ఘనంగా ప్రారంభమైన తానా “పుస్తక మహోద్యమం”

ABN , First Publish Date - 2021-10-22T20:45:15+05:30 IST

తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన "పుస్తక మహోద్యమాన్ని" తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు అట్లాంటా నగరంలో గురువారం పలువురు స్నేహితులకు వివిధ పుస్తకాలను బహుమతులుగా అందజేసి లాంఛనంగా ప్రారంభించారు.

ఘనంగా ప్రారంభమైన తానా “పుస్తక మహోద్యమం”

అట్లాంటా: తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన "పుస్తక మహోద్యమాన్ని" తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు అట్లాంటా నగరంలో గురువారం పలువురు స్నేహితులకు వివిధ పుస్తకాలను బహుమతులుగా అందజేసి లాంఛనంగా ప్రారంభించారు. పుస్తకాలను కొని మిత్రులకు, బంధువులకు, పిల్లలకు బహుమతులుగా అందించే అక్షరాల పండుగ అని ఈ సందర్భంగా తానా సభ్యులు పేర్కొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగే ఈ బృహత్ యజ్ఞంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర డల్లాస్ నగరంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ అన్నపూర్ణ పాలేటికి ప్రముఖ సినీగీత రచయిత, తెలుగువేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించిన “శ్రీ నైమిశ వేంకటేశ శతకం”ను బహుమతిగా అందజేసి “పుస్తక మహోద్యమానికి” శ్రీకారం చుట్టారు. 


ఈ సందర్భంగా డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ, తెలుగు సాహిత్య చరిత్రలో ఈ పుస్తక మహోద్యమం ఒక అపూర్వ అధ్యాయం అని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని పుస్తకాలనైనా, ఏ పుస్తకాలనైనా, ఎక్కడైనా కొనుగోలు చేసి, ఎంతమందికైనా, ఏ ఊరిలోనైనా బహుకరించవచ్చని తెలియజేశారు. ఏ సందర్భంలోనైనా సరే తమకు ఇష్టమైన పుస్తకాలను కొనుగోలుచేసి ఆత్మీయులకు బహుమతులుగా అందజేసే అలవాటును ప్రోత్సహించడం, కనీసం పాతిక వేల పుస్తకాలను పాఠకుల చేతుల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో ముందుకు కొనసాగుతున్నామని తెలిపారు. ఈ మహోన్నత కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ భద్రాచలంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ పుస్తక మహోద్యమానికి అనేక సాహితీ సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, రచయితలు, పాఠకుల నుండి తొలినుంచే విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమం వచ్చే సంక్రాంతి పండుగ వరకు ఒక ఉద్యమంగా సాగుతుందని, అందరూ పాల్గొని ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని కోరారు. 


మీరు పుస్తకం బహుకరిస్తున్నప్పుడు తీసిన ఫొటోలను, కొన్ని వివరాలను ఈ https://bit.ly/TANAPUSTAKAMAHODHYAMAMREG లింక్‌లో పొందుపరిస్తే మీ ఫొటోలను తానా అధికారిక వెబ్‌సైటులో నిక్షిప్తం చేయడంతో పాటు తానా సంస్థ ద్వారా మీకు “పుస్తక నేస్తం" అనే ప్రశంసాపత్రం అందజేయబడుతుంది.  

Updated Date - 2021-10-22T20:45:15+05:30 IST