‘జల్‌జీవన్‌’లో జోరేదీ?

Published: Thu, 19 May 2022 03:28:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జల్‌జీవన్‌లో జోరేదీ?

కేంద్రం నిధులిచ్చినా.. సాగని పనులు

కాంట్రాక్టర్ల బిల్లులకు భరోసా కరవు

పనులు చేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు

టెండర్లు దక్కించుకున్న వారు సైతం వెనకడుగు

నిధులున్నా బిల్లులివ్వరన్న ఆందోళన


పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్‌ పెడుతుండటంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. కేంద్రం నుంచి నిధులొచ్చినా, వాటిని వాడేసుకుని, పనులు చేసిన వారికి మొండిచేయి చూపడం ప్రభుత్వ నైజంగా మారింది. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో కేంద్రం ఇచ్చిన నిధులను సైతం సక్రమంగా వాడుకోలేని దుస్థితిలో వైసీపీ సర్కార్‌ ఉంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందించాలన్న సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 15న జల్‌జీవన్‌ మిషన్‌ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్లు నీరందిస్తారు. 50:50 విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకంలో నిధు లు వెచ్చించాల్సి ఉంది. కేంద్రం గత మూడేళ్లలో ఈ పథకానికి రూ.8,692 కోట్లు మంజూ రు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,265 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగింది. పనులు చేసి నా, ప్రభుత్వం బిల్లులివ్వదన్న అపనమ్మకంతో ఒక్క కాంట్రాక్టర్‌ కూడా పనులు దక్కించుకునేందుకు సాహసించడం లేదు. గతంలోనే టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆ పను లు చేసేందుకూ ముందుకు రావడం లేదు. పనులు ప్రారంభించాలని ఇంజనీర్లపై కలెక్టర్లు ఒత్తిడి తెచ్చినా, క్షేత్రస్థాయిలో ఈ పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. 


కనీస వసతుల కల్పనలో విఫలం..

ప్రజలకు కనీసం సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్రం తెచ్చిన జల్‌జీవన్‌ మిషన్‌ పథకాన్ని సైతం సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడింది. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనాలను సైతం సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019-20 ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.372 కోట్లు మంజూరుచేస్తే రాష్ట్రంలో ఈ పథకం ద్వారా రూ.176 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.54.80 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అదే విధంగా 2020-21లో కేంద్రం రూ.790 కోట్లు తన వాటాగా మంజూరుచేసింది.


రాష్ట్రం లో జల్‌జీవన్‌ కింద ఆ ఏడాది మొత్తం రూ.608 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.180.97 కోట్లు మాత్రమే విడుదల చేసింది.  2021-22 లో కూడా కేంద్రం రూ.3,182 కోట్లు మంజూరుచేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.235 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఆ ఏడాది రూ.470 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. వేసవి రావడంతో పలు గ్రామాల్లో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రజలకు తాగునీటి భరోసా కల్పించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని పలువురు విమర్శిస్తున్నారు.


కుళాయి నీరు అందని 39 లక్షల కుటుంబాలు..

జల్‌జీవన్‌ మిషన్‌ పథకం అమల్లోకి వచ్చేనాటికే(2019 ఆగస్టు 15) రాష్ట్రంలో 95.16 లక్షల కుటుంబాలున్నాయి. వాటిలో 30.74 లక్షల కుటుంబాలకు అప్పటికే కుళాయి నీరు అందుతోంది. ఈ మూడేళ్లలో మరో 24.54 లక్షల కుటుంబాలకు కుళాయి నీరు అందించారు. దీంతో రాష్ట్రంలో 55.28 లక్షల కుటుంబాలకు ప్రస్తుతం కుళాయి నీరు అందుతోంది. ఇంకా 39.88 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో గత మూడేళ్లలో కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుని ఉంటే ప్రతి ఇంటికీ కుళాయి నీరు ఇప్పటికే అందేది. ఇప్పుడు ఆ పనులు పూర్తి చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు కదలడం లేదు. ’


ఉత్తర్వుల హడావుడే.. అమలేదీ?..

ప్రభుత్వం రోజుకో ఉత్తర్వులు విడుదల చేయడంలో చూపించిన శ్రద్ధ, అమలు చేయడంలో చూపడం లేదని పలువురు  విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో నారా లోకేశ్‌ పంచాయతీరాజ్‌ మంత్రిగా ఉన్నప్పుడు ఇంటింటికీ కుళాయి పథకాన్ని తెచ్చి అన్ని గ్రామాల్లో పనులు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సుమారు రూ.9 వేల కోట్ల మేర పనులు మంజూరయ్యాయి. అయితే వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత ఆ పనులన్నీ రద్దు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16న రూ.17,989 కోట్లతో 56,448 పనులు మంజూరుచేస్తూ జీవోఆర్టీ నెం.56 విడుదల చేసింది. ఈ పనుల్లో పలు రకాల ప్రాజెక్టులను చూపించింది. జగనన్న హౌసింగ్‌ కాలనీల్లోనే రూ.3,250 కోట్లతో 15,484 పనులు మంజూరుచేసింది. గతంలో మంజూరైన పనులకు సంబంధించి రూ.3,090 కోట్ల మేర 28,426 పనులను మళ్లీ మంజూరుచేసింది. ఉద్దానం, పులివెందుల, డోన్‌ తదితర నియోజకవర్గాలకు ప్రత్యేకంగా రూ.1,477 కోట్లు, కొత్త వాటర్‌స్కీంలకు రూ.2 వేల కోట్లు, పాత ఉభయగోదావరి, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలకు తాగునీటి కోసం రూ.8,690 కోట్లు మంజూరుచేస్తూ ఒకే ఉత్తర్వును విడుదల చేసింది.


ఇంత భారీ మొత్తంలో మంజూరు చేసినా ఈ పనులు పూర్తి చేస్తారన్న నమ్మకం ఎవ్వరికీ కలగడం లేదు. ఈ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడమే తప్ప అమలుకు నోచుకున్నవి తక్కువేనంటున్నారు. కేంద్రం నిధులిచ్చినప్పుడే  వాటిని ఇతర అవసరాలకు వినియోగించి, తాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోని సర్కార్‌ ఇప్పుడు ఉత్తర్వులతో హడావుడి చేస్తోందని అంటున్నారు. ఇవన్నీ ఆదేశాలే గానీ, అమలు జరగడం లేదంటున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.