తానా “ప్రపంచ రంగస్థల దినోత్సవం” విజయవంతం

Published: Tue, 29 Mar 2022 08:10:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తానా “ప్రపంచ రంగస్థల దినోత్సవం” విజయవంతం

అట్లాంటా, జార్జియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక”  ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” (ప్రతి నెల ఆఖరి ఆదివారం) కార్యక్రమ పరంపరలో భాగంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం (మార్చి 27) సందర్భంగా నిర్వహించిన 33వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం “పద్యనాటక సాహితీ వైభవం - రంగస్థల కళాకారుల గాన మాధుర్యం” చాలా రసవత్తరంగా సాగింది. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి సదస్సును ప్రారంభించారు. మన తెలుగు భాష, సాహిత్యం, కళలను పరిరక్షిస్తూ, పరివ్యాప్తం  చేయడానికి దశాబ్ధాల చరిత్ర గల్గిన తానా సంస్థ ఎల్లప్పుడూ కంకణబద్ధమై ఉందన్నారు. ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొంటున్న కళాకారులందరికి హార్దిక స్వాగతం పలికారు.


“ఒకప్పుడు ఎంతో వైభవంగా విరాజిల్లిన మన రంగస్థల వేదికలు మసకబారుతున్న వేళ తానా ప్రపంచ సాహిత్య వేదిక సారధ్యంలో అంతర్జాతీయ అంతర్జాల సమావేశం జరుపుకోవడం ముదావహం, ఇది కళాకారులకు ఎంతో ప్రోత్సాహం కల్గిస్తుంది” అని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పేర్కొన్నారు.   


తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల క్రితమే ఆనాటి సామాజిక రుగ్మతలను, దురాచారాలను ఎండగడుతూ సామాజిక శ్రేయస్సును కాంక్షించి విలువైన సాహిత్యాన్ని సృష్టించిన రచయితలను గుర్తుచేసుకోవాల్సిన సమయం ఇది అన్నారు. అలాంటి రచయితలలో ముందు వరసలో ఉండే “చింతామణి” లాంటి అనేక నాటకాలు రాసిన ప్రముఖ నాటకకర్త కాళ్ళకూరి నారాయణరావు; “శ్రీకృష్ణ తులాభారం” పద్యనాటక రచయిత ముత్తరాజు సుబ్బారావు; “పాండవోద్యోగ విజయాలు” లాంటి వందలాది సంస్కృత, తెలుగు గ్రంథాలు, నాటకాలు రచించిన అవధాన జంట కవులు తిరుపతి వేంకట కవులని ప్రశంసించారు. “సత్యహరిశ్చంద్ర” నాటక రచయిత, ఎన్నో సినిమాలకు కథ, మాటలు, పాటలు రాయడమేగాక పలు సినిమాలలో నటించిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి; “గయోపాఖ్యానము” లాంటి గొప్ప నాటకాన్ని రచించిన కవి, నాటకకర్త, సంఘసంస్కర్త, పాత్రికేయుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం గార్ల జీవనయానం ఎంతో స్పూర్తిదాయకం అన్నారు. ప్రతి కళాకారుడు ఆయా నాటకప్రదర్శనల ముందు ఆయా రచయితలను గుర్తు చేసుకుని నాటకాన్ని ప్రారంభించే సంప్రదాయం నెలకొల్పడం అవసరం అని, అదే ఆ రచయితలకు అర్పించే ఘన నివాళి అని తెలిపారు. 

తానా “ప్రపంచ రంగస్థల దినోత్సవం” విజయవంతం

గౌరవ అతిథిగా హాజరైన విశేషానుభవం గడించిన కళాకారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎన్.టి.ఆర్ పురస్కార గ్రహీత గరికపాటి సుబ్బ నరసింహ శాస్త్రి.. మాధవపెద్ది వెంకట్రామయ్య, బందా కనకలింగేశ్వర రావు, అద్దంకి శ్రీరామమూర్తి, పీసపాటి నరసింహ శాస్త్రి లాంటి విశిష్ఠ రంగస్థల కళాకారుల సరసన నటించగల్గడం తన అదృష్టం అంటూ తన 88 ఏళ్ల వయస్సులో కూడా పదును తగ్గని వాచకం, ఉత్సాహంతో పలు పౌరాణిక పద్యాలను శ్రావ్యంగా ఆలపించి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని గావించారు. ఈ కార్యక్రమంలో ఈ క్రింది పేర్కొన్న విశిష్ఠ రంగస్థల కళాకారులు పాల్గొని కొన్ని నాటకాలలోని పద్యాలను మధురంగా ఆలపించి వీనులవిందు చేశారు. 

 

పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్ల గోపాలరావు (శ్రీకాకుళం): ‘హరిశ్చంద్ర– నక్షత్రకుడు’; గుమ్మడి గోపాలకృష్ణ (హైదరాబాద్): “శ్రీకృష్ణ రాయబారం” –‘చెల్లియో చెల్లకో’,‘జెండాపై కపిరాజు’; జూనియర్ దుబ్బు వెంకట సుబ్బారావు (వేటపాలెం): ‘హరిశ్చంద్ర – కాటిసీను’; చిలువేరు శాంతయ్య(మధిర): ‘చింతామణి – భవానీ శంకరుడు’; గుంటి రత్నశ్రీ (కడప): ‘చింతామణి – చింతామణి’; షణ్ముఖి జయ విజయ కుమార్ రాజు (తణుకు): ‘శ్రీకృష్ణ తులాభారం – నారదుడు’; బడే శ్రీరాములు నాయుడు (పార్వతీపురం): ‘గయోపాఖ్యానము – అర్జునుడు’; కొప్పర మంగాదేవి(పార్వతీపురం): ‘హరిశ్చంద్ర – వారణాసి’; పలగాని ఫణి శంకర్ గౌడ్(విజయవాడ): ‘చింతామణి – బిల్వమంగళుడు’;తెలుగు కృష్ణ(మహబూబ్ నగర్): ‘శ్రీకృష్ణ రాయబారం– పడకసీను’; కోట వనజ కుమారి (అనంతపురం): ‘శ్రీ కృష్ణ తులాభారం – సత్యభామ’; ఆరాథ్యుల నాగరాజు(తెనాలి): ‘గయోపాఖ్యానము –శ్రీకృష్ణుడు’; నిమ్మగడ్డ సుగ్రీవుడు(నెల్లూరు): ‘శ్రీరామాంజనేయ యుద్ధం- శ్రీ రాముడు’.


డా. ప్రసాద్ తోటకూర తన సమాపనా సందేశంలో పాల్గొన్న కళాకారులకు, కార్యక్రమాలను సదా ప్రచారం చేస్తున్న ప్రసార మాధ్యమాలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చింతామణి నాటక ప్రదర్శనను నిషేదించడం సబబుగాదని, దానివల్ల ఎంతోమంది కళాకారులు తమ జీవనబృతిని కోల్పోతున్నారని, ప్రభుత్వం నిషేధంపై పునరాలోచించాలని అలాగే అసభ్యతకు తావు లేని, కలుషితంగాని ప్రదర్శనలు ఇవ్వవలసిన భాద్యత కళాకారులపై ఉందన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.