ltrScrptTheme3

బస్సులో ప్రయాణించిన స్టాలిన్

Oct 24 2021 @ 15:29PM

చెన్నై: మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న చెన్నై మెట్రోపాలిస్ బస్సులో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆదివారంనాడు ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం గురించి స్టాలిన్ ఈ సందర్భంగా ప్రయాణికులతో ముచ్చటించారు. కోవిడ్ వ్యాక్సిన్ మెగా డ్రైవ్‌లో భాగంగా పలు వ్యాక్సినేషన్ క్యాంపులను తనిఖీ చేసిన సీఎం మార్గమధ్యలో కన్నగి నగర్ బస్సు ఎక్కారు. ముఖ్యమంత్రి బస్సు ఎక్కడంతో ప్రయాణికుల్లో ఉత్సాహం తొంగిచూసింది. మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ ఏ విధంగా ఉపయోగపడుతోందో వారిని సీఎం అడిగి తెలుసుకున్నారు.

 సిటీ బస్సులో ప్రయాణిస్తూ ప్రజలకు అందుతున్న సౌకర్యం గురించి వారిని అడిగి తెలుసుకోవడం, వారి ముఖాల్లో చిరునవ్వులు కనిపించడం సంతోషంగా ఉందని సీఎం ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆగడం, స్టాలిన్ రోడ్డును క్రాస్ చేస్తూ బస్సు ఎక్కడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ముఖ్యమంత్రి బస్సు ఎక్కడంతో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు, చేతులు జోడించి నమస్కారం చేయడం, కొందరు మహిళలు సీఎంతో సెల్ఫీలు దిగడం కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.