‘ఏకత్వ’ వివాదం

ABN , First Publish Date - 2020-10-14T07:11:43+05:30 IST

సామాజిక మాధ్యమాలలో వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత అనంతరం ఆభరణాల వ్యాపారసంస్థ ‘తనిష్క్‌’ తాను రూపొందించిన వాణిజ్య విడియోను ప్రచారంలో నుంచి తొలగించింది....

‘ఏకత్వ’ వివాదం

సామాజిక మాధ్యమాలలో వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత అనంతరం ఆభరణాల వ్యాపారసంస్థ ‘తనిష్క్‌’ తాను రూపొందించిన వాణిజ్య విడియోను ప్రచారంలో నుంచి తొలగించింది. మనోభావాలు గాయపడుతున్నాయన్న కారణం మాత్రమే కాక, తమ సంస్థ సిబ్బంది, భాగస్వాముల క్షేమం దృష్ట్యా కూడా ఆ ప్రచార చిత్రాన్ని ఉపసంహరించుకుంటున్నామని ‘తనిష్క్‌’ చెప్పింది. ఒక నిమిషం నిడివి ఉన్న ఆ లఘు వాణిజ్యచిత్రం పైన, దానిని తరువాత తొలగించడం మీద అనేక చర్చోపచర్చలు జరుగుతున్నాయి.


ప్రతిష్ఠాత్మకమైన టాటా గ్రూపునకు చెందిన ‘తనిష్క్‌’ ప్రచారచిత్రాలకు ఒక ప్రత్యేక సరళి ఉన్నది. టాటా సంస్థల స్థాయిని ప్రతిఫలించేట్టుగా విశిష్టత, ఉదాత్తత వ్యక్తమయ్యే విధంగా ఆ చిత్రాలను రూపొందిస్తారు. తాము మార్కెట్‌ లోకి విడుదల చేసే ఆభరణాల కోవను బట్టి, అందుకు అనుగుణంగా ఉండే వాణిజ్యచిత్రాలను తయారుచేస్తారు. ప్రస్తుతం వివాదంలో ఉన్న చిత్రం ‘ఏకత్వం’ అన్న శ్రేణికి చెందిన ఆభరణాలను ప్రచారం చేసేది. ఇతరుల విషయంలో సహానుభూతిని వ్యక్తం చేసే, మానవీయ అనుభూతులను ప్రకటించే, కుటుంబ సంబంధాల పరస్పరతను తెలియజెప్పే, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించే విధంగా ఆ చిత్రాల చిత్రీకరణ ఉంటుంది. వాటి ప్రధాన లక్ష్యం తమ ఉత్పత్తుల అమ్మకమే అయినప్పటికీ, ఆ ప్రచారాన్ని సందేశాత్మకంగా, ఉన్నతంగా నిర్వహించాలన్నది ఆ సంస్థ ఉద్దేశ్యం కావచ్చు. మైనారిటీ కుటుంబానికి చెందిన అత్తగారు, మెజారిటీ మతానికి చెందిన కోడలికి సీమంతం చేయడం– అనే అంశం నేపథ్యంతో నిర్మించిన వాణిజ్యచిత్రం ఇప్పుడు అనేకుల అభ్యంతరానికి కారణమయింది. ఈ ప్రకటన ‘లవ్‌జిహాద్‌’ను ప్రోత్సహించేవిధంగా ఉన్నదని, తనిష్క్‌ ఉత్పత్తులను బహిష్కరించాలని సామాజిక మాధ్యమాలలో ఉద్యమం మొదలయింది. సోషల్‌ మీడియాలో సంప్రదాయవాదుల ఉద్యమాలు చాలా తీవ్రసరళితో ఉంటాయి. ‘ట్రోలింగ్‌’ అని చెప్పే వేధింపు చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది.


‘తనిష్క్‌’ చిత్రంపై అభ్యంతరం చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుంది. అది ఆరోగ్యకరమైన విమర్శ స్థాయిలో ఉండడం వాంఛనీయం. ఏ అంశం మీద అయినా విమర్శ భావచర్చ లాగానే ఉండాలి. కానీ, తమ వ్యాపారానికి, సిబ్బంది యోగక్షేమాలకు భంగం కలుగుతుందేమోనని టాటా వంటి సంస్థ భయపడే పరిస్థితి వాంఛనీయం కాదు. కులాలు, మతాలు కృత్రిమమైన అడ్డుగోడలని, వాటిని అధిగమించి మానవసంబంధాలు ఎదగాలని కోరుకోవడమే ఆదర్శంగా ఆధునిక భారతం భావించింది. కులాంతరాలను పరువు తక్కువ అని, మతాంతరాలను జాతి వ్యతిరేకమని భావిస్తే, గోడలు తప్ప ఏమి మిగులుతాయి? హిందూ స్త్రీ ముస్లిమ్‌ కోడలు అయినట్టు ఆ చిత్రంలో చూపించారు, ముస్లిమ్‌ స్త్రీయే హిందువుల కోడలు అయినట్టు ఎందుకు చూపించలేదు?– అని అడుగుతున్న ప్రశ్న అడగదగ్గదే. ఒకే స్థాయిలో జరుగుతున్నాయో లేదో చెప్పలేము కానీ, అన్ని రకాలుగాను, అన్ని మతాల మధ్యనా ప్రేమ వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, కొన్ని రకాలు మాత్రం ఎక్కువ ఉద్రిక్తంగా పరిణమిస్తున్నాయి. సామాజిక పరిశీలకుల ప్రకారం, అగ్రకులాలు అనుకునే వారి ఆడపిల్లలకు, కిందికులాలని పిలిచే వారి మగపిల్లలకు మధ్య కులాంతర ప్రేమ ఉన్నప్పుడు, అది ఎక్కువ అభ్యంతరం కలిగిస్తున్నది, తీవ్రహింసకు దారితీస్తున్నది. ఆడపిల్లలు ఎక్కువ చొరవ తీసుకుంటున్నారంటే, వారి సామాజిక నేపథ్యానికి చైతన్యావకాశాలు, ఆదర్శాల సంసిద్ధత ఎక్కువ ఉన్నదన్న మాట. దాన్ని అవగతం చేసుకుంటే కులాంతర, మతాంతర వివాహాలు ఆందోళన చెందదగ్గవి కాదని తెలుస్తుంది.


తనిష్క్‌ వివాదంలో వ్యక్తమైన సామాజిక అభ్యంతరాలు పరిష్కారం కావాలంటే ఎంతో ప్రయత్నం, చొరవా కావాలి. చాలా సమయం కూడా పట్టవచ్చు. కానీ, ఈ విషయంలో టాటా గ్రూపుల మాజీ అధిపతి, ప్రస్తుతం ఆ గ్రూపు దాతృత్వ సంస్థల సారథి రతన్‌ టాటా మౌనం వహించడం ప్రగతిశీల శక్తులకు ఆశ్చర్యం కలిగించింది. నడిమంత్రపు కార్పొరేట్‌ మహాకాయుల వలె కాక, టాటాలకు భిన్నమయిన ప్రతిష్ఠ ఉన్నది. కొన్ని అంశాలలో వారి ధోరణి కూడా క్షీణవిలువలను ఆశ్రయించినప్పటికీ, వ్యక్తిగతంగా ఉదాత్త విలువలను, పారిశ్రామిక సంప్రదాయాలను పాటించడం, వెకిలి ఆడంబరమూ ప్రస్ఫుటమైన లాభలాలసత్వమూ లేకపోవడం– టాటాలను ప్రత్యేకంగా నిలుపుతాయి. వేధింపులకు బెదరవద్దని, ‘టైటాన్‌’ లాగా నిలబడాలని అనేకమంది కోరారు. తనిష్క్‌ ప్రకటనే తప్ప, టాటాల అభిప్రాయం ఏమిటో తెలియదు.


ఇది ఒక ఒరవడిగా మారితే, దాని ప్రభావాలు ఎట్లా ఉంటాయి? ప్రజలు మాత్రమే బాధితులయితే, వారు దానికి అలవాటు పడడమో, ఎదిరించడమో చేస్తారు. మరి ఆరోగ్యకరమైన వాణిజ్య వాతావరణానికి ఇటువంటి నిషేధాలు అనువుగా ఉంటాయా? అంబానీలకు, అదానీలకు ఏ అభ్యంతరాలు ఉండవేమో? జాతీయోద్యమ కాలం నుంచి, జాతీయ పరిశ్రమలకు పాదులు వేసిన సంస్థ తన విలువకు నిలబడడమో, పోనీ అసహనపు విలువలే సరి అయినవని అంగీకరించడమో చేసి ఉండవలసింది.


దేశంలో పెరుగుతున్న ఛాందస విలువల ప్రభావాన్ని, అధికారాన్ని ఇట్లాగే అనుమతిస్తే విలోమ ఫలితాలను, భస్మాసుర పర్యవసానాలను ఇవ్వగలదని జాతీయస్థాయి ప్రభుత్వ పెద్దలు, నాయకులు గుర్తించాలి. ఈ ఉదంతం ప్రపంచంలో భారతదేశానికి ఎంత తలవంపులు తెస్తుందో గ్రహిస్తే, ఇటువంటి వాటికి ప్రోత్సాహం ఇవ్వకూడదని గ్రహించేవారు. హద్దులు, ఆంక్షలు, లైసెన్సులు లేని ప్రపంచీకరణ అని చెబుతున్నాము కదా, మరి మన మనసులు, ఆలోచనలు ఎందుకు ఇంత ఇరుకుగా మారుతున్నాయి?

Updated Date - 2020-10-14T07:11:43+05:30 IST