తమిళ జాలర్లపై శ్రీలంక నావికుల దాష్టీకం

ABN , First Publish Date - 2021-12-20T13:41:33+05:30 IST

తమిళజాలర్లపై శ్రీలంక నావికాదళం మరోమారు తన పంజాను విసరింది. తమ దేశపు సముద్రజలాల్లోకి అక్రమంగా ప్రవేశించారం టూ దాడులకు దిగింది. వలలను, పడవలను ధ్వంసం చేసింది. అంతటితో ఆగకుండా 55

తమిళ జాలర్లపై శ్రీలంక నావికుల దాష్టీకం

- 55 మంది నిర్బంధం 

- ఎనిమిది పడవల స్వాధీనం


చెన్నై: తమిళజాలర్లపై శ్రీలంక నావికాదళం మరోమారు తన పంజాను విసరింది. తమ దేశపు సముద్రజలాల్లోకి అక్రమంగా ప్రవేశించారం టూ దాడులకు దిగింది. వలలను, పడవలను ధ్వంసం చేసింది. అంతటితో ఆగకుండా 55 మంది జాలర్లను నిర్బంధించి గస్తీ నౌకలలో ఎక్కించుకుని పయనమైంది. ఎనిమిది మరపడవలను కూడా స్వాధీనం చేసుకుని తమ వెంట తీసుకెళ్లింది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న జాలర్ల సంఘం నాయకులు తీవ్ర దిగ్ర్బాంతికి గురయ్యారు. జాలర్ల కుటుంబీకులు శోకతప్తులయ్యారు. రామేశ్వరం ప్రాంతానికి చెందిన సుమారు రెండువేల మంది జాలర్లు 500 మరపడవల్లో శనివారం వేకువజామున సముద్రంలో చేపలవేటకు బయలుదేరారు. ఆదివారం వేకువజామున భారత్‌, శ్రీలంక దేశాల సముద్రజలాల సరిహద్దులో ఉన్న కచ్చాతీవు సమీపం నెడుదీవు వద్ద సుమారు యాభైమంది జాలర్లు ఆరు మరపడవల్లో చేపలు పడుతుండగా 20 ప్లాస్టిక్‌ గస్తీ పడవలలో వచ్చిన శ్రీలంక నావికాదళం సభ్యులు చుట్టుముట్టారు. తమ దేశపు సముద్రజలాల్లో అక్రమంగా చొరబడి చేపలు పడుతున్నారంటూ ఆగ్రహంతో రామేశ్వరం జాలర్లపై దాడికి దిగారు. 55 మంది జాలర్లను నిర్బంధించి తమ గస్తీ నౌకలలో ఎక్కించుకుని శ్రీలంకకు పయనమయ్యారు. అంతటితో ఆగకుండా ఆ జాలర్లకు చెందిన 8 మరపడవలను కూడా శ్రీలంక నావికాదళం సభ్యులు వెంట తీసుకెళ్ళారు. ఈ సంఘటన ను చూసిన మిగతా జాలర్లంతా భయంతో స్వస్థలానికి తిరుగుముఖం పట్టారు. ఆదివారం ఉదయం రామేశ్వరం తీరం చేరుకున్న జాలర్లు శ్రీలంక నావికాదళం దాష్టీకం గురించి స్థానిక జాలర్ల సంఘం నాయకులు, స్థానిక పోలీసులకు, మత్స్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జాలర్ల కుటుంబీకులు శోకతప్తుల య్యారు. వారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలంటూ పోలీసు ఉన్నతాధికారులు, మత్స్యశాఖ అధికారులకు మొరపెట్టుకున్నారు.


ఆ జాలర్లను విడిపించండి

కేంద్రమంత్రికి స్టాలిన్‌ వినతి

 శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన రామేశ్వరం జాలర్లు 55 మందిని తక్షణమే విడుదల చేయించడానికి చర్యలు చేపట్టాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జయశంకర్‌కు ఫోన్‌ చేసి శ్రీలంక నావికాదళం రామేశ్వరం జాలర్లపై సాగించిన దాష్టీకం గురించి వివరించారు. 55 మంది జాలర్లతోపాటు ఎనిమిది మరపడవలను కూడా శ్రీలంక నావికాదళం తరలించుకెళ్ళిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జయశంకర్‌ బదులిస్తూ తమిళ జాలర్లను విడిపించేందుకు చర్యలు తీసుకుంటానని స్టాలిన్‌కు హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది.

Updated Date - 2021-12-20T13:41:33+05:30 IST