తాలిబన్ హిజాబ్ డిక్రీపై UNAMA ఆందోళన

ABN , First Publish Date - 2022-05-08T22:22:02+05:30 IST

బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తప్పకుండా హిజాబ్ ధరించాలన్న తాలిబన్ల తాజా డిక్రీపై ఆఫ్ఘనిస్థాన్‌లోని ఐక్యరాజ్యసమితి

తాలిబన్ హిజాబ్ డిక్రీపై UNAMA ఆందోళన

కాబూల్: బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తప్పకుండా హిజాబ్ ధరించాలన్న తాలిబన్ల తాజా డిక్రీపై ఆఫ్ఘనిస్థాన్‌లోని ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ (UNAMA) ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల అంతర్జాతీయ సమాజానికి ఆఫ్ఘనిస్థాన్ మరింత దూరం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. తమకు అందిన సమాచారం ప్రకారం ఇదేమీ ప్రతిపాదన కాదని, అధికారిక ఆదేశమని, హిజాబ్ డిక్రీని అమలు చేయనున్నారని తెలుస్తోందని ఐక్యరాజ్య సమితి సహాయ మిషన్ పేర్కొంది. 


మహిళలు, బాలికలు సహా ఆఫ్ఘానీలందరికీ రక్షణ కల్పిస్తామని, వారి మానవ హక్కులను కాపాడతామని గత దశాబ్దకాలంగా చర్చల సందర్భంగా అంతర్జాతీయ సమాజానికి తాలిబన్లు (Taliban) ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఇది ఉందని యూఎన్ఏఎంఏ తెలిపింది. తాజా ఆదేశాలపై మరింత స్పష్టత కోసం తాలిబన్ ముఖ్య నేతలతో సమావేశం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది.


బహిరంగ ప్రదేశాల్లో మహిళలందరూ తప్పకుండా తమ ముఖాలను కప్పుకోవాలంటూ శనివారం తాలిబన్ అత్యున్నత నేత ముల్లా హిబతుల్లా అఖుంజాదా డిక్రీ జారీ చేశారు. ఒకవేళ మహిళలు ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఆమె తండ్రి, లేదంటే ఆమెకు అత్యంత సన్నిహితుడైన బంధువును జైలుకు పంపుతామని, ఒక వేళ ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.

Read more