కిందకు దిగారు. తీవ్ర తోపులాటలు చోటు చేసుకున్నాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను కూడా పక్కకు తోసేసి.. పరస్పరం దాడులు చేసుకున్నారు.

Updated Date - 2022-08-23T16:10:50+05:30 IST