TANTEX 'నెలనెలా తెలుగు వెన్నెల' 179వ సాహితీ సదస్సు

ABN , First Publish Date - 2022-06-24T16:38:25+05:30 IST

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 19న జరిగిన 179వ 'నెలనెలా తెలుగు వెన్నెల' కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది.

TANTEX 'నెలనెలా తెలుగు వెన్నెల' 179వ సాహితీ సదస్సు

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 19న జరిగిన 179వ 'నెలనెలా తెలుగు వెన్నెల' కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త కోలా అరుణ జ్యోతి అంతర్జాలంలో సభకు విచ్చేసిన సాహితీవేత్తలకు నమస్కారాలు తెలిపారు. చిన్నారి భవ్య గంధము 'పూయరుగా – కస్తూరి' అంటూ త్యాగరాయస్వామి కీర్తనని తన మధుర గానంతో వీనుల విందుగా పాడి సాహితీ ప్రియులను పరవశింప చేసింది.


ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) 179వ నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ముఖ్య అతిథి డాక్టర్ పాతూరి అన్నపూర్ణ ''సాహిత్యం సామాజిక స్రృహ'' అనే శీర్షికన అద్భుతమైన ప్రసంగము చేశారు. వ్యాఖ్యానము చేసి తన అద్భుతమైన ప్రసంగముతో సభికులను ఆకట్టుకున్నారు. సాహిత్యానికి సమాజానికి మధ్యగల సంబంధాన్ని అవినాభావ సంబంధాన్ని ఉదాహరణలతో వివరిస్తూ అక్షరాలను ఆరాధిస్తే సాహిత్యం పైన ప్రేమ పుడుతుందని వచ్చేతరానికి చక్కని సందేశాన్నిచ్చారు. ప్రతి నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో సత్యం ఉపద్రష్ట, రాధ కాశీనాధుని కలిసి పద్య సౌగంధం అనే శీర్షికను నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నెల కాశీనాధుని రాధ మహాభారతంలోని ఉద్యోగ పర్వంలోని పద్యాలను చదివి సందర్భ సహిత వ్యాఖ్యతో సహా భావార్ధాలను సులభరీతిలో వివరించి పద్య కుసుమ సౌరభాలను వెదజల్లారు.


ఆధునిక సహజ పండితులు డా. ఊరుమిండి నరసింహారెడ్డి తాము 2018 నుండి నేటి వరకు సభకు హాజరవుతున్న వారినందరినీ భాగస్వాములను చేయాలన్న సత్సంకల్పముతో నెల నెలా నిర్వహిస్తున్న "మన తెలుగు సిరిసంపదలు" కార్యక్రమంలో పొడుపు కథలు, మూడక్షరాల పదభ్రమకాలతో మిళితమైన పద్యాలు చమత్కార గర్భితమైన ప్రశ్నలు సంధించి సాహితీ ప్రియులను ఆలోచింపచేసి వారి నుండి సరియైన సమాధానాలను రాబట్టే ప్రయోగం కొనసాగించారు. హాజరైన వారందరి మెదడుకు మేత వేసి సాహితీ ప్రియులలో ఉత్సాహాన్ని నింపి అందరి ప్రశంసలనందుకొన్నారు.


ప్రముఖ సాహితీ విశ్లేషకులు శ్రీ లెనిన్ వేముల ప్రబంధ కవి అల్లసాని పెద్దన ఉత్పలమాల పద్యాలు రాగయుక్తంగా పాడి వినిపించి పద్యాల విశిష్టతను సోదాహరణముగా వివరించి తమ పాండిత్య ప్రతిభను చాటుకున్నారు. ''మాసానికో మహ నీయుడు'' శీర్షిక క్రింద జూన్ నెలలో జయంతి, వర్ధంతి జరుపుకొంటున్న ప్రముఖ కవుల వివరాల్ని అందించారు. అలాగే ఈ నెలలో పరమపదించిన ప్రముఖ కవులు శీలా వీర్రాజు గురించి ఆయన జీవిత విశేషాలతో పాటు వారు రాసిన రచనల్ని సవివరముగా వివరించిన డా. అరుణజ్యోతి కోలాగారి కృషి ప్రసంశనీయం.


సంస్థ ప్రస్తుత అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి మాట్లాడుతూ ఈనెల 25వ తేదీన జరిగే శతక జైత్రయాత్ర కార్యక్రమం వివరాలను వెల్లడించారు. సత్యం ఉపద్రష్ట.. జొన్నవిత్తుల గురించి పరిచయం చేశారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఈ నెల సాహిత్య వేదిక సమన్వయ కర్తగా వ్యవహరించిన కోలా అరుణజ్యోతి, ముఖ్య అతిథి డాక్టర్ పాతూరి అన్నపూర్ణకు జ్ఞాపికను బహుకరించారు. ప్రార్థనా గీతం పాడిన భవ్యతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు ఉమామహేష్ పార్నపల్లి, TANTEX కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రంమంలో ఆసాంతం పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన సాహితీ ప్రియులకు సమన్వయకర్త ధన్యవాదాలు తెలియజేశారు. 


Updated Date - 2022-06-24T16:38:25+05:30 IST