రాష్ట్రంలో బూస్టర్‌ డోస్‌ పంపిణీకి తొలి అడుగు

ABN , First Publish Date - 2022-01-11T14:44:58+05:30 IST

రాష్ట్రంలో బూస్టర్‌ డోస్‌ పంపిణీకి తొలి అడుగు పడింది. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఆరోగ్యకార్యకర్తలు సహా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు, సాధారణ రోగాలతో ఉన్న 60 ఏళ్లు పైబడినవారికి

రాష్ట్రంలో బూస్టర్‌ డోస్‌ పంపిణీకి తొలి అడుగు

- తొలుత ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు పంపిణీ

- ప్రారంభించిన సీఎం స్టాలిన్‌


చెన్నై: రాష్ట్రంలో బూస్టర్‌ డోస్‌ పంపిణీకి తొలి అడుగు పడింది. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఆరోగ్యకార్యకర్తలు సహా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు, సాధారణ రోగాలతో ఉన్న 60 ఏళ్లు పైబడినవారికి ముందుజాగ్రత్త మోతాదు (ప్రికాషన్‌ డోస్‌) టీకా వేసే కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. స్థానిక ఎంఆర్‌సీ నగర్‌ ఇమేజ్‌ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఈ బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. రెండు డోస్‌లు ఏ వ్యాక్సిన్‌ వేసుకున్నారో దానినే మూడో సారి వేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,65,218 మంది ఆరోగ్య సిబ్బంది, 9,78,023 మంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌, సాధారణ రోగాలున్న వృద్ధులు 20,83,800 మంది వరకు ఉన్నారు. వీరిలో బూస్టర్‌ డోస్‌కు అర్హులుగా 2,06,128 మంది ఆరోగ్య సిబ్బందిని, 92,816 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ను, 1,01,069 మంది వృద్ధులకు ఈ ముందస్తు మోతాదు టీకాలు వేయనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు. 


జర్నలిస్టులకు ఆరోగ్య బీమా కార్డులు

ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాత్రికేయులకు ముఖ్యమంత్రి ఆరోగ్యబీమా పథకం వర్తింపజేసేలా ఆరోగ్య బీమా కార్డులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ పది మందికి అందజేశారు. 2020-21 సంవత్సరంలో గుర్తింపు కార్డులను రెన్యూవల్‌ చేసుకున్న 1414 మంది పాత్రికేయులకు ఈ ఆరోగ్యబీమా కార్డులు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆరోగ్య బీమా కార్డులతో రూ.5లక్షల విలువైన చికిత్స చేయించుకునేందుకు వీలవుతుందని ఆయన వివరించారు. ఇటీవల సీఎం బీమా ఆరోగ్యపథకం ఆదాయపరిమితిని రూ.72వేల నుంచి రూ.1.20లక్షలకు పెంచుతూ ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రభుత్వ గుర్తింపు కార్డులు కలిగిన పాత్రికేయులకు ఆదాయ పరిమితితో నిమిత్తం లేకుండా ఈ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఈ బీమా పథకాన్ని గత నవంబర్‌ ఒకటి నుంచి ఐదేళ్లపాటు పొడిగించారు. ఈ పథకం పొడిగించే విధంగా యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ సంస్థకు ఆర్థికపరమైన ఉత్తర్వులను ముఖ్యమంత్రి ఆ సంస్థ అధికారులకు అందించారు. ఈ మేరకు ప్రభుత్వం, ఆ బీమా సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ పథకం కోసం రూ.1,248 కోట్ల మేర నిధులు కూడా కేటాయించినట్లు స్టాలిన్‌ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులు సహా 1.37 కోట్ల కుటుంబాలు లబ్దిపొందుతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు దామోఅన్బరసన్‌, ఎం. సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు, ఎంపీ తమిళచ్చి తంగపాండ్యన్‌, శాసనసభ్యుడు డి.వేలు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డాక్టర్‌ జే రాధాకృష్ణన్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ, వైద్య, ప్రజారోగ్యశాఖ ప్రత్యేక అధికారి పి.సెంథిల్‌ కుమార్‌, తమిళాభివృద్ధి సమాచారశాఖ కార్యదర్శి మహేశన్‌ కాశిరాజన్‌, రాష్ట్ర ఆరోగ్య పథకం సంచాలకులు డాక్టర్‌ ఎస్‌. ఉమా, ప్రజారోగ్యం, రోగనిరోధక విభాగం సంచాలకులు డాక్టర్‌ టీఎస్‌ సెల్వవి నాయగం, వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ నారాయణబాబు తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-11T14:44:58+05:30 IST