జల్‌జీవనే దిక్కు

ABN , First Publish Date - 2021-01-22T05:19:54+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు దాహార్తి తీర్చేందుకు నేరుగా కుళాయిల ద్వారా నీటి సరఫరా చేసేందుకు కేంద్రం జల్‌జీవన మిషన ప్రారంభించింది. 2024కల్లా పల్లెల్లోని ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వాలన్నది ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఇప్పటి వరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు ఆ పథకమే దిక్కుగా కనిపిస్తోంది.

జల్‌జీవనే దిక్కు
సుండుపల్లె మండలం తూర్పుపల్లెలో జల్‌జీవన మిషన ద్వారా తవ్వుతున్న పైప్‌లైను

ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు

జిల్లాలో రెండు లక్షల ఇళ్లకు నీటి ధార

రూ.84 కోట్లతో పనులు మొదలు

కడప, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు దాహార్తి తీర్చేందుకు నేరుగా కుళాయిల ద్వారా నీటి సరఫరా చేసేందుకు కేంద్రం జల్‌జీవన మిషన ప్రారంభించింది. 2024కల్లా పల్లెల్లోని ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వాలన్నది ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఇప్పటి వరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు ఆ పథకమే దిక్కుగా కనిపిస్తోంది. వేసవి వచ్చిందంటే చాలు.. ప్రతి యేటా తాగునీటి కోసం గ్రామీణ ప్రాంతాల్లో గుక్కెడు నీటి కోసం వ్యవసాయ పొలాల వద్దకు పరుగులు పెట్టే దృశ్యాలు కనిపిస్తుంటాయి. అయితే జల్‌జీవన మిషనతో ఆ నీటి కష్టాలకు చెక్‌ పడుతుందని అధికారులు అంటున్నారు. జిల్లాలో జల్‌జీవన ద్వారా రెండు లక్షల ఇళ్లకు కుళాయిలను ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.84,62,24,000 ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించారు. జిల్లాలో 807 గ్రామ పంచాయతీలు, 4418 హ్యాబిటేషన్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జనాభా 19,53,439 మంది ఉన్నారు. 11,618 చేతి పంపులు, పీడబ్ల్యుఎఫ్‌, ఎంపీడబ్ల్యుఎస్‌, డీపీ నీటి పథకాలు 5212, పీపీడబ్ల్యుఏ స్కీంలు 25 ఉన్నాయి. వీటి ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రోజూ ప్రతి ఒక్కరికీ 40 లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే కొన్నిచోట్ల నీటి లభ్యత లేకపోవడంతో 104 చోట్ల రోజూ పది లీటర్లు, 289 చోట్ల 20 లీటర్లు, 396 చోట్ల 30 లీటర్లు ఇస్తుండగా 749 చోట్ల 40 లీటర్లు ఇస్తున్నారు.


జల్‌జీవనే దిక్కు

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల గృహాలుండగా 3 లక్షల ఇళ్లకు కుళాయిలున్నాయి. మరో 2 లక్షల ఇళ్లకు కనెక్షనలు లేవు. అయితే జల్‌జీవన మిషన ద్వారా ప్రతి ఇంటికీ కనెక్షన ఇవ్వనున్నారు. మొదటి విడతలో 2020-21 సంవత్సరంలో లక్షా 20 వేల 812  కనెక్షన్లను ఇవ్వాలని నిర్ణయించారు. తొలి విడతలో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కనెక్షన ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 37,184 కనెక్షన్లను ఇచ్చారు. జనవరిలో ఇప్పటివరకు 1015 కనెక్షన్లను ఇచ్చారు. 2024 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన ఇవ్వాలన్నది మోదీ ప్రధాన లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే పనులు ప్రారంభించారు. జిల్లాలో 3248 హ్యాబిటేషన్లలో కుళాయి కనెక్షన పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం ఐదు లక్షలు అంచనాలు ఉన్న పనులను చే పడుతున్నారు.


ప్రతిరోజూ 2500 కనెక్షన్లు ఇచ్చేలా లక్ష్యం 

- మల్లికార్జున, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యుఎస్‌

2024 నాటికి కుళాయి ద్వారా ప్రతి ఇంటికీ నీరు ఇవ్వాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యం. మన జిల్లాలో 2 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన ఇస్తున్నాం. ఈ ఏడాది లక్షా 20వేల 812 కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయం పెట్టుకున్నాం. మిగతా కనెక్షన్లు వచ్చే ఏడాదిలో ఇస్తాం. రోజూ 2500 కనెక్షన్లు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాం. అందుకు తగ్గట్లుగానే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రతి ఇంటికీ కుళాయి నీళ్లందుతాయి.

Updated Date - 2021-01-22T05:19:54+05:30 IST