చిక్కి శల్యం

ABN , First Publish Date - 2022-06-30T09:08:38+05:30 IST

చిక్కి శల్యం

చిక్కి శల్యం

రూ.79 దాటిన మారకం రేటు

ఏడాది చివరికల్లా రూ.80-81కి..!?


ముంబై: దేశీయ కరెన్సీ విలువ మరింత క్షీణించి సరికొత్త జీవనకాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఫారెక్స్‌ మార్కెట్లో అమెరికన్‌ డాలర్‌తో మన రూపాయి మారకం విలువ బుధవారంనాడు మరో 18 పైసలు తగ్గింది. దాంతో డాలర్‌-రూపాయి మారకం రేటు రూ.79.03కి చేరుకుంది. ఇది రూ.79 స్థాయిని దాటడం చరిత్రలో ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా డాలర్‌ మరింత బలం పుంజుకోవడం, ముడిచమురు ధరలు మళ్లీ ఎగబాకడంతోపాటు దేశీ ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం ఈ పతనానికి కారణం. మంగళవారంనాడు సైతం రూపాయి 48 పైసలు బలహీనపడి రూ.78.85 వద్దకు చేరింది. కేవలం ఈ నెలలోనే రూపాయి విలువ 1.97 శాతం క్షీణించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6.39 శాతం పతనమైంది. 


మున్ముందు మరింత పతనం 

అమెరికా సెంట్రల్‌ బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను వేగంగా పెంచుతుండటంతోపాటు కరోనా సంక్షోభ సమయంలో కల్పించిన ద్రవ్య ఉద్దీపనలను సైతం క్రమంగా ఉపసంహరించుకుంటోంది. దాంతో డాలర్‌ నిధుల లభ్యత తగ్గనుందన్న భయాలు ఆ దేశ కరెన్సీకి డిమాండ్‌ను పెంచుతున్నాయని హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ దిలీప్‌ పర్మార్‌ పేర్కొన్నారు. మున్ముందు మన రూపాయి విలువ మరింత క్షీణించవచ్చన్నారు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) వార్షిక సదస్సుతోపాటు పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య(ఒపెక్‌) సమావేశం నిర్ణయాలు సమీప భవిష్యత్‌లో రూపాయి మారకం రేటుకు మార్గనిర్దేశం చేయవచ్చని రెలిగేర్‌ బ్రోకింగ్‌కు చెందిన సుగంధ సచ్‌దేవ అన్నారు. ఎక్స్ఛేంజ్‌ రేటు ఇప్పటికే రూ.78.50 కీలక స్థాయిని దాటేయడంతో త్వరలోనేరూ.79.20 వరకు చేరుకోవచ్చన్నారు. ఈ ఏడాది చివరినాటికి మారకం రేటు రూ.80-81 స్థాయిని చవిచూసే అవకాశం ఉందని ఆనంద్‌ రాఠీకి చెందిన జిగర్‌ త్రివేది అన్నారు. 


సెన్సెక్స్‌ 150 పాయింట్లు డౌన్‌  

ఈక్విటీ సూచీల నాలుగు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ట పడింది. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడటంతో సెన్సెక్స్‌ 150.48 పాయింట్లు కోల్పోయి 53,026.97 వద్దకు జారుకుంది. ప్రారంభ ట్రేడింగ్‌లో 565 పాయింట్ల వరకు క్షీణించిన సూచీ.. మధ్యాహ్నానికల్లా స్వల్ప లాభాల్లోకి చేరుకుంది. ఆఖర్లో అమ్మకాల కారణంగా మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. నిఫ్టీ 51.10 పాయింట్ల తగ్గుదలతో 15,799.10 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ షేర్లలో హెచ్‌యూఎల్‌ అత్యధికంగా 3.46 శాతం పతనమవగా.. యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2 శాతానికి పైగా నష్టపోయాయి. ఎన్‌టీపీసీ 2.42 శాతం ఎగిసి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలవగా.. మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 1.98 శాతం, సన్‌ఫార్మా 1.23 శాతం లాభపడ్డాయి. చిన్న, మధ్య స్థాయి కంపెనీల ప్రాతినిథ్య సూచీలైన బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ 0.70 శాతం, స్మాల్‌క్యాప్‌ 0.18 శాతం తగ్గాయి. రంగాలవారీగా చూస్తే, బీఎ్‌సఈ బ్యాంకింగ్‌ సూచీ 1.20 శాతం నష్టపోగా.. ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్‌ ఇండెక్స్‌లు కూడా ఒక శాతానికి పైగా తగ్గాయి. 

Updated Date - 2022-06-30T09:08:38+05:30 IST