తానా “వ్యక్తిత్వ వికాసానికి మార్గం-మాతృభాష” సాహిత్య సదస్సు విజయవంతం

Sep 28 2021 @ 09:04AM

అట్లాంటా, జార్జియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుగుతున్న సాహిత్య సమావేశం సెప్టెంబర్ 26న విజయవంతంగా ముగిసింది. తానా పాలకమండలి అధిపతి డా. బండ్ల హనుమయ్య స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఎంతో మంది సాహితీవేత్తలు తరతరాలుగా మనకందించిన తెలుగు భాష, సాహిత్య సిరిసంపదలు ఎన్నటికి తరగని గని అని, వాటిని భద్రంగా భావితరాలకు అందించాల్సిన భాద్యత ఈ తరానిది అన్నారు. అందుకు తానా అన్ని వేళలా ముందుంటుందని తెలియజేశారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఈ 18వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో “వ్యక్తిత్వ వికాసానికి మార్గం-  మాతృభాష” అనే అంశంపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చడానికి హాజరైన ముఖ్య అతిథి చిట్ల పార్థసారథి(ప్రస్తుత తెలంగాణా రాష్ట్ర ఎన్నికల కమీషనర్) విశిష్ట అతిథులు మేడిశెట్టి తిరుమల కుమార్(ఐ. ఆర్.ఎస్ - పూర్వ చీఫ్ కమిషనర్ అఫ్ ఇన్కంటాక్స్, చెన్నై), నందివెలుగు ముక్తేశ్వర రావు(ఐ.ఏ.ఎస్- పూర్వ జిల్లా కలెక్టర్, ఉమ్మడి నల్గొండ జిల్లా), పోలూరి రాజేశ్వరి(ఐ. ఎఫ్. ఎస్ - ప్రస్తుత డైరెక్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, తమిళనాడు), బుర్రా వెంకటేశం(ఐ.ఏ.ఎస్- ప్రస్తుత ముఖ్య కార్యదర్శి, వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం), డా. పట్నాల సుధాకర్(ఐ.ఏ.ఎస్–110 డిగ్రీలతో ఉత్తీర్ణుడై ప్రపంచ రికార్డు నెలకొల్పిన విద్యావేత్త), డా. బొప్పూడి నాగ రమేశ్(ఐ. పి. ఎస్ - ప్రస్తుతడైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, పశ్చిమ బెంగాల్), గాది వేణు గోపాలరావు(ఐ. ఆర్. ఎస్ - పూర్వ చీఫ్ కమిషనర్ అఫ్ ఇన్కంటాక్స్, ముంబయి), అద్దంకి శ్రీధర్ బాబు(ఐ.ఏ.ఎస్- ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, టొబాకో బోర్డు, గుంటూరు), డా. కరణం అరవింద రావు(ఐ. పి. ఎస్-విశ్రాంత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)లను క్లుప్త పరిచయాలతో సమావేశంలో పాల్గొనేందుకు అందరికీ ఘనస్వాగతం పలికారు.

వక్తలలో చాలా మంది తెలుగు మాధ్యమంలో చదువుకున్నవారు, సివిల్ సర్వీసెస్ పరీక్షలను కూడా తెలుగు భాషలో రాసి తమ ప్రతిభను చూపి వివిధ హోదాలలో రాణిస్తున్నవారు ఉండడం విశేషం. మరి కొద్ది మంది ఆంగ్లమాధ్యమంలో చదివి, ఆంగ్ల భాషలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఎన్నికైన వారు కూడా వ్యక్తపరచిన ఏకాభిప్రాయం ఏమిటంటే –పిల్లలు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో చదువుకోవడం వల్ల వారికి అవగాహన శక్తి పెరిగి, మానసిక వికాసం కలుగుతుందని. అలాగే ఒక మంచి పునాది ఏర్పడి, ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఎన్ని భాషలనైనా నేర్చుకోవడం సులభం అవుతుందన్నారు. నేటి ప్రపంచంలో ఆంగ్లభాషకు ఉన్న ప్రాధాన్యతను ఎవ్వరూ విస్మరించలేమని, విద్యార్ధులు ఎన్ని భాషలు నేర్చినా ఆంగ్లభాషలో మంచి పట్టు సంపాదించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కానీ, తెలుగు భాష పట్ల నిర్లక్ష్యం తగదని అభిప్రాయపడ్డారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర వీరందరి అభిప్రాయాలతో ఏకీభవిస్తూ “వారి వారి మాతృభాషలలో చదువుకున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ.ఆర్.ఎస్, ఐ.ఎఫ్.ఎస్ అధికారులు తెలుగు రాష్ట్రాలలో పనిచేస్తూ అవసరాన్ని బట్టి తెలుగును సులభంగా నేర్చుకోగలగడం ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ప్రపంచ పిల్లల మానసిక శాస్త్రవేత్తలు కూడా పసితనంలో మాతృభాషలో చదువుకున్నవారి మానసిక వికాసం మెరుగుగా ఉంటుందనే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రసార మాధ్యమాలు, సంస్థలు, విద్యాలయాలు, తల్లిదండ్రులు, తెలుగు భాషాభిమానులు అందరూ కలసి పిల్లలకు బాల్యదశ నుండే తెలుగు భాషపై అవగాహన, ఆసక్తి పెంపొందించే దిశగా కృషి చేయ్యాలి. ఈ విషయంలో ఒక కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన భాద్యత అందరిదీ” అని అన్నారు. 

తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఈ నాటి సాహిత్య సమావేశం చాలా అర్ధవంతమైనది, అవసరమైనదని తమ అమూల్యమైన అభిప్రాయాలను వెలిబుచ్చిన అతిధులకు, కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడిన వివిధ ప్రసారమాధ్యమాలకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. “వ్యక్తిత్వ వికాసానికి మార్గం - మాతృభాష” సాహిత్య సదస్సు పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది యు ట్యూబ్ లింక్‌లో చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=97vPNfjYwZw

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.