కొవిడ్ సామాగ్రి దగ్ధంపై స్పందించిన ‘తానా’

ABN , First Publish Date - 2022-06-07T01:50:45+05:30 IST

విశాఖ గోదాములో తానా సంస్థ నిల్వచేసిన కొవిడ్ సామాగ్రి.. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి ఆహుతైన విషయం తెలసిందే. ఈ విషయమై తానా తాజాగా స్పందించింది.

కొవిడ్ సామాగ్రి దగ్ధంపై స్పందించిన ‘తానా’

విశాఖ గోదాములో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) నిల్వచేసిన కొవిడ్ సామాగ్రి.. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ విషయమై తానా తాజాగా స్పందించింది. ప్రజాసేవ కోసం ఉద్దేశించినవి ఇలా బుగ్గి అయిపోవడం దురదృష్టకరమని పేర్కొంది. అయితే.. ఈ ఘటన పూర్వాపరాలు తెలుసుకోకుండా కొందరు దుష్ప్రచారానికి దిగడం సబబు కాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ ఓ ప్రకటన విడుదల చేశారు. 


తెలుగు రాష్ట్రాలకు కొవిడ్ సంబంధిత సహాయసామాగ్రిని అందించేందుకు తాము 2021 జూన్‌లో  కార్యరంగంలోకి దిగామని తానా అధ్యక్షుడు, చైర్మన్‌లు పేర్కొన్నారు. నార్త్ వెస్ట్ మెడికల్స్(చికాగో) సహకారంతో  మెడికల్ సామాగ్రి కొనుగోలు చేసి హపగ్ లాయిడ్ సంస్థతో వాటిని ఇండియాకు పంపించేందుకు నిర్ణయించామన్నారు. హపగ్‌తో ఆగస్టులో ఒప్పందం కుదిరిందన్నారు. ఆ తరువాత కొన్ని అవాంతరాలు  ఏర్పడ్డాయని, వాటిని అధిగమించి చివరకు అక్టోబర్‌లో సామాగ్రిని విశాఖకు పంపించామన్నారు. 2022 జనవరిలో అవి విశాఖ పోర్టుకు చేరుకున్నాయన్నారు.  పోర్టులో స్థలం లేకపోవడంతో కొంత ఆలస్యం జరిగిందన్నారు. ఆ తరువాత కస్టమ్స్ క్లియరెన్స్ పొందే క్రమంలో మరికొంత ఆలస్యమైందన్నారు. మరోవైపు.. సామాగ్రిని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు రెడ్‌క్రాస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామన్నారు.  


అయితే.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సంభవించిన తుఫాను కూడా ఆలస్యానికి కారణమైందన్నారు.  మే నెలలో  పంపిణీ ప్రణాళిక రూపొందించామని, ఆ తరువాత సామాగ్రిని రెడ్‌క్రాస్‌కు అందించామన్నారు. ఈ క్రమంలో సహాయసామాగ్రిని విశాఖ గాజువాకలోని శ్రావణ్ షిప్పింగ్ సంస్థకు తరలించినట్టు పేర్కొన్నారు. జూన్ రెండో వారంలో ఏపీ గవర్నర్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నామని, ఈలోపే జూన్ 1న అగ్నిప్రమాదం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. మంటల్లో కాలిపోయిన సామాగ్రికి సంబంధించిన ఇన్సూరెన్స్‌ విషయమై రెడ్‌క్రాస్‌తో చర్చిస్తున్నామని చెప్పారు. ఉన్నత లక్ష్యంతో తలపెట్టిన కార్యక్రమం ఇలా ఆగిపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కానీ.. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు దుష్ప్రచారానికి దిగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తానా ఎప్పుడూ పారదర్శకంగా వ్యవహరిస్తుందని, ఈ విషయంలో ఎటువంటి సమాచారాన్ని ఇచ్చేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 



Updated Date - 2022-06-07T01:50:45+05:30 IST