గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కొళాయి

ABN , First Publish Date - 2022-06-29T05:58:24+05:30 IST

గ్రామాల్లో జవాబుదారీతనం, పారదర్శకత గల నీటి వ్యవస్థను రూపొందించడం, ప్రతి ఇంటికీ కొళాయిద్వారా నీటిని సరఫరా చేయడం జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్యమని జల్‌ జీవన్‌మిషన్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌సింగ్‌ పేర్కొన్నారు. మంగళవారం రుషికొండ సాయిప్రియారిసార్ట్స్‌లో జరిగిన జల్‌జీవన్‌ మిషన్‌ పథకం అమలుపై జోనల్‌ స్థాయి శిక్షణలో ఆయన మాట్లాడారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కొళాయి
కార్యక్రమంలో మాట్లాడుతున్న జల్‌జీవన్‌ మిషన్‌ డెరెక్టర్‌ ప్రదీప్‌సింగ్‌

జల్‌జీవన్‌ మిషన్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌సింగ్‌

సాగర్‌నగర్‌, జూన్‌ 28: గ్రామాల్లో జవాబుదారీతనం, పారదర్శకత గల నీటి వ్యవస్థను రూపొందించడం, ప్రతి ఇంటికీ కొళాయిద్వారా నీటిని సరఫరా చేయడం  జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్యమని జల్‌ జీవన్‌మిషన్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌సింగ్‌ పేర్కొన్నారు. మంగళవారం రుషికొండ సాయిప్రియారిసార్ట్స్‌లో జరిగిన జల్‌జీవన్‌ మిషన్‌ పథకం అమలుపై జోనల్‌ స్థాయి శిక్షణలో ఆయన మాట్లాడారు. దేశంలో 19.23 కోట్ల గృహాలున్నాయని, వీటిలో మార్చి చివరకు 50 శాతం మందికి లబ్ధి చేకూరిందన్నారు. గోవా, హర్యానాలో వందశాతం అమలు జరిగిందని, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌లో 90శాతం పనులు జరిగాయన్నారు. 108 జిల్లాల్లో వందశాతం పనులు పూర్తయ్యాయన్నారు. స్థానిక సంస్థల భాగస్వామ్యంతోనే కార్యక్రమం అమలు సాధ్యమన్నారు. రానున్న 40 ఏళ్లకు అవసరమయ్యే ప్రణాళికతో పథకం రూపొందించామన్నారు. ఏపీలో 99 శాతం గ్రామాలలో దీనిని ప్రారంభించామని, కొత్త కనెక్షన్ల మంజూరు, శుద్ధి కేంద్రాల నిర్వహణ, నీటి పరిమాణం పెంచేందుకు పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కొళాయిల ద్వారా సురక్షితమైన నీటిని సరఫరా చేస్తామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున మాట్లాడుతూ 2024 నాటికి గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో జిల్లాలో అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల్లో 59,338 కనెక్షన్స్‌కు గాను 22,887 పూర్తిచేశామని, మిగిలినవి ఈ ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తెస్తామన్నారు. నీటి సరఫరాలో వృథా తలెత్తకుండా ఆటోమేషన్‌ విధానం అమలుకు కృషిచేస్తున్నామని తెలిపారు. పథకం అమలు, సాధించిన ప్రగతిని పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ ఆర్‌వీకృష్ణారెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌ చీఫ్‌ ఇంజనీర్‌ గాయత్రీదేవి, జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురం జిల్లాల ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈలు, డీఈలు, జేఈలు, జోనల్‌స్థాయి అధికారులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-06-29T05:58:24+05:30 IST