సరికొత్త దారిలో తానా కవి సమ్మేళనం

ABN , First Publish Date - 2021-04-10T06:09:11+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఉగాది సందర్భంగా సరికొత్త ప్రయోగం చేయబోతోంది. తెలుగు కవిత్వ కీర్తిపతాకాన్ని 21 దేశాల్లో ఎగరవేయనుంది. ఏప్రిల్ 10, 11 తేదీల్లో ప్రపంచ తెలుగు కవులను జూమ్...

సరికొత్త దారిలో తానా కవి సమ్మేళనం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఉగాది సందర్భంగా సరికొత్త ప్రయోగం చేయబోతోంది. తెలుగు కవిత్వ కీర్తిపతాకాన్ని 21 దేశాల్లో ఎగరవేయనుంది. ఏప్రిల్ 10, 11 తేదీల్లో ప్రపంచ తెలుగు కవులను జూమ్ ద్వారా ఒకే వేదికపైకి తెచ్చి తెలుగు కవితా ప్రియులకు 21 గంటలపాటు కవిత్వపు విందును అందించబోతోంది. తానా నిర్వహించే ప్రపంచ తెలుగు మహా కవి సమ్మేళనాన్ని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య ముఖ్యఅతిథిగా ఏప్రిల్ 10వ తేది ఉ.8గంటలకు ప్రారంభిస్తారు. సహస్రావధాని గరికపాటి నరసింహారావు, కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి కృతివెంటి శ్రీనివాసరావు అతిథులుగా పాల్గొంటారు.


జస్టిస్ బి. చంద్రకుమార్, కొలకలూరి ఇనాక్, ఏనుగు నరసింహారెడ్డి, చికెన్ రాజు, నందిని సిధారెడ్డి, డా. ప్రభాకర్ జైనీ తదితరులు ఆయాదేశాల ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. ముగింపు సభలో ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, కె.ఐ.వరప్రసాద్ రెడ్డి తదితరులు సందేశాలిస్తారు. రొటీన్ కవి సమ్మేళనాలకు భిన్నంగా ఉగాది పచ్చడిలా విభిన్న వ్యక్తుల, సమూహాల, మేలు కలయికగా ఈ మహాకవి సమ్మేళనాన్ని రూపొందించి తానా ఈసారి ఒక కొత్త సంప్రదాయానికి తెర లేపింది. తెలుగు సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠులైన పాత కవులతో పాటు కొత్త కవులకు ఈ ప్రపంచ కవి సమ్మేళనంలో అవకాశం కల్పించడం శుభ పరిణామం. ముఖ్యంగా పురుషులతో పాటు స్త్రీలకు ఎక్కువమందికి అవకాశం కల్పించడం చెప్పుకోదగ్గ పరిణామం. ఇక మీదట స్థానిక, జాతీయ, అంతర్జాతీయ సాహితీ కళాసంస్థలు అన్నీ ఇదే మార్గాన్ని అనుసరించి తెలుగు సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేయాలని ఆశిద్దాం.


బిక్కి కృష్ణ

Updated Date - 2021-04-10T06:09:11+05:30 IST