చర్చంతా ఎన్నికల చుట్టే!

ABN , First Publish Date - 2021-01-10T06:35:17+05:30 IST

పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా? రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు హైకోర్టు జోక్యంతో ఆగిపోతాయా?...... శనివారం జిల్లావ్యాప్తంగా జనం మధ్య నడిచిన చర్చంతా ఇదే.

చర్చంతా ఎన్నికల చుట్టే!

తిరుపతి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా? రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు హైకోర్టు జోక్యంతో ఆగిపోతాయా?...... శనివారం జిల్లావ్యాప్తంగా జనం మధ్య నడిచిన చర్చంతా ఇదే.గత  ఏడాది మార్చిలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు కొవిడ్‌ సంక్షోభంతో వాయిదా పడ్డాయి. 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ శుక్రవారం రాత్రి షెడ్యూలు ప్రకటించారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ శనివారం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈసీ షెడ్యూలు మేరకు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది.రాజకీయ పార్టీలతో పాటు ప్రజల దృష్టి కూడా ఇపుడు సోమవారం హైకోర్టులో సంభవించబోయే పరిణామాలపై వుంది.వైసీపీ వర్గాలు, సానుభూతిపరులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు జరగవంటూ ధీమా వ్యక్తం చేస్తుండగా ఇతర రాజకీయ పక్షాల సానుభూతిపరులు, తటస్థులు మాత్రం ఎన్నికలు ఆపడానికి ప్రభుత్వం చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇతర కార్యక్రమాలకు అడ్డు కాని కరోనా పంచాయతీ ఎన్నికలకు ఎలా అడ్డమవుతుందని ప్రశ్నిస్తున్నారు.


ఎన్నికల నిర్వహణలో పాల్గొనం

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 9: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో పాల్గొనబోమని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు తేల్చిచెప్పారు.కలెక్టరేట్‌లో  శనివారం   జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విజయసింహారెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న 70 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారని గుర్తుచేశారు.సెకండ్‌ వేవ్‌ అమలులో మండల టాస్క్‌ఫోర్స్‌ కమిటీల్లో అధికారులు భాగమై, విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. ప్రజా రక్షణే లక్ష్యంగా ప్రాణాలొడ్డి కొవిడ్‌ సేవలందిస్తూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను అకస్మాత్తుగా ఈసీ ప్రకటించి అయోమయం సృష్టించిందని విమర్శించారు. ఉద్యోగుల కష్టాలను గుర్తించి ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు.పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్‌, పలుసంఘాల నాయకులు రవీంద్రారెడ్డి, బాలాజీరెడ్డి, పార్థసారథి, హేమాద్రిరాజు, హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.


ఎన్నికల నిర్వహణపై ఆదేశాలందలేదు:కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 9: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలందలేదని కలెక్టర్‌ భరత్‌గుప్తా పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల కోడ్‌ అమలు గురించి ఇప్పుడేమీ చెప్పలేనన్నారు. రెండో విడత అమ్మఒడి, ఇళ్లపట్టాల పంపిణీ తదితర సంక్షేమ కార్యక్రమాలు కొనసాగడంపై స్పష్టత ఇవ్వలేదని తేల్చారు. నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులు విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికలను వాయిదా వేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్‌ గురించి తానేమీ మాట్లాడడని చెప్పారు. సమావేశంలో ఎస్పీలు సెంథిల్‌కుమార్‌, రమే్‌షరెడ్డి పాల్గొన్నారు.


ఎన్నికలను స్వాగతిస్తున్న వైసీపీయేతర పార్టీలు

వైసీపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీల నేతలందరూ పంచాయతీ ఎన్నికలను స్వాగతించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపు ఇచ్చారని జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నానీ చెప్పారు. కేంద్రం నుంచీ నిధులు రావాలంటే పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు జరపాల్సిందేనని జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జి కిరణ్‌ రాయల్‌ అన్నారు. ఎన్నికలంటే వైసీపీకి ఎందుకంత భయమని ప్రశ్నించారు. బహుశా సర్వేలలో ప్రతికూల ఫలితాలు వచ్చినట్టున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడైనా జరగాల్సిందేనని, షెడ్యూలు జారీ అయింది కాబట్టి ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ సురేష్‌ అన్నారు. ఎన్నికల వాయిదాకు కరోనా సరైన కారణం కాదన్నారు. తగిన కారణం చూపి ఎన్నికలు వాయిదా వేస్తే అభ్యంతరం లేదన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అభ్యంతరం లేదని, అయితే వాటికంటే ముందే అర్ధాంతరంగా ఆగిన మండల, జడ్పీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరపాలని బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందేనని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం, ప్రభుత్వం సంయుక్తంగా, సమన్వయంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.పుల్లయ్య డిమాండ్‌ చేశారు.


నిర్లిప్తంగా అధికార యంత్రాంగం

తమకు పంచాయతీ ఎన్నికల గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని సాక్షాత్తూ కలెక్టర్‌ భరత్‌ గుప్తాయే స్పష్టం చేయడంతో అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లు మొదలు పెట్టే ప్రసక్తే లేదని తేలిపోయింది. దానికనుగుణంగానే జిల్లాలో  యంత్రాంగం ఎక్కడా ఎన్నికల నియమావళి అమలుపై దృష్టి సారించలేదు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన పలు కార్యక్రమాల సందర్భంగా అధికార పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు వంటివి తొలగించే ప్రయత్నమేదీ జరగలేదు. రాజకీయ పార్టీల ప్రముఖుల విగ్రహాలకు ముసుగులు వేసే ప్రయత్నమూ చేయలేదు. కుప్పంలో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకంగా ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పైనే విమర్శలు చేశారు. అవి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు వచ్చే అవకాశమున్నా ఎవరూ ఖాతరు చేసే పరిస్థితి కనిపించడం లేదు.


వద్దంటున్న ఉద్యోగ సంఘాలు

పంచాయతీ ఎన్నికల నిర్వహణ గురించి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు వద్దని తెగేసి చెబుతుండగా ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నాయి. ఏపీ రెవిన్యూ సర్వీసెస్‌ జిల్లా అధ్యక్షుడు విజయసింహారెడ్డి, ఏపీ ఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు కేవీ రాఘవులు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. డ్రైరన్‌ ప్రారంభమవుతోందని, ఆ విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులే అధికంగా పాల్గొంటున్నారని వారు చెప్పారు. ఉద్యోగుల్లో చాలామంది 50 ఏళ్ళు దాటిన వారే వున్నందున ఎన్నికలు ఇపుడు నిర్వహిస్తే ఇబ్బంది కలుగుతుందన్నారు. అందుకే వాయిదా వేయాలని కోరారు. కరోనా వ్యాక్సిన్‌ వేసే వరకూ వాయిదా వేయాలని, తర్వాత జరిపితే అభ్యంతరం లేదని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాము ప్రభుత్వ సేవకులమని, ఎన్నికల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి వెళతామని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్‌రెడ్డి తేల్చి చెప్పారు. స్ట్రెయిన్‌ వైరస్‌ ప్రబలుతున్నందున ఇపుడు ఎన్నికలు జరిపితే లేనిపోని సమస్యలు వస్తాయి కనుక వాయిదా వేయాలని వైఎస్‌ఆర్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు గోవిందస్వామి సూచించారు. తెలుగునాడు టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు రజనీ బాబు మాత్రం ఎన్నికల విధుల్లో పాల్గొంటామని, పంచాయతీ ఎన్నికలు నిర్వహించల్సిన అవసరముందని ప్రకటించారు. ఇక యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ రమణ అయితే ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ మంచిది కాదన్నారు. సమన్వయంతో వ్యవహరించాలని, ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా నిర్ణయాలు తీసుకుమంటే మంచిదని సూచించారు.


ఈసీ ఆగ్రహానికి గురైన అధికారులు బదిలీ కావాల్సిందే!

  మున్సిపల్‌, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల సందర్భంగా అక్రమాలను, దౌర్జన్యాలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురైన కలెక్టర్‌, తిరుపతి అర్బన్‌ ఎస్పీ, మరికొందరు కిందిస్థాయి అధికారులు జిల్లా నుంచీ బదిలీ కావాల్సిందేనంటూ మెజారిటీ పార్టీల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. కేవలం వీరినే కాకుండా జిల్లాలోని ఽఅధికారులను, పోలీసు అధికారులను బదిలీ చేయాలని, పూర్తిగా బయట నుంచీ కొత్తవారిని రప్పించి ఎన్నికలు నిర్వహించాలని జనసేన నేత కిరణ్‌రాయల్‌ డిమాండ్‌ చేశారు. అధికారులను బదిలీ చేయకపోతే గత మార్చి అనుభవాలే తిరిగి ఎదురవుతాయన్నారాయన. ఎన్నికల సంఘం బదిలీకి ఆదేశించిన వారిని జిల్లాలో కొనసాగించడం తగదని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ సురేష్‌ అభిప్రాయపడ్డారు. వారిని బదిలీ చేసి కొత్తవారిని నియమించాకే ఎన్నికలు జరపాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు జరిగినందున అధికారులను బదిలీ చేసినంత మాత్రాన ఉపయోగం వుండదని బీజేపీ నేత దయాకర్‌రెడ్డి అన్నారు. జిల్లాల ఎన్నికల బాధ్యులను నియమించే అధికారం ఎన్నికల సంఘానికే అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అధికారులను బదిలీ చేయాల్సిందేనని సీపీఐ నేత రామానాయుడు స్పష్టం చేయగా కొత్తవారైతే జిల్లాపై అంత త్వరగా అవగాహన ఏర్పడదని సీపీఎం నేత పుల్లయ్య అన్నారు. అధికారుల బదిలీలతో నిమిత్తం లేకుండా వున్న అధికారులు బాధ్యతగా పనిచేస్తే చాలునని టీడీపీ నేత పులివర్తి నానీ అన్నారు.


 అర్ధాంతరంగా ఆగిన ఆ ఎన్నికల మాటేమిటో!

 గత ఏడాది మార్చి నెలలో అర్థాంతరంగా ఆగిపోయిన మున్సిపల్‌, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల గురించి జనంలో అయోమయం నెలకొంటోంది. వాస్తవానికి ఈ మూడు ఎన్నికల ప్రక్రియ మొదలై సగంలో ఆగిపోయింది. అప్పటికి పంచాయతీ ఎన్నికల షెడ్యూలు మాత్రమే వెలువడింది. అయితే ఇపుడు అర్ధాంతరంగా ఆగిన ఎన్నికలను వదిలిపెట్టేసి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పూనుకోవడంతో జనం అయోమయానికి గురవుతున్నారు. అర్ధాంతరంగా ఆగిన ఎన్నికలు ఏమవుతాయనేది ప్రశ్నగా మారింది. వాస్తవానికి ఆ ఎన్నికల్లో పెద్దఎత్తున అధికార పార్టీ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. వీటి విషయంలో కూడా వైసీపీ మినహా మిగిలిన పార్టీలలో మెజారిటీ అభిప్రాయం ఎన్నికలను రద్దుచేసి కొత్తగా నిర్వహించాలన్నదే. మున్సిపల్‌, జడ్పీ, మండల పరిషత్‌ల ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని, తిరిగి కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌, సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు. ఒక సీపీఎం నేత మాత్రమే ఎన్నికలకు ఇప్పటికే బాగా డబ్బు ఖర్చు చేసినందున రాష్ట్రప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో వుంచుకుని ఆగిన ఎన్నికలను యధాప్రకారం కొనసాగించాలని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-01-10T06:35:17+05:30 IST