కొనసాగుతున్న కుండపోత

ABN , First Publish Date - 2021-07-25T13:14:52+05:30 IST

నీలగిరి జిల్లాలో గత మూడు రోజులుగా కుండపోతగా వర్షం కురవడంతో చెరువులు, వాగులు నీటితో నిండి పొంగి ప్రవహిస్తున్నాయి. పెనుగాలులతో కురిసిన వర్షాలకు పలు చోట్ల చెట్లు కూలిప

కొనసాగుతున్న కుండపోత

- నీలగిరిలో పదిచోట్ల కూలిన మట్టి చరియలు

- నేలవాలిన వృక్షాలు


చెన్నై: నీలగిరి జిల్లాలో గత మూడు రోజులుగా కుండపోతగా వర్షం కురవడంతో చెరువులు, వాగులు నీటితో నిండి పొంగి ప్రవహిస్తున్నాయి. పెనుగాలులతో కురిసిన వర్షాలకు పలు చోట్ల చెట్లు కూలిపడ్డాయి. 25 చోట్ల రహదారులపై మట్టిపెళ్ళలు, వృక్షాలు నేలమట్టమయ్యాయి. మంచూరు పరిసర ప్రాంతాల్లో పెనుగాలులు వీయడంతో ఎడక్కాడు- ఊటీ రహదారిలో రెండు వృక్షాలు, కుందాపాలం, రామయ్యబ్రిడ్జి ప్రాంతం, తొట్టకంబై, కిన్నకొరై రహదారులలో చెట్లు కూలిపడ్డాయి. ఈ సమాచారం అందుకున్న అధికారులు చెట్లను తొలగించే పనులు ప్రారంభించారు. ఈ సంఘటనల కారణంగా ఆ మార్గాలలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఊటీ రేస్‌ మౌట్‌, నొండిమేడు సహా పది చోట్ల రహదారులపై మట్టి పెళ్ళలు విరిగిపడ్డాయి. గూడలూరు ప్రాంతంలో కురిసిన వర్షాలకు పాండియారు, పున్నంపుళా, మాయారు, సున్నాంబుపాలం, సోలాడి, పొన్నాలి చెరువులలలో నీటిమట్టం అధికమై అదనపు జలాలు రహదారులపై పొంగి ప్రవహిస్తున్నాయి.


నాలుగు జిల్లాల్లో వర్షం

నైరుతి రుతుపవనాల ప్రభావంతో కోయంబత్తూరు సహా నాలుగు జిల్లాల్లో భారీగా వర్షం కురిసే అవకాశముందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం డైరెక్టర్‌ పువియరసన్‌ తెలిపారు. రుతుపవనాలు తీవ్రరూపం దాల్చుతుండటంతో శనివారం నీలగిరి, కోయంబత్తూరు, కన్నియాకుమారి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని పేర్కొన్నారు. రాబోవు రెండు రోజులలో కోయంబత్తూరు, నీలగిరి, తేని, కన్నియాకుమారి జిల్లాల్లో కుండపోతగా వర్షాలు పడతాయని ఆయన వివరించారు. ఇదే విధంగా ఈ నెల 26 నుండి 28 వరకు సేలం, ధర్మపురి, నామక్కల్‌, కల్లకుర్చి, పెరంబలూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. చెన్నై నగరానికి సంబంధించినంత వరకు ఆకాశం మేఘావృతమై చెదురుముదురుగా వర్షం కురుస్తుందన్నారు.

Updated Date - 2021-07-25T13:14:52+05:30 IST