స్వరశిల్పి బాలుకు స్వరనివాళులర్పించిన తానా

ABN , First Publish Date - 2020-09-29T03:14:41+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో గానగంధర్వుడు,

స్వరశిల్పి బాలుకు స్వరనివాళులర్పించిన తానా

టెక్సాస్: గానగంధర్వుడు, పద్మభూషణ్‍ డాక్టర్ ఎస్‍.పి. బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపంగా "స్వరశిల్పికి స్వర నివాళి" పేరుతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆన్‍లైన్‍ వేదికగా నివాళి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయనీ గాయకులు హాజరై ఎస్‍పీబీకి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని 50,000 మందికి పైగా చూడటం విశేషం. గతంలో ఎంతోమంది గాయకులు, ఇతర ప్రముఖులతోనూ లైవ్‍ షోలు నిర్వహించినా ఇంతమంది ఎన్నడూ వీక్షించలేదు. ఎస్పీ బాలు మీద ఉన్న అభిమానంతో తెలుగువారే కాకుండా, కన్నడ, తమిళవాసులు కూడా ఈ కార్యక్రమాన్ని లైవ్‍లో వీక్షించడం విశేషం. ప్రముఖ గాయకులు పద్మభూషణ్ డాక్టర్ సుశీల, పద్మశ్రీ డాక్టర్ శోభారాజు, సునీత తదితరులు ఈ సందర్భంగా తమ అనుభవాలు పంచుకున్నారు. తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, కార్యదర్శి రవి పొట్లూరి, కల్చరల్‍ కో ఆర్డినేటర్‍ సునీల్‍ పాంత్రా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజేశ్వరి ఉదయగిరి యాంకర్‍గా వ్యవహరించారు. 


తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి మాట్లాడుతూ.. ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మృతి చాలా బాధాకరం. తానాతో బాలు గారికి విడదీయరాని అనుబంధం ఉంది. తానా వేదికపై ఆయన ఎన్నో కార్యక్రమాలను చేశారు. 2009లో చికాగోలో జరిగిన పదిహేడో తానా మహాసభలలో ఆయనకు తానా జీవిత సౌఫల్య పురస్కారాన్ని అందజేసి సత్కరించింది. బాలు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలన్న డిమాండ్‍కు తానా కూడా తనవంతుగా మద్దతు ఇస్తుంది. ఈ విషయమై త్వరలోనే మా కార్యవర్గంతో చర్చించి తీర్మానం చేస్తాము’ అని అన్నారు. 


తానా కార్యదర్శి రవి పొట్లూరి మాట్లాడుతూ.. ‘మనం మన కుటుంబ సభ్యులతో కన్నా ఆయనతోనే ఎక్కువగా గడిపి ఉంటాము. ఆయన పాటలను వింటూ జీవితాన్ని గడిపాము. ఇప్పుడు ఆయన లేరన్న వార్త తీరని బాధగానే ఉంది. బాలు గారు జీవించిన 27,000 రోజుల్లో 40,000 పాటలు పాడారు. బాలుగారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటలు ఆయనను అమరజీవిగానే ఉంచాయి. ఆయన పేరు మీదుగానే ఓ అవార్డును సృష్టించి ఇస్తే ఎంతో బావుంటుందని అనుకుంటున్నాను. ఆయన ప్రతిభకు ఏ అవార్డు ఇచ్చినా సరిపోదు’ అని పేర్కొన్నారు.


తానా కల్చరల్‍ కో ఆర్డినేటర్‍ సునీల్‍ పాంత్రా మాట్లాడుతూ.. ‘తానాతో, ఎస్పీ బాలు గారితో ఉన్న అనుబంధంతో ఇంత స్వల్ప వ్యవధిలో ఈ కార్యక్రమానికి గాయనీ గాయకులు హాజరుకావడం బాలుగారిపై వారికి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తోంది. బాలుగారిపై తానా నిర్వహించిన ఈ లైవ్‍ షో కార్యక్రమాన్నిఇంతమంది వీక్షించడం రికార్డుగానే చెప్పవచ్చు. తానా కల్చరల్‍ కో ఆర్డినేటర్‍గా బాలుగారితో తానా వేదికపై పాడుతా తీయగా లాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నాను. ఇంతలో ఈ విషాదవార్త తట్టుకోలేకపోతున్నాను. ఆయనతో మంచి కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయానన్న బాధ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చినవారికి నా ధన్యవాదాలు’ అని చెప్పారు.


కాగా.. ఈ కార్యక్రమానికి ఎంతోమంది గాయనీ గాయకులు హాజరయ్యారు. పద్మభూషణ్‍ డా. పి. సుశీల, పద్మశ్రీ డా. శోభారాజు, సునీత, ఉష, కౌసల్య, సంధ్య, శ్రీరామచంద్ర, రేవంత్‍, శ్రీకృష్ణ, సుమంగళి, పృథ్వీచంద్ర, అంజనాసౌమ్య, గీతామాధురి, సమీర భరద్వాజ్‍ హాజరయ్యారు. వారంతా బాలుతో తమకు ఉన్న అనుబంధాన్ని తానా వేదికగా పంచుకున్నారు. 

Updated Date - 2020-09-29T03:14:41+05:30 IST