మళ్ళీ తాలిబాన్లు

ABN , First Publish Date - 2021-07-10T06:46:58+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లో ఎనభైఐదుశాతం భూభాగం తమ అధీనంలోనే ఉన్నదని తాలిబాన్‌ శుక్రవారం ప్రకటించింది. అమెరికాసేనలు వదిలిపెట్టిన దేశాన్ని తాలిబాన్‌ అతివేగంగా చుట్టబెడుతున్నదని వార్తలు వెలువడుతున్న....

మళ్ళీ తాలిబాన్లు

అఫ్ఘానిస్థాన్‌లో ఎనభైఐదుశాతం భూభాగం తమ అధీనంలోనే ఉన్నదని తాలిబాన్‌ శుక్రవారం ప్రకటించింది. అమెరికాసేనలు వదిలిపెట్టిన దేశాన్ని తాలిబాన్‌ అతివేగంగా చుట్టబెడుతున్నదని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, రష్యాలో విలేకరుల సమావేశంలో తాలిబాన్‌ ప్రతినిధి బృందం ఈ ప్రకటన చేసింది. తమవల్ల రష్యాకు కానీ, మధ్య ఆసియాలోని దాని మిత్రదేశాలకు కానీ ఎటువంటి ముప్పూ ఉండదని హామీ ఇచ్చేందుకు తాలిబాన్‌ ఈ పర్యటన జరిపింది. 


తాలిబాన్‌ లెక్కలను అప్ఘాన్‌ ప్రభుత్వం ఖండించలేదు. తాలిబాన్లు ఆయా ప్రాంతాలను చుట్టబెడుతూంటే, వేలాదిమంది అఫ్ఘానిస్థాన్‌ సైనికులు తజకిస్థాన్‌లోకి పారిపోయారని వార్తలు వచ్చాయి. చాలా ప్రాంతాలు చిన్నపాటి ఘర్షణ కూడా లేకుండా అధీనంలోకి వచ్చేశాయి. అఫ్ఘానిస్థాన్‌లోని పెద్ద నగరాల్లో ఒకటైన మజారే ఇ షరీఫ్‌లో యుద్ధం జరుగుతున్న వార్తలూ వచ్చాయి. అఫ్ఘాన్‌ సైనికులు ఆయుధ విసర్జన చేయడంతో తజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ వంటి దేశాల్లోకి దారితీసే మార్గాలు కూడా తాలిబాన్‌ అధీనంలోకి వచ్చేశాయి. గురువారం ఇరాన్‌ సరిహద్దు ప్రాంతాలు వశమైనాయి. అఫ్ఘానిస్థాన్‌కు ఉత్తరంగా ఉన్న మాజీ సోవియట్‌ దేశాలకు తాలిబాన్‌ వల్ల సమస్యలు తలెత్తవచ్చునని రష్యా అనుమానిస్తున్న నేపథ్యంలో, అటువంటి అనుమానాలూ భయాలూ అక్కరలేదని హామీ ఇచ్చి రష్యాను చల్లబరచడం ఈ ప్రతినిధి బృందం లక్ష్యం. 


గురువారం జో బైడెన్‌ బలగాల ఉపసంహరణను సమర్థించుకున్న కొద్దిగంటల్లోనే తాలిబాన్‌ ఈ లెక్కలు ప్రకటించింది. అమెరికన్‌ సైనికులు ఆఫ్ఘాన్‌ను వదిలిపెట్టే గడువు అధికారికంగా ఎంతో దూరంగా ఉండగానే, గతనెలలో సగంమంది స్వదేశానికి తరలిపోయిన విషయం తెలిసిందే. మిగిలిన సగం మంది అమెరికన్‌ సైనికులు, నాటోదళాలు బాగ్రం వైమానిక స్థావరాన్ని ఖాళీచేసి వారం క్రితం వెళ్ళిపోగానే తాలిబాన్‌కు ఉత్సాహం తన్నుకొచ్చింది. ఉగ్రవాదం అంతం లక్ష్యంగా రెండు దశాబ్దాల క్రితం అక్కడ కాలూనిన తమ కర్తవ్యం ముగిసిందని ఈ దేశాలు చెప్పుకున్నాయి. దాదాపు రెండులక్షల కోట్ల డాలర్లు ఖర్చయిన ఈ యుద్ధం కారణంగా కనీసం లక్షమంది అఫ్ఘాన్‌పౌరులు, డెబ్బయ్‌వేలమంది అఫ్ఘాన్‌ సైనికులు, నాలుగువేలమంది అమెరికా–నాటో సైనికులు మరణించారు. అధికారాన్ని కోల్పోయిన తరువాత కూడా తాలిబాన్‌ సుదీర్ఘకాలం పోరాడి, సగం దేశాన్ని నిలబెట్టుకోగలిగింది. ట్రంప్‌ ఏలుబడిలో గత ఏడాది ఫిబ్రవరిలో తాలిబాన్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం మే ఒకటవ తేదీకల్లా ఈ విదేశీ సైనికులంతా దేశాన్ని విడిచిపోవలసి ఉండగా, బైడెన్‌ ఆ గడువు పొడిగించారు.


ఇంతలోగా నలుగురినీ కలుపుకొని తాలిబాన్‌ను కాస్తంత దారికి తేవచ్చునన్నది ఆయన ఆలోచన. కానీ, గడువుకంటే ముందుగానే ఉపసంహరణ జరిగిపోవడం, తాలిబాన్‌లు తాము గతంలో కోల్పోయిన భూభాగాలను తిరిగివశం చేసుకుంటూ కాబూల్‌కు యాభైకిలోమీటర్ల దూరం వరకూ చొచ్చుకువచ్చేయడం పలు ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. తాము ఎన్ని ప్రాంతాలను జయించినా, అంతిమంగా అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వంతో చర్చలే తప్ప యుద్ధాన్ని కోరుకోబోమని తాలిబాన్‌ అంటోంది. అమెరికా, దాని మిత్రదేశాలు సహా ప్రపంచంలోని ఏ దేశానికీ వ్యతిరేకంగా అఫ్ఘాన్‌ భూభాగాన్ని ఎవరినీ వాడుకోనిచ్చేది లేదని కూడా తాలిబాన్‌ ప్రతినిధులు ఈ విలేకరుల సమావేశంలో స్పష్టంచేశారు. అఫ్ఘాన్‌ సమస్యకు చర్చల ద్వారా రాజకీయపరిష్కారాన్ని సాధించాలన్నదే లక్ష్యమని అంటున్నారు. కానీ, తాలిబాన్లు తాము తిరిగి అధీనంలోకి తెచ్చుకున్న ఆయా ప్రాంతాల జైళ్ళలో బందీలుగా ఉన్న వివిధ సంస్థలకు చెందిన ఉగ్రవాదులను విడిచిపెడుతున్నారని వార్తలు వస్తున్నాయి.


అల్‌కాయిదా నాశనం, లాడెన్‌ అంతం అనే లక్ష్యాలతో అఫ్ఘాన్‌లోకి అడుగుపెట్టిన అమెరికా తొలిపదేళ్ళలో సదరు ఉగ్రసంస్థను బలహీనపరిచి, చెల్లాచెదురయ్యేట్టు చేయగలిగింది. మరోపదేళ్ళకు లాడెన్‌ను పాకిస్థాన్‌లో హతం చేసింది. కానీ, అఫ్ఘాన్‌ పునర్మిర్మాణం మాత్రం ఆశించిన రీతిలో జరగలేదు. పాకిస్థాన్‌ను పూర్తిగా నమ్మడం ద్వారా తాలిబాన్‌లకు తిరిగి ఊపిరిపోసింది. ట్రంప్‌ ఎన్నికల హామీ అని మాత్రమే కాక, అఫ్ఘాన్‌ను ఇప్పుడు అమెరికా ఆర్థికంగా భరించే స్థితిలో కూడా లేదు. అఫ్ఘాన్‌ భూభాగాన్ని అమెరికాకు వ్యతిరేకంగా వాడుకోనివ్వబోమని తాలిబాన్‌ హామీ ఇవ్వడంతో దేశాన్ని దానికే అప్పగించడానికి సిద్ధపడింది. అఫ్ఘాన్‌ ప్రభుత్వమూ, దాని అధీనంలోని వ్యవస్థలు తాలిబాన్‌ను నిరోధించగలిగే స్థితిలో లేవని ఇప్పటికే తేలిపోయింది. రెండు దశాబ్దాల యుద్ధం తిరిగి ఆ దేశాన్ని దాని పూర్వస్థితికి తెచ్చి వదిలేయడం విచిత్రం.

Updated Date - 2021-07-10T06:46:58+05:30 IST