TANTEX ఆధ్వర్యంలో ఘనంగా 172వ సాహిత్య సదస్సు

ABN , First Publish Date - 2021-11-23T19:11:56+05:30 IST

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 21న జరిగిన 172వ సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది.

TANTEX ఆధ్వర్యంలో ఘనంగా 172వ సాహిత్య సదస్సు

డాలస్, టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 21న జరిగిన 172వ సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. ఆరంభంలో దీపావళి పండగ సందర్భంగా సంస్థ అద్యక్షులు లక్ష్మి అన్నపూర్ణపాలేటి సదస్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారి మాడ సమన్వితల ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది. ఈ మాసపు సాహిత్య సభకు ముఖ్యఅతిథిగా డాక్టర్ కొంపెల్ల భాస్కర్ విచ్చేశారు. ఉపద్రష్ట సత్యం ముఖ్య అతిథిని సభకు పరిచయం చేశారు. డాక్టర్ కొంపెల్ల భాస్కర్ “విశ్వనాథ నవలలో స్త్రీ పాత్రలు” విశ్లేషిస్తూ చక్కటి ఉపన్యాసం చేశారు. వారు అమెరికా విశ్వవిద్యాలయాలలో ఆచార్యునిగా, పరిశోధకునిగా పని చేశారు. ఆ తరువాత ఇరవై ఏళ్ళుగా మోటరోలా, జనరల్ ఎలక్ట్రిక్‌లో పని చేస్తున్నారు. ఇష్టమైన పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, సంగీతం వినడం వీరి అభిరుచులు. సంస్కృ, ఆంగ్ల సాహిత్యాలు, విభిన్న సంస్కృతులను అర్థంచేసుకోవడం, చారిత్రక కాల్పనిక సాహిత్యం, పద్య రచన, శాస్త్ర పరిశోధన, సంస్కృత వ్యాకరణం, సాహిత్యంపై వ్యాసాలు రాయడం వీరికి ఎంతో ఇష్టం. అలాగే సాహిత్యంపై వారికున్న అవగాహన, ప్రసంగ పటిమ సభికులను విశేషంగా ఆకర్షించాయి.


“పద్య సౌగంధం” శీర్షికన ఉపద్రష్ట సత్యం విశేషాలు విశ్లేషించారు. “మన తెలుగు సిరి సంపదలు” ధారావాహికలో భాగంగా ఉరుమిండి నరసింహా రెడ్డి కొన్ని పొడుపు కథలు, ప్రహేళికలు ప్రశ్నలు జవాబుల రూపంలో సంధిస్తూ సభ్యులను భాగం చేశారు. అరవిందా రావు “పడుతుంది సమయం” గురించి వివరించారు. కార్యక్రమంలో చివరి అంశంగా మాసానికో మహనీయుడు శీర్షికన ఈ మాసంలో జన్మించిన విశిష్ట రచయితలను అరుణ జ్యోతి గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి, నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సమన్వయకర్త నీరజా కుప్పచ్చి తదితర స్థానిక సాహిత్య ప్రియులు హాజరయ్యారు. సమన్వయకర్త విశిష్ట ముఖ్య అతిథులకు జ్ఞాపికలు చదివి వినిపించారు. సంఘం అధ్యక్షులు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి ముఖ్య అతిథి డాక్టర్ కొంపెల్ల భాస్కర్, ప్రార్థనా గీతం పాడిన చిన్నారి మాడ సమన్వితతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2021-11-23T19:11:56+05:30 IST