Afghanistan : కాబూల్‌లో ఇండియన్ మిషన్‌కు భద్రత కల్పిస్తాం : తాలిబన్లు

ABN , First Publish Date - 2022-08-14T18:01:43+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)లో దౌత్య కార్యకలాపాలను ప్రారంభించేందుకు

Afghanistan : కాబూల్‌లో ఇండియన్ మిషన్‌కు భద్రత కల్పిస్తాం : తాలిబన్లు

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)లో దౌత్య కార్యకలాపాలను ప్రారంభించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న కృషిని తాలిబన్లు (Taliban) స్వాగతించారు. తాలిబన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో, కాబూల్‌లోని ఇండియన్ మిషన్‌ (Indian mission)కు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. 


ఆఫ్ఘనిస్థాన్‌లో భారత దేశ దౌత్య సంబంధాల వల్ల భారత్ గతంలో ప్రారంభించి, అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తవుతాయని, కొత్త ప్రాజెక్టులు ఏర్పాటవుతాయని ఆశిస్తున్నట్లు ఈ ప్రకటనలో తాలిబన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబూల్‌లో భారత దేశ దౌత్య ప్రాతినిధ్యాన్ని అప్‌గ్రేడ్ చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నా్మని తెలిపింది. భద్రతను కల్పించడంతోపాటు దౌత్యవేత్తల విశేష అధికారాల పట్ల సునిశిత శ్రద్ధ కనబరుస్తామని, అన్ని విధాలుగా సహకరిస్తామని  హామీ ఇచ్చింది. దౌత్యపరమైన ప్రాతినిధ్యాన్ని అప్‌గ్రేడ్ చేయడంతోపాటు, దౌత్యవేత్తలను నియమించడం వల్ల ఆఫ్ఘన్-భారత్ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపింది. 


ఆఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వాన్ని తాలిబన్లు గత ఏడాది ఆగస్టులో స్వాధీనం చేసుకున్నారు. భద్రతపరమైన ఆందోళన వ్యక్తమవడంతో ఇక్కడ పని చేస్తున్న దౌత్య సిబ్బందిని స్వదేశానికి రప్పించారు. అయితే జూన్‌లో కాబూల్‌లోని ఇండియన్ మిషన్‌లో ఓ టెక్నికల్ టీమ్‌ను నియమించి, కార్యకలాపాలను భారత ప్రభుత్వం పునరుద్ధరించింది. 


ఇదిలావుండగా, ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని భారత దేశం ఇంకా గుర్తించలేదు. నిజమైన సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతోంది.  ఇతర దేశాలపై ఉగ్రవాద దాడులు చేయడానికి ఆఫ్ఘన్ గడ్డను అనుమతించరాదని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఆఫ్ఘన్‌కు గత కొన్ని నెలల్లో మన దేశం మానవతావాద సాయం అందజేస్తోంది. 


సుప్రీం లీడర్ హామీ

ఇతర దేశాలపై ఉగ్రవాద దాడులు చేయడానికి తమ గడ్డను ఉపయోగించుకునేందుకు ఎవరినీ అనుమతించబోమని తాలిబన్ సుప్రీం లీడర్ హెబతుల్లా అఖుండ్‌జాదా (Hebatullah Akhundzada) గత నెలలో హామీ ఇచ్చారు.


Updated Date - 2022-08-14T18:01:43+05:30 IST