ఎందుకు మూసేశారు?

ABN , First Publish Date - 2022-07-20T14:12:48+05:30 IST

కళ్లకుర్చి జిల్లా చిన్నసేలంలో విద్యార్థిని ఆత్మహత్య తరువాత శక్తిమెట్రిక్యులేషన్‌ స్కూల్లో ఆమె కుటుంబీకులు చేసిన విధ్వంసాన్ని ఖండిస్తూ రాష్ట్ర

ఎందుకు మూసేశారు?

- 987 పాఠశాలలకు నోటీసులు

- కఠిన చర్యలకు విద్యాశాఖ సన్నాహాలు


ప్యారీస్‌(చెన్నై), జూలై 19: కళ్లకుర్చి జిల్లా చిన్నసేలంలో విద్యార్థిని ఆత్మహత్య తరువాత శక్తిమెట్రిక్యులేషన్‌ స్కూల్లో ఆమె కుటుంబీకులు చేసిన విధ్వంసాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు సోమవారం హఠాత్తుగా సమ్మెకు దిగడాన్ని రాష్ట్ర విద్యాశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నెల 18న పాఠశాలను ఎందుకు మూసివేశారో చెప్పాలంటూ రాష్ట్ర మెట్రిక్యులేషన్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీచేసింది. ముందుగా అనుమతి లేకుండా పాఠశాలను ఎందుకు మూసివేశారో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా వుండగా తగిన వివరణ ఇవ్వని పక్షంలో పాఠశాల గుర్తింపు రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని అధికారులు హెచ్చరించారు. శక్తి మెట్రిక్యులేషన్‌ స్కూల్‌పై దాడిని నిరశిస్తూ రాష్ట్రంలోని 11,335 ప్రైవేటు పాఠశాలలు బంద్‌ చేపట్టాలని ఆదివారం నిర్ణయించుకున్నట్లు తెలియగానే విద్యాశాఖ స్పందించింది. సున్నిత అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని ఆదేశించింది. దీంతో అనేక పాఠశాలలు వెనక్కి తగ్గగా, 987 పాఠశాలలు మాత్రం సోమవారం సెలవు ప్రకటించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిని సీరియ్‌సగా పరిగణించిన ప్రభుత్వం.. మంగళవారం ఆయా పాఠశాలలకు నోటీసులు జారీ చేసింది.

Updated Date - 2022-07-20T14:12:48+05:30 IST