కష్టాల్లో తాండవ

ABN , First Publish Date - 2021-04-22T05:26:50+05:30 IST

తాండవ సహకార చక్కెర కర్మాగారం పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఈ ఏడాది క్రషింగ్‌ సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు ఇప్పటికీ చెల్లింపులు జరపలేదు.

కష్టాల్లో తాండవ

తాండవ చక్కెర కర్మాగారం

చెల్లింపుల కోసం రైతులు, జీతాల కోసం కార్మికులు ఎదురుచూపులు

రూ.20 కోట్ల వరకు పేరుకుపోయిన బకాయిలు

పంచదార నిల్వలున్నా...అమ్ముకోలేని దుస్థితి



పాయకరావుపేట, ఏప్రిల్‌ 21: తాండవ సహకార చక్కెర కర్మాగారం పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఈ ఏడాది క్రషింగ్‌ సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు ఇప్పటికీ చెల్లింపులు జరపలేదు. మరోవైపు కార్మికులకు జీతం బకాయిలు పేరుకుపోయాయి. ఈ రెండూ కలిపి రూ.20 కోట్లకు చేరుకోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో యాజమాన్యం ఉంది.

ఉత్పత్తి వ్యయం ఎక్కువ...మార్కెట్‌లో ధర తక్కువ

పంచదార ఉత్పత్తికి అయ్యే ఖర్చు కంటే..మార్కెట్‌లో  ధర తక్కువగా ఉండడం, చెరకు పంట విస్తీర్ణం తగ్గిపోవడం, పాత యంత్రాలతో నడుస్తుండడం వంటివి ఫ్యాక్టరీ నష్టాలకు కారణాలుగా నిలుస్తున్నాయి. ఇదిలావుంటే, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఈ సంస్థకు మరింత శరాఘాతంగా మారాయి. ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన పంచదారను మార్కెట్‌ రేటు ఆశాజనకంగా వున్న సమయంలో కూడా విక్రయించుకునే వీలు లేకపోవడంతో గత రెండేళ్లుగా ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ విషయం గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గడచిన రెండు సీజన్లలో రైతులకు చెల్లింపుల కోసం సాయం చేసింది. అయినప్పటికీ పరిస్థితి మళ్లీ యథాతథంగా మారింది.


చెల్లింపుల కోసం రైతులు, కార్మికులు నిరీక్షణ

చెరకు సరఫరా చేసిన రైతులు చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారు. అప్పులు చేసి పంట పండించామని, ఇప్పుడు వడ్డీలు కట్టలేకపోతున్నామని వాపోతున్నారు. ఈ మొత్తం  రూ.10 కోట్ల వరకు వుంటుందని అంచనా. అలాగే, కార్మికులు సైతం రెండేళ్లుగా ఇవ్వాల్సిన తమ జీతం బకాయిల కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఈ మొత్తం మరో రూ.10 కోట్ల వరకు ఉంటాయని సమాచారం.


39,350 టన్నుల క్రషింగ్‌తో  ముగిసిన సీజన్‌

ఈ క్రషింగ్‌ సీజన్‌ (2020-21)లో సంస్థ 39,350 టన్నుల చెరకు గానుగాడి 8.1 శాతం రికవరీతో 30,941 క్వింటాళ్ల పంచదారను ఉత్పత్తి విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి చెరకు సరఫరా చేసిన రైతులకు టన్నుకు రూ.2,707 చొప్పున 39,350 టన్నులకు రూ.10.65 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఫిబ్రవరి నెల మూడో వారంలో క్రషింగ్‌ పూర్తయినప్పటికీ ఇప్పటివరకు రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీనికితోడు కార్మికులకు గడచిన 24 నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి.


ప్రభుత్వ సాయం కోసం అభ్యర్థించాం

ఫ్యాక్టరీ ఎదుర్కొంటున్న ఒడిదుడు కులను సంస్థ ఇన్‌చార్జి ఎండీ కె.ఆర్‌.విక్టర్‌రాజు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా, ఫ్యాక్టరీలో గడచిన సీజన్‌లో ఉత్పత్తి అయిన పంచదార బస్తాలు 30,941తో పాటు పాత నిల్వలు 31,645 బస్తాలు కలిపి మొత్తం 62,586 బస్తాలు ఉన్నాయన్నారు. అయితే మార్కెట్‌లో పంచదార బస్తా ధర రూ.3,100 కంటే తక్కువ వున్నందున విక్రయించలేని పరిస్థితి నెలకొందన్నారు.  ఒకవేళ రేటు పెరిగినా కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు తక్కువ బస్తాలు మాత్రమే విక్రయించుకునే వీలుందన్నారు. ఇలా విక్రయించగా వచ్చిన సొమ్ము ఆప్కాబ్‌ బకాయిల కింద జమ కట్టాల్సి వున్నందున రైతుల పేమెంట్లు, కార్మికుల జీతాలకు ప్రభుత్వం నుంచి సాయం అందాల్సిందేనని చెప్పారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగిందని, వచ్చే నెల మొదటి వారంలో నిధులు విడుదలయ్యే అవకాశం వున్నదని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

- కె.ఆర్‌.విక్టర్‌రాజు, ఇన్‌చార్జి ఎండీ

Updated Date - 2021-04-22T05:26:50+05:30 IST