తెలుగు రాష్ట్రాలకు తానా 25 కోట్ల విరాళం

ABN , First Publish Date - 2021-09-01T14:54:19+05:30 IST

తానా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు కోసం రూ.25 కోట్ల విరాళం అందించనుంది. అమెరికాలోని నార్త్‌ వెస్టర్స్‌ హాస్పటల్‌ సౌజన్యంతో తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఇటీవల చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన యార్లగడ్డ...

తెలుగు రాష్ట్రాలకు తానా 25 కోట్ల విరాళం

హైదరాబాద్/అమరావతి: తానా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు కోసం రూ.25 కోట్ల విరాళం అందించనుంది. అమెరికాలోని నార్త్‌ వెస్టర్స్‌ హాస్పటల్‌ సౌజన్యంతో తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఇటీవల చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన యార్లగడ్డ వెంకటరమణ తెలిపారు. తానాలో అనేక ఏళ్ల నుంచి పనిచేసిన ఆయన ఆధ్వర్యంలోనే తానా ఫౌండేషన్‌ ఇండియా ప్రారంభమైంది. 2010లో ఈ సంస్థ ప్రారంభమైనప్పుడు ఆయన దానికి కార్యదర్శిగా పనిచేశారు. తానా ఫౌండేషన్‌ ట్రస్టీగా కూడా సేవలందించారు. ఇటీవల తానాకు జరిగిన ఎన్నికల్లో భాగంగా తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం నాడు ఆంధ్రజ్యోతితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. 


సొంత గడ్డపై సేవకోసమే ఫౌండేషన్‌

తానా ఫౌండేషన్‌ అన్నది సొంత గడ్డపై సేవ కోసమే పనిచేస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవలందించడమే ఈ ఫౌండేషన్‌ లక్ష్యమని తెలిపారు. ఈ ఫౌండేషన్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తానా ఫౌండేషన్‌-చేయూత ప్రాజెక్టు ద్వారా పేద విద్యార్థులకు ల్యాప్‌ ట్యాప్‌లు, తానా ఫౌండేషన్‌-ఆదరణ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచితంగా మూడుచక్రాల వాహనాలు, స్టెమ్‌ పథకం ద్వారా మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సామాగ్రి, ఉపాధ్యాయులకు నైపుణ్య శిక్షణ, రైతులకు చిన్నపాటి ఆధునిక యంత్రాలివ్వడం తదితర కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇవి నిరంతరం కొనసాగుతాయని, తానా ఫౌండేషన్‌లో ఉన్న 14 మంది ట్రస్టీల సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో విద్య, వైద్యం, ఇతర రంగాల్లో తమ వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.


నార్త్‌వెస్టర్న్‌ మెడికల్‌ ప్రాజెక్టు ద్వారా భారీసాయం

తానా ఫౌండేషన్‌-నార్త్‌ వెస్టర్న్‌ మెడిసిన్‌ ప్రాజెక్టు ద్వారా 3.8మిలియన్ల(సుమారు రూ.25కోట్లు) విలువ చేసే వైద్య పరికరాలు, వైద్య యంత్రాలను అందించనున్నామని ఆయన పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని అందించనున్నట్లు చెప్పారు. ప్రత్యేక కార్గో షిప్‌మెంట్‌ ద్వారా ఈ పరికరాలు రెండు నెలల్లో తెలుగు రాష్ట్రాలకు చేరతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం తానా కోశాధికారి కొల్లా అశోక్‌, తానా సమన్వయకర్త ముత్యాల పద్మశ్రీలు ఎంతో కష్టపడ్డారన్నారు. పెద్దఎత్తున ఉన్న ఈ వైద్య పరికరాలను అనేక కంటైనర్లలో తెలుగు రాష్ట్రాలకు తరలించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వైద్య, విద్య రంగాల్లో సేవలు అందించేందుకు ఆరోజుల్లో గుత్తికొండ రవీంద్రనాథ్‌ తానా ఫౌండేషన్‌ను ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ తర్వాత అనేక కార్యక్రమాలను ఫౌండేషన్‌ చేపట్టిందని, ఫౌండేషన్‌ నూతన ఛైర్మన్‌గా వాటిని మరింత ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు.

Updated Date - 2021-09-01T14:54:19+05:30 IST