తలైవర్‌కు హ్యాపీబర్త్‌డే

ABN , First Publish Date - 2021-12-13T17:08:44+05:30 IST

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 72వ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకున్నారు. రజనీకాంత్‌ ఎప్పటివలెనే నగరంలో అభిమానులకు కనిపించకుండా

తలైవర్‌కు హ్యాపీబర్త్‌డే

రజనీకి మోదీ, స్టాలిన్‌ సహా నేతల శుభాకాంక్షలు

పోయెస్‌గార్డెన్‌లో అభిమానుల సందడి


చెన్నై: తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 72వ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకున్నారు. రజనీకాంత్‌ ఎప్పటివలెనే నగరంలో అభిమానులకు కనిపించకుండా నగరశివారులోని ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యుల మధ్య తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. రజనీకాంత్‌ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, అన్నాడీఎంకే నేతలు ఎడప్పాడి పళనిస్వామి, ఒ. పన్నీర్‌సెల్వం, ఆ పార్టీ అసమ్మతివర్గం నాయకురాలు శశికళ తదితర నేతలు శుభకాంక్షలు తెలుపుతూ సందేశాలు పంపారు. ప్రధాని నరేంద్రమోదీ తన సందేశంలో రజనీకాంత్‌ తన చిత్రాల ద్వారా, అద్భుతమైన నటన ద్వారా ప్రజలను సంతోషపరచాలని కోరారు. జన్మదిన శుభాకాంక్షలతోపాటు రజనీ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రశాంతమైన జీవితం గడపాలని ఆకాంక్షిస్తున్నానని మోదీ పేర్కొన్నారు.


స్టాలిన్‌ శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఆదివారం ఉదయమే ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అందరిపట్ల సన్నిహితంగా అరమరికలులేని ఆదరాభిమానాలు ప్రదర్శించే మిత్రుడు రజనీకాంత్‌కు 72వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తన సందేశంలో స్టాలిన్‌ పేర్కొన్నారు. రజనీ ఎప్పటివలెనే చిత్రసీమలో తన ఆధిక్యాన్ని కొనసాగించి తమ ప్రజలను సంతోషపరచాలని, సంపూర్ణ ఆరోగ్యంతో విలసిల్లాలని ఆయన తెలిపారు. ఇదే విధంగా శశికళ కూడా రజనీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  ప్రియమైన సోదరసమానుడు రజనీకాంత్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఆయన ఆదరాభిమానాలు, సోదరభావం సుస్ధిరంగా వుండాలని కోరుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. ఇదేవిధంగా టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు కుమరి అనంతన్‌, క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, క్రికెటర్‌ హర్బజన్‌సింగ్‌ తదితరులు కూడా రజనీకి శుభాకాంక్షలు తెలిపారు.


అన్న ఆశీస్సులు...

రజనీకాంత్‌ బెంగళూరులో ఉన్న తన సోదరుడు సత్యనారాయణకు ఫోన్‌చేసి ఆయన ఆశీస్సులందుకున్నారు. ఈ విషయమై సత్యనారాయణ టీవీ ఛానెల్‌ ప్రతినిధులతో మాట్లాడుతూ ఆదివారం ఉదయం తన తమ్ముడు రజనీ ఫోన్‌ చేయడం తనకు సంతోషం కలిగించిందన్నారు.  రజనీ జన్మదినం సందర్భంగా బెంగళూరులో ఉన్న ఆయన స్నేహితులు, అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపానని, అందుకు రజనీ చాలా సంతోషించాడని చెప్పారు.  అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలు కూడా బెంగళూరులో జోరుగా జరుగుతున్నాయని తెలిపారు.


రజనీ నివాసం వద్ద...

తలైవర్‌ రజనీకాంత్‌ నివాసగృహం ఉన్న పోయెస్‌గార్డెన్‌ ప్రాంతంలో ఆదివారం వేకువజామునే అభిమానుల సందడి ప్రారంభమైంది. కొంతమంది అభిమానులు శనివారం అర్ధరాత్రి 12 గంటలకు రజనీ నివాసగృహం ఎదురుగా ఉన్న రహదారిలో కేక్‌ కట్‌ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఇక ఆదివారం ఉదయం నుంచి నగరం నలుమూలల నుండి రజనీ అభిమానాలు పోయెస్‌గార్డెన్‌లోని అభిమాన నాయకుడి నివాసగృహానికి చేరుకున్నారు.  కొంతమంది అభిమానులు రజనీ నివాసగృహం వైపు నిలిచి గుమ్మడి కాయలను దిష్టితీసి కొట్టారు. మరికొందరు అభిమానులు మిఠాయిలు, చాక్లెట్టు, లడ్డూలు పంచిపెట్టారు. ఆ ఇంటి వాచ్‌మెన్‌ వారి వద్దకు వచ్చి రజనీ ఇంట లేదని చెప్పినా పట్టించుకోలేదు. రజనీ ఇంటిలో వున్నా లేకపోయినా ఆ చోటనే తాము జన్మదిన వేడుకలు జరుపుతామంటూ సందడి చేశారు. ఆదివారం వేకువజామున చిరుజల్లులు కురిసినా రజనీ అభిమానులు పట్టించుకోకుండా తమ అభిమాన నాయకుడి ఇంటి వద్ద బారులు తీరారు. సాయంత్రం వరకూ అభిమానులు ఆ చోట రజనీ వర్థిల్లాలి, సూపర్‌స్టార్‌ రజనీ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేయసాగారు.

Updated Date - 2021-12-13T17:08:44+05:30 IST