Chief Minister: 3వ స్థానంలో ‘మన సీఎం’

ABN , First Publish Date - 2022-08-13T14:01:53+05:30 IST

గత ఏడాది ముఖ్యమంత్రి(Chief Minister)గా బాధ్యతలు స్వీకరించిన ఎంకే స్టాలిన్‌ పాలనా తీరు పట్ల రాష్ట్ర ప్రజానీకం సంతృప్తిగానే వున్నారని తేలింది.

Chief Minister: 3వ స్థానంలో ‘మన సీఎం’

- ఉత్తమ పాలన అందిస్తున్నారంటూ ప్రజల ప్రశంసలు

- ఆంగ్ల మీడియా సంస్థ సర్వేలో వెల్లడి


చెన్నై, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది ముఖ్యమంత్రి(Chief Minister)గా బాధ్యతలు స్వీకరించిన ఎంకే స్టాలిన్‌ పాలనా తీరు పట్ల రాష్ట్ర ప్రజానీకం సంతృప్తిగానే వున్నారని తేలింది. అయితే గతంతో పోలిస్తే కొంత మేర ఈ సంతుష్టుల శాతం తగ్గగా, ఇప్పటికీ ఆయన పాలనా తీరు మెరుగ్గా వుందనేవారే అధికంగా వున్నట్లు ఆ సర్వే స్పష్టం చేసింది. దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రుల్లో స్టాలిన్‌ తృతీయస్థానంలో ఉన్నారు. ఆ సర్వేలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు 78 శాతం మద్దతుతో మొదటి స్థానం, అసోం ముఖ్యమంత్రి హిమంద బిశ్వా 63 శాతంతో రెండవ స్థానం, 61 శాతం మద్దతుతో సీఎం ఎంకే స్టాలిన్‌ మూడవ స్థానంలో నిలిచారు. 


ఉప్పు తయారీ కార్మికులకు రూ.5వేల సాయం

రాష్ట్రంలో తూత్తుకుడి తదితర సముద్రతీర జిల్లాల్లో ఉప్పు తయారీ చేసే కార్మికులకు తలా రూ.5వేల చొప్పున ఆర్థికసాయం అందించే పథకాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం సచివాలయంలో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో ఐదుగురు కార్మికులకు సీఎం ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. ఇదేవిధంగా రాష్ట్ర ఉప్పు తయారీ సంస్థ ఆధ్వర్యంలో ‘నెయిదల్‌’ పేరిట తయారు చేసిన కొత్త రకం ఉప్పు ప్యాకెట్ల అమ్మకాలను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉప్పు తయారీ కార్మికులు ఏడాదికి తొమ్మిది నెలలపాటే ఉప్పుతయారీ పనుల్లో పాల్గొంటారని, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు వీరికి ఉప్పు తయారీ పనులు ఉండవని చెప్పారు. ఈ కారణంగానే ఉప్పుకార్మికులకు ఏటా తలా రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నటు ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రకటించామన్నారు. ఆ మేరకు ఆ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రజలకు అయోడిన్‌ సహిత ఉప్పును అందించాలన్న తలంపుతో ‘నెయిదల్‌’ పేరుతో ఉప్పు ప్యాకెట్ల అమ్మకాలను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తంగం తెన్నరసు, సీవీ గణేశన్‌, ఎంపీ కనిమొళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు తదితర అధికారులు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-13T14:01:53+05:30 IST