అప్పుడైనా.. ఇప్పుడైనా..నేనింతే

ABN , First Publish Date - 2021-02-21T06:43:40+05:30 IST

ఖుష్బూ.. ఒకప్పుడు తమిళ ప్రజల దేవత. అందుకే గుడి కూడా కట్టేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో హీరోయిన్‌గా నటించిన ఖుష్బూ రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు

అప్పుడైనా.. ఇప్పుడైనా..నేనింతే

ఖుష్బూ.. ఒకప్పుడు తమిళ ప్రజల దేవత. అందుకే గుడి కూడా కట్టేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో హీరోయిన్‌గా నటించిన ఖుష్బూ రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. తాను అనుకున్న విషయాలను ఎటువంటి శషభిషలు లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే ఖుష్బూ తన బిజీ షెడ్యూల్‌లో నవ్యకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాల నుంచి రాజకీయాల దాకా, మతాంతర వివాహం నుంచి మానవత్వం దాకా, వ్యక్తిగత జీవితం నుంచి వృత్తిపరమైన వ్యాపకం దాకా ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..





మీరు సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ రెండింటి మధ్యా తేడా ఏదైనా ఉందా?

నాకేమీ పెద్ద తేడా అనిపించలేదు. అప్పుడు షూటింగ్‌లతో బిజీ.. ఇప్పుడు సమావేశాలు, సభలతో బిజీ.  అయితే నాకంటూ వ్యక్తిగతంగా సమయం లేకుండా పోయింది. సాధారణంగా రాత్రిపూట భోజనం చేసిన తర్వాత కొద్ది సేపు టీవీ చూస్తా. ఆడాలనిపిస్తే మొబైల్‌లో ఒక గేమ్‌ ఆడుతా! ప్రస్తుతం నాకున్న సమయం అదే. ఇక నాకున్న పాత అలవాట్లనే కొనసాగిస్తున్నా. ఉదాహరణకు మా ఆయన సుందర్‌ డ్రెస్సులు నేను సెలక్ట్‌ చేస్తా. ఎంత బిజీలో ఉన్నా ఆ పని తప్పనిసరిగా చేస్తా. ఎల్లుండి నుంచి మా ఆయన సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది. అందువల్ల మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత కాస్ట్యూమ్స్‌ కొనడానికి వెళ్లాలి. ‘ఖాలీ దిమాగ్‌ షైతాన్‌ కా ఘర్‌’ అంటారు కదా! దాన్ని నేను గాఢంగా నమ్ముతా. అందుకే ఎప్పుడూ నా బుర్రను బిజీగా ఉంచుతా. ఇక రాజకీయాల్లో నాకున్న మైనస్‌ పాయింట్‌ ఉన్నది ఉన్నట్లు చెప్పడం. దీనివల్ల అప్పుడప్పుడూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట కూడా వాస్తవమే. కానీ నేను మారను. నేనింతే!


మీరు మూడు పార్టీలు ఎందుకు మారారు? అని కొందరు అడుగుతూ ఉంటారు.

‘ఎక్కడైతే గౌరవం ఉండదో అక్కడి నుంచి వెళ్లిపో’ అని మా అమ్మ చెప్పింది. గౌరవం లేని చోట నేను ఇమడలేను. డీఎంకే నుంచి ఎందుకు బయటకు వచ్చానో కలైంజర్‌ కరుణానిధి గారికి మాత్రమే తెలుసు. అక్కడ ఈగో క్లాష్‌ వల్లనే బయటకు వచ్చాను. కాంగ్రెస్‌లోనూ అదే జరిగింది. ఇక బీజేపీలో చేరడానికి- ఆ పార్టీ సిద్ధాంతాలు నాకు నచ్చాయి. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే-  ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు, ఎడ్యుకేషన్‌ పాలసీ, స్వచ్ఛ భారత్‌కు మద్దతు పలికాను.  దూరం నుంచి నేను చూసిన బీజేపీ వేరు, ఇప్పుడు పార్టీలోకి వచ్చాక చూస్తున్న బీజేపీ వేరు. ఇక రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందనుకుంటున్నాం. గత లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌లో కూడా ఇలాగే మమ్మల్ని తక్కువ అంచనా వేశారు. కానీ ఏమైందో అందరూ చూశారు కదా!



ఎంజీఆర్‌.. కరుణానిధి..ఎన్టీఆర్‌.. జయలలిత... ఇలా సినీ పరిశ్రమకు చెందిన కొద్ది మంది మాత్రమే రాజకీయాల్లో రాణించారు. ముఖ్యంగా హీరోయిన్లు రాణించలేకపోయారు. దీనికి కారణాలేమిటి?

రాజకీయాలు ఒక హాబీగా కాకుండా వృత్తిగా తీసుకోవాలి. దానిపైనే పూర్తిగా శ్రద్ధ చూపించాలి. జయలలితగారి లాగా పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చిన నటి ఎవరున్నారో చెప్పండి. ఆమె పార్టీకి ప్రచార కార్యదర్శిగా నియమితులై, ఆ తరువాత ఎన్నో పదవుల్లో పనిచేశారు. ఆమెకు కుటుంబం లేదు. దాంతో జీవితం మొత్తం పార్టీకే అంకితం చేశారు. మన దేశంలో ముఖ్యమైన మహిళా నేతల్ని పరిశీలించండి.. జయలలిత, ఉమాభారతి, మాయావతి, మమతా బెనర్జీ.. ఇలా అంతా సింగిల్‌ ఉమెన్సే కదా! దాంతో వారు రాజకీయాలకు పూర్తిగా తమ జీవితాన్ని అంకితం చేయగలిగారు. అలా చేయబట్టే రాణించగలిగారు. సినిమాల నుంచి అలా పూర్తిగా వెళ్లినవారు లేరు. వెళ్తే సక్సెస్‌ అయ్యేవారు.


బాలీవుడ్‌ నుంచి వచ్చిన మీరు అక్కడెందుకు సక్సెస్‌ కాలేకపోయారు?

నేను చిన్నప్పుడే బాలీవుడ్‌లో అడుగుపెట్టాను. అప్పుడు నాన్నే నాకు మేనేజర్‌. నా కెరీర్‌ మొదట్లో నాన్నగారు ‘డబ్బు వస్తే చాలులే’ అనుకునేవారు. పాత్ర ఎలాంటిది? ప్రొడక్షన్‌ ఎలాంటిది? అనేవి పట్టించుకోలేదు. దాంతో సరైన ప్లానింగ్‌ లేకపోవడం వల్ల బాలీవుడ్‌లో నిలదొక్కుకోలేకపోయాను. హిందీలో ఐదారు సినిమాలే చేశాను. ఆ తర్వాత అన్నీ దక్షిణాది భాషల సినిమాలే చేశా.


ఫలానా పాత్ర చేయలేకపోయాననో, ఫలానా వ్యక్తితో నటించలేకపోయానో అసంతృప్తి ఏమైనా ఉందా?

తమిళంలో వచ్చిన ‘చిన్నతంబి’ చిత్రంలో నేనే హీరోయిన్‌ని. కానీ దానినే తెలుగులో తీసిన ‘చంటి’లో నేను చేయలేకపోయాను. ఆ సమయంలో రజనీగారితో ‘అన్నామలై’, కమల్‌ గారితో ‘సింగారవేలన్‌’ సినిమాలు చేస్తుండడంతో డేట్స్‌ కుదరలేదు. కన్నడంలోనూ ఆ సినిమా చేయలేకపోయా! ఇదే విధంగా చిరంజీవిగారితో సినిమా చేయలేకపోయాననే అసంతృప్తి ఉంది. స్టాలిన్‌ సినిమాలో అక్కగా చేశా! ఆయనతో హీరోయిన్‌గా చేయలేకపోయాననే అసంతృప్తి అయితే ఉంది. ఆయనతో డ్యూయెట్‌లో డ్యాన్స్‌ చేస్తే ఆ కిక్కే వేరు కదా!


‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ అని, ‘మీ టూ’ అని కొన్ని ఉద్యమాలు నడిచాయి. చల్లారిపోయాయి. మీకు అలాంటి అనుభవాలేమైనా ఉన్నాయా?

15 ఏళ్ల వయస్సులో నేను హీరోయిన్‌గా నటించా. అప్పటి నుంచి నాకు పరిశ్రమలో అందరూ తెలుసు. నాకు ఎప్పుడూ చేదు అనుభవాలు ఎదురుకాలేదు. రామానాయుడుగారు నన్ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయన నన్ను సొంత కూతురిలా చూసుకొనేవారు. రాఘవేంద్రగారు కూడా అంతే! తెలుగు.. తమిళ.. కన్నడ సినిమా రంగాల్లో చాలామంది నాకు తెలుసు. అక్కడ కూడా నాకు ఎటువంటి చెడు అనుభవాలు ఎదురుకాలేదు. ఇక ఉద్యమాల విషయానికి వస్తే.. ఏదైనా అవాంఛనీయ సంఘటన ఎదురైతే వెంటనే స్పందించాలనేది నా ఉద్దేశం. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వెంటనే చెంప పగలకొట్టాలి. అంతే తప్ప పదేళ్ల తర్వాత వేదికలెక్కితే ఫలితం ఉండదు. కొత్త సమస్య వచ్చే సరికి పాత సమస్య మరుగున పడిపోతుంది. 


మీరు సినీ రంగానికి వచ్చి 35 ఏళ్లు పూర్తవుతోంది. ఒక్క సారి వెనక్కి చూసుకుంటే ఏమనిపిస్తుంది?

ఒక అందమైన జీవితాన్ని ఆనందంగా గడిపా. ఇక బాధలంటారా.. అవి కూడా జీవితంలో ఒక భాగమే! నిజానికి అవి లేకపోతే కష్టాలను ఎదుర్కొనే శక్తి మనకు రాదు. 

నేను చెన్నైలో స్థిరపడి 34 సంవత్సరాలవుతోంది. మా ఇంట్లో మాతృభాష ఉర్దు. అందువల్ల చెన్నై వచ్చిన కొత్తలో కొంత ఇబ్బంది ఉండేది. ఇప్పుడు తమిళమే నా మాతృభాష అయిపోయింది. 


తమిళనాడులో మీ పేరు మీద ఆలయమే కట్టేశారు.. ఎప్పుడైనా దాన్ని చూశారా?

ఆ ఆలయం ఇప్పటికీ ఉంది. ఆ గుడి కట్టిన కొత్తలో నేను బిజీగా ఉండడం వల్ల వెళ్లలేదు. కట్టిన కొత్తలో దాన్ని చూడాలనే ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆసక్తి తగ్గిపోయింది. 


ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నట్టున్నారు..

లేదండీ... నటన నా వృత్తి. ప్రస్తుతం నేను రజనీకాంత్‌ గారి చిత్రం ‘అన్నాత్తే’లో నటిస్తున్నాను. రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి సినిమాల్లో నటించనేమోనని కొందరు అనుకుంటున్నారు. కానీ మంచి పాత్ర దొరికితే నటించడానికి ఎప్పుడూ సిద్ధమే. 


నచ్చిన నటులు: తమిళంలో విజయ్‌ సేతుపతి. తెలుగులో తారక్‌, రామచరణ్‌. 

నచ్చిన ఫుడ్‌: ఇంట్లో వండిన వంటలే ఇష్టపడతా. కారం అస్సలు పడదు. ఆంధ్రా ఫుడ్‌ అస్సలు తినలేను. 

నచ్చిన ప్రదేశం: చెన్నైలో మా ఇల్లు

వారసులు: మాకు ఇద్దరు ఆడపిల్లలు.. ఇద్దరికీ సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు.


- డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా,  చెన్నై

ఫొటోలు: కర్రి శ్రీనివాస్‌










సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి సినిమాల్లోకి వెళ్లారు. ముస్లిం అయి ఉండీ హిందువును పెళ్లాడారు. బాంబే అమ్మాయి అయి ఉండి దక్షిణాదిలో స్థిరపడ్డారు.. సినిమాల్లో ఉండి రాజకీయాల్లో రాణిస్తున్నారు.. అంతా భిన్నంగానే సాగుతున్నట్లుంది..

నేను విధిని బలంగా నమ్ముతా. విధిని బట్టే మన జీవితం ఉంటుంది. ముంబయిలో పుట్టిన నేను చెన్నైలో సెటిలవుతానని ఎప్పుడూ అనుకోలేదు. మతాంతర వివాహం చేసుకుంటాననీ అనుకోలేదు. అన్నింటినీ కలుపుకొని పోవడమే నాకు ఇష్టం. ఉదాహరణకు అమ్మవాళ్లు ఐదుపూటల నమాజ్‌ చేస్తారు. నాకు నమాజ్‌ చేయడం రాదు. కానీ ఆ సంప్రదాయాన్ని పాటిస్తా. 

నా భర్త సుందర్‌ ఇంటిలో హిందూ ధర్మాన్ని పాటిస్తారు. నేనూ ఆ ధర్మాన్నీ పాటిస్తా. నాకు ఇష్టం కాబట్టి నుదుటన బొట్టు పెట్టుకుంటా. ఇక పిల్లల విషయమంటారా.. వాళ్లిష్టం. వారు ఏది కావాలనుకుంటే దాన్ని అనుసరిస్తారు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. మా పెద్దన్నయ్య ముస్లింను.. రెండో అన్నయ్య క్రిస్టియన్‌ను.. చిన్నన్నయ్య మలయాళీని పెళ్లాడారు. అమ్మ అందరితోనూ బావుంటుంది. అన్నింటికన్నా మానవత్వమే ముందని నేను గాఢంగా నమ్ముతా!


2000 సంవత్సరంలో నాకు పెళ్లయింది. వెంటనే పిల్లలు పుట్టారు.

మొదటి నుంచి నేను కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చేదాన్ని. అందువల్ల పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉన్నా. చాలా తక్కువ సినిమాలు చేశా. నా సొంత ప్రొడక్షన్‌లో కొన్ని సీరియల్స్‌ కూడా తీశా. 2010లో రాజకీయాల్లోకి వచ్చా. ఆ తర్వాత కూడా కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తున్నా. ఒక వైపు కుటుంబాన్ని చూసుకుంటూనే- ప్రజా జీవితంలోకి రావాలనుకున్నా. అందువల్ల పెద్దగా ఇబ్బంది పడడం లేదు. ఇప్పటికీ మా ఇంట్లో నేనే వంట చేస్తా. ప్రతి రోజు అందరూ కలిసే డిన్నర్‌ చేస్తాం. పిల్లల కాలేజీల్లో జరిగే పేరెంట్స్‌ మీట్‌లకు కూడా నేనే వెళ్తా!


ఖుష్భూ చుట్టూ వివాదాలుంటాయి... ఎందుకని?

ధైర్యంగా నిజం చెబుతాను కాబట్టి వివాదాలు తలెత్తుతూ ఉంటాయి. కొందరి అభిప్రాయం ప్రకారం- మన సొసైటీలో ఒక ఆడపిల్ల తెలివిగా ఉండకూడదు. సినిమా పరిశ్రమకు చెందిన వార్తైతే అసలే ఉండకూడదు. సమాజంలోని సమస్యపై నోరెత్తకూడదు. బుర్ర ఉన్నా దాన్ని ఉపయోగించకూడదు. ఇలా అనుకొనేవారి ఆలోచలనకు విరుద్ధంగా నా ప్రవర్తన ఉంటే సమస్యే కదా!  నా దేశ రాజ్యాంగం నాకిచ్చిన హక్కులు.. అధికారాల మేరకు మాత్రమే నేను ధైర్యంగా మాట్లాడుతున్నా. అందుకే ఆ వివాదాలు. 


Updated Date - 2021-02-21T06:43:40+05:30 IST