తత్వాన్ని బట్టి తంత్రం!

ABN , First Publish Date - 2021-02-04T05:33:39+05:30 IST

భారతీయ మహిళల్లో ప్రధానంగా రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్‌... ఈ రెండు రకాల కేన్సర్లు ఎక్కువగా ఉంటున్నాయి.

తత్వాన్ని బట్టి తంత్రం!

కేన్సర్‌ సోకితే, మరణమే శరణ్యమనుకునే రోజులు పోయాయి. ఈ మహమ్మారి మెడలు వంచే అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ వ్యాధి మీద సంపూర్ణ విజయం సాధించాలంటే, కేన్సర్‌ తత్వం ఆధారంగా చికిత్స ఎంచుకోవాలి అంటున్నారు వైద్యులు.


భారతీయ మహిళల్లో ప్రధానంగా రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్‌... ఈ రెండు రకాల కేన్సర్లు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఇటీవలి కాలంలో వ్యక్తిగత శుభ్రత, సామాజిక స్పృహ పెరిగిన క్రమంలో, గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ క్రమేపీ తగ్గుముఖం పట్టింది. అయితే రొమ్ము కేన్సర్‌ విషయంలో ఇందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. కొరవడుతున్న శారీరక వ్యాయామం, అధిక బరువు కారణంగా రొమ్ము కేన్సర్‌ కేసులు పూర్వం కంటే పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలంటే ప్రతి మహిళా అప్రమత్తంగా వ్యవహరించాలి. 


ఇలా కనిపెట్టాలి!

కేన్సర్‌ వచ్చిన తర్వాత చికిత్సతో అదుపులోకి తీసుకురావడం కంటే, సోకక ముందే, ప్రీ మాలిగ్నెంట్‌ దశలోనే కనిపెట్టి చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఈ దశలో కేన్సర్‌ చికిత్స సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇందుకోసం రొమ్ము కేన్సర్‌ బయల్పరిచే లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచాలి. 


 రొమ్ములను స్వీయ పరీక్ష చేసుకుంటూ గడ్డలు కనిపిస్తే వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. 


 40 ఏళ్లు దాటిన మహిళలు ప్రతి రెండేళ్లకు ఓసారి, 50 ఏళ్లు దాటిన మహిళలు ఏడాదికోసారి మామోగ్రామ్‌ పరీక్ష చేయించుకోవాలి.


  నెలసరి సమయంలో రొమ్ములో తలెత్తే సలపరం సహజం. అయితే నెలసరితో పని లేకుండా రొమ్ములో నొప్పి ఉంటే కేన్సర్‌గా అనుమానించాలి.


 రొమ్ము నుంచి స్రావం, రొమ్ములో సొట్టలు ఏర్పడడం, చర్మం మీద మచ్చలు, పుండ్లు, చనుమొనలు లోపలికి తిరిగి ఉండడం, రెండవ రొమ్ముతో పోలిస్తే, మొదటి రొమ్ములో మార్పు తలెత్తడం కూడా కేన్సర్‌ లక్షణాలే! 



కేన్సర్‌ పరీక్షలు!

మామోగ్రామ్‌, బ్రెస్ట్‌ అలా్ట్రసౌండ్‌ పరీక్షలతో రొమ్ము సమస్యను కచ్చితంగా కనిపెట్టవచ్చు. ఇలా రొమ్ముకు సంబంధింని సమస్యను ప్రారంభంలోనే గుర్తించడం ద్వారా అది కేన్సర్‌ అయినా, కాకపోయినా, మున్ముందు కేన్సర్‌గా పరిణమించకుండా అవసరమైన చికిత్సతో నివారించుకునే వీలుంది. ఒకవేళ కేన్సర్‌గా నిర్థారణ జరిగితే, సమర్థమైన చికిత్సతో వ్యాధిని సమూలంగా నయం చేసుకోవచ్చు. 


రొమ్ము కేన్సర్‌ వంశపారంపర్యం!

కుటుంబంలో ఇద్దరు, లేదా ముగ్గురికి రొమ్ము కేన్సర్‌ ప్రబలి ఉన్నప్పుడు మాత్రమే, ఈ వ్యాధి వంశపారంపర్యంగా సంక్రమించే వీలుంది.  అమ్మ, చెల్లెలు, కూతురు... ఇలా మూడు తరాలకు రొమ్ము కేన్సర్‌ సోకి ఉంటే, తదుపరి తరంలోని మహిళలకు ఇదే కేన్సర్‌ సంక్రమించే అవకాశాలు ఎక్కువ. పిన్ని, అమ్మమ్మ, మేనత్త, మనవరాలికి రొమ్ము కేన్సర్‌ ఉన్నా, వారి సంతానానికి ఇదే కేన్సర్‌ సంక్రమించే అవకాశాలూ ఎక్కువే!




జీన్‌ టెస్టింగ్‌!

కేన్సర్‌ సంక్రమించే అవకాశాలను ముందుగానే కనిపెట్టే పరీక్షలు ఉన్నాయి. బి.ఆర్‌.సి.ఎ1, బి.ఆర్‌.సి.ఎ2 జన్యువులను పరీక్షించడం ద్వారా రొమ్ము కేన్సర్‌ సంక్రమించే అవకాశాన్ని తేలికగా కనిపెట్టవచ్చు. ఈ పరీక్ష ఎవరైనా, ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఒకవేళ కుటుంబంలో రొమ్ము కేన్సర్‌ ఉండి ఉంటే, యుక్తవయసులోకి అడుగు పెట్టిన వెంటనే జీన్‌ టెస్ట్‌ చేయించుకోవాలి.


ఒకవేళ కేన్సర్‌ కారక జన్యువులు ఉన్నట్టు పరీక్షలో తేలితే, పిల్లలు కలిగిన తర్వాత (ఫెర్టిలిటీ దశ) కేన్సర్‌ నియంత్రణ చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఈ చికిత్సలో భాగంగా ప్రొఫైలాక్టిక్‌ మాస్టెక్టమీ (సర్జరీతో రొమ్మును తొలగించుకోవడం) చేయించుకోవలసి ఉంటుంది. ఈ కోవకు చెందిన మహిళలకు రొమ్ము కేన్సర్‌ సంక్రమించే అవకాశాలు 80 నుంచి 90ు ఉంటాయి. కాబట్టి ముందుగానే సర్జరీతో రొమ్ములను తొలగించుకుని కేన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చు. 


పర్సనలైజ్‌డ్‌ మెడిసిన్‌!

సంక్రమించిన కేన్సర్‌, ఆ కేన్సర్‌కు శరీరం స్పందించే తీరులను జన్యు పరీక్ష ద్వారా లెక్కించి, అందుకు తగిన చికిత్సను ప్రణాళికాబద్ధంగా అంచనా వేసే చికిత్సా విధానం పర్సనలైజ్‌డ్‌ మెడిసిన్‌. ఈ చికిత్సతో భాగంగా కీమోథెరపీ, రేడియోథెరపీలను అవసరాన్ని బట్టి వైద్యులు సూచిస్తారు. 


కాంబినేషన్‌ మెడిసిన్‌

కేన్సర్‌ తత్వాన్ని బట్టి కీమోథెరపీని అనుసరించవలసి ఉంటుంది. కొన్ని రకాల కేన్సర్లకు నోటి ద్వారా మాత్రల రూపంలోని కీమోథెరపీ ఫలితాన్ని ఇవ్వవచ్చు. మరికొన్నింటికి ఇంట్రావీనస్‌ కీమోథెరపీ అవసరం పడుతుంది. రొమ్ము కేన్సర్‌లో నోటి మాత్రల రూపంలోని కీమోథెరపీని వైద్యులు అత్యంత అరుదైన సందర్భాల్లోనే సూచిస్తారు. హార్మోన్‌ రిసెప్టార్‌ పాజిటివ్‌ ఉన్నవారికి మాత్రమే మాత్రల రూపంలోని కీమోథెరపీ కనీసం ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకూ కొనసాగించవలసి ఉంటుంది. 





ఇతర అవయవాలకు పాకినా...

రొమ్ము కేన్సర్‌ మెటాస్టాట్‌ అయి, ఇతర అవయవాలకు పాకినా నయం చేయగలిగే చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇమ్యునోథెరపీ, లేటెస్ట్‌ రెజ్యూమ్‌ కీమోథెరపీలతో అడ్వాన్స్‌ దశలో ఉన్న రొమ్ము కేన్సర్లు కూడా 20 నుంచి 30ు మేరకు సంపూర్తిగా నయం అవుతున్నాయి. కేన్సర్‌ వ్యాధిని ఎంత ఆలస్యంగా కనిపెడితే, అంత త్వరగా మరణం సమీపిస్తుందనే నమ్మకం సర్వత్రా ఉంది. ఇది ఒక రకంగా వాస్తవమే! అయితే కేన్సర్‌ ఎంతటి తీవ్ర దశకు చేరుకున్నా, ఆశావహ స్థితికి తీసుకురాగల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ట్రిపుల్‌ నెగటివ్‌ వేరియెంట్‌ అయిన ఇ.ఆర్‌.పి.ఆర్‌ నెగటివ్‌ తత్వంతో కూడిన కేన్సర్‌ చికిత్సకు లొంగదు. ఎంతటి సమర్థమైన చికిత్సలు అందించినా ఈ రకం కేన్సర్‌ ఉధృతంగా విస్తరిస్తుంది.


 డాక్టర్‌ సిహెచ్‌.మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్స్‌,

హైదరాబాద్‌. 

ఫోన్‌: 9848011421




వీటితో కేన్సర్‌ నుంచి రక్ష!

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే, చేతులు కాలకముందే అప్రమత్తంగా ఉండడం మేలు! ఇదే నానుడి కేన్సర్‌కూ వర్తిస్తుంది. ఇందుకోసం కేన్సర్‌ను కలిగించే అలవాట్లకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాలి. అన్ని రకాల కేన్సర్‌ల నుంచి రక్షణ కల్పించే ఆరోగ్య సూత్రాలు ఇవే!


పోషకాహారం

మాంసాహారంతో పోలిస్తే, వృక్షజాతికి చెందిన ఆహారం కేన్సర్‌ నుంచి ఎక్కువ రక్షణ కల్పిస్తుంది. కాబట్టి తాజా పళ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలి.


తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు

కొవ్వులు, పిండిపదార్థాలతో కూడిన అధిక కేలరీలు అందించే పదార్థాలు తగ్గించి, పీచు, ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే పదార్థాలను పరిమితంగా తీసుకోవాలి. పాలిష్‌ పట్టిన బియ్యం, చక్కెర లాంటి అధిక కేలరీలు కలిగిన పదార్థాలను తగ్గించాలి.


తగినంత బరువు

రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, మూత్రపిండాల కేన్సర్ల కారకాల్లో అధిక బరువు ఒకటి. కాబట్టి ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. బరువు పెరిగే కొద్దీ కేన్సర్‌ వచ్చే అవకాశాలూ పెరుగుతాయి. శారీరక వ్యాయామంతో రొమ్ము, పెద్దపేగు కేన్సర్ల ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి వారం మొత్తంలో కనీసం 150 నిమిషాల సాధారణ వ్యాయామం లేదా 75 నిమిషాల తీవ్రతతో కూడిన వ్యాయామం, లేదా రోజూ క్రమంతప్పకుండా 30 నిమిషాల పాటు సాధారణ వ్యాయామం చేయాలి.


వ్యాక్సిన్లు

గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ నుంచి రక్షణ కోసం హెచ్‌.పి.వి వ్యాక్సిన్‌, కాలేయ కేన్సర్‌కు కారకమయ్యే హెపటైటిస్‌ బి వైరస్‌ నుంచి రక్షణ కోసం హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ వేయించుకోవాలి.


వ్యాధినిర్థారణ పరీక్షలు

కేన్సర్‌ను ముందుగానే కనిపెట్టగలిగే స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయించుకోవడం అవసరం. పెద్దపేగు, రొమ్ము, గర్భాశయ ముఖద్వారం మొదలైన కేన్సర్లను వ్యాధినిర్థారణ పరీక్షలతో ఎంతో ముందుగానే కనిపెట్టే వీలుంది. కాబట్టి ఈ పరీక్షలు నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా కేన్సర్‌ చరిత్ర కలిగిన కుటుంబీకులు తప్పనిసరిగా కేన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.


 డాక్టర్‌ నాగకిశోర్‌,

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్‌, గుంటూరు.

ఫోన్‌ : 0863 2223300


Updated Date - 2021-02-04T05:33:39+05:30 IST