Afghanistan : మహిళా నిరసనకారులపై విరుచుకుపడిన తాలిబన్లు... తుపాకీ మడమలతో దాడులు...

ABN , First Publish Date - 2022-08-13T22:05:12+05:30 IST

తినడానికి తిండి, చేయడానికి పని కావాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన మహిళలపై

Afghanistan : మహిళా నిరసనకారులపై విరుచుకుపడిన తాలిబన్లు... తుపాకీ మడమలతో దాడులు...

కాబూల్ : తినడానికి తిండి, చేయడానికి పని కావాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన మహిళలపై తాలిబన్లు ఉక్కుపాదం మోపారు. గాలిలోకి కాల్పులు జరుపుతూ భయభ్రాంతులకు గురి చేశారు. చెల్లాచెదురైన మహిళలను వెంటాడి మరీ కొట్టారు. ప్రాణ భయంతో సమీపంలోని దుకాణాలలో తలదాచుకున్న కొందరు మహిళలపై తుపాకీ గొట్టాలతో దాడి చేశారు. 


ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) ప్రభుత్వాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకుని ఓ సంవత్సరం కావస్తోంది. తమకు ఉద్యోగం, ఉపాధి, స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 40 మంది మహిళలు విద్యా మంత్రిత్వ శాఖ కార్యాలయం వెలుపల నిరసన తెలిపారు. తమకు న్యాయం కావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘ఆగస్టు 15 బ్లాక్ డే’ అనే నినాదంతో ఓ బ్యానర్‌ను ప్రదర్శించారు. (తాలిబన్ల) ‘అజ్ఞానం’తో విసుగెత్తిపోయామని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న పాత్రికేయులను సైతం తాలిబన్లు వదిలిపెట్టలేదు. 


ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినవారిలో ఒకరైన ఝోలియా పార్సి మీడియాతో మాట్లాడుతూ, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై తాలిబన్లు దాడి చేశారని చెప్పారు. తాము ప్రదర్శిస్తున్న బ్యానర్లను చించేశారని, కొందరి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను లాక్కున్నారని చెప్పారు. 


ఇదిలావుండగా, తాలిబన్లు (Talibans) గతం కన్నా భిన్నంగా ప్రజలకు అనుకూలంగా పరిపాలనను అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. ముఖ్యంగా మహిళల హక్కులపై అనేక ఆంక్షలను విధించారు. గత ఏడాది ఆగస్టు 15న ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత బాలికలకు చదువుకునే అవకాశం లేకుండా చేశారు. అంతకు ముందు మహిళలు ప్రభుత్వోద్యోగాలు చేసేవారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని తిరిగి కార్యాలయాలకు రానివ్వడం లేదు. మహిళలు ఎక్కువ దూరం ఒంటరిగా ప్రయాణించడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు. కాబూల్‌లో పార్కులు, పబ్లిక్ గార్డెన్స్‌లోకి పురుషులకు అనుమతిలేని రోజుల్లో మాత్రమే మహిళలను అనుమతిస్తున్నారు. 


ఆఫ్ఘనిస్థాన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్‌జాదా (Hibatullah Akhundzada) మే నెలలో జారీ చేసిన ఆదేశాల్లో, మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ముఖంతో సహా మొత్తం శరీరాన్ని కప్పుకోవాలని స్పష్టం చేశారు. 


మహిళలపై ఇటువంటి దారుణమైన ఆంక్షలను విధించడాన్ని ఐక్య రాజ్య సమితి (United Nations), మానవ హక్కుల సంఘాలు (Human Rights Groups) తీవ్రంగా తప్పు పడుతున్నాయి. మరోవైపు దేశంలో కరువుకాటకాలు (Draught) విలయతాండవం చేస్తున్నాయి. ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధం ప్రభావం కూడా తీవ్రంగా ఉంది. 


Updated Date - 2022-08-13T22:05:12+05:30 IST