కలుపుకొని వెళ్లండి.!

ABN , First Publish Date - 2021-10-20T17:56:47+05:30 IST

‘ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు తండ్రి లాంటి వాళ్లు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలి. డివిజన్లలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కీలకం’ అని టీఆర్‌ఎస్‌

కలుపుకొని వెళ్లండి.!

పార్టీ నేతలకు కేటీఆర్‌ సూచన 

ఎమ్మెల్యేలు తండ్రి లాంటి వాళ్లు

అందరినీ సమన్వయం చేసుకోవాలి

విజయగర్జన సభ సక్సెస్‌ చేయాలి

27న నియోజకవర్గాల వారీ సమావేశాలు


హైదరాబాద్‌ సిటీ: ‘ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు తండ్రి లాంటి వాళ్లు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలి. డివిజన్లలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కీలకం’ అని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు హితవు పలికారు. బస్తీ, కాలనీ కమిటీలు పూర్తయ్యాయా అని అడిగిన ఆయన.. అందరూ చర్చించి కమిటీలు వేశారా, ఇళ్లలో కూర్చొని పేర్లు రాశారా అని సరదాగా వ్యాఖ్యానించారు. పలువురు మాజీ కార్పొరేటర్లు హాజరుకాకపోవడంపై ఆరా తీసిన కేటీఆర్‌.. ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలను అడిగారు. ఈ క్రమంలో ఓ మాజీ కార్పొరేటర్‌ తమకు ఆలస్యంగా సమాచారమిచ్చారని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ‘ఇక ముందు అలా జరగకుండా చూసుకోండి. అందరినీ కలుపుకొని వెళ్లాలి.’ అని కేటీఆర్‌ ఎమ్మెల్యేలకు సూచించినట్టు తెలిసింది. మంగళవారం తెలంగాణ భవన్‌లో నగరంలోని పలు నియోజవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ నెల 25న జరగనున్న ప్లీనరీ, వచ్చే నెల 15న వరంగల్‌లో జరిగే తెలంగాణ విజయ గర్జన సభను సక్సెస్‌ చేయడానికి మార్గనిర్దేశనం చేశారు. ప్లీనరీకి పరిమిత సంఖ్యలో ప్రతినిధులకు అనుమతి ఉంటుందని, అక్కడ చర్చించే అంశాలపై 27న నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టి వివరించాలని చెప్పారు. విజయగర్జన సభ జన సమీకరణపై కూడా చర్చించాలన్నారు. ఆ సభకు అందరూ కలిసి ఒక్కో డివిజన్‌ నుంచి ఐదు నుంచి పది బస్సుల్లో ప్రజలను సభకు తీసుకురావాలన్నారు. బలమైన ప్రాంతీయ పార్టీల్లో టీఆర్‌ఎస్‌ ముందు వరుసలో ఉందని, రోజు రోజుకు పార్టీ పట్ల జనాదరణ పెరుగుతోందని చెప్పారు. 




వివాదాల నేపథ్యంలో..

సంస్థాగత కమిటీల ఎంపిక, పలు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ల మధ్య వివాదాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ వద్ద జరిగిన సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. పలు అసెంబ్లీల పరిధిలో పోటీగా కమిటీల ప్రకటన, ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన కమిటీలపై కొందరు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు.. అగ్రనేతలకూ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్‌ మీటింగ్‌లో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి పార్టీ శ్రేణుల్లో వ్యక్తమైంది. తాజా సమావేశంలోనూ ఎమ్మెల్యేల తీరుపై తమకున్న అసంతృప్తిని కొందరు వ్యక్తపరిచినట్టు తెలిసింది. అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ కార్పొరేటర్‌ మీటింగ్‌కు రాకపోవడంపై ఆరా తీసిన కేటీఆర్‌.. ఎందుకు రాలేదు, తర్వాతి సమావేశాలకు వచ్చేలా చూడాలని ఎమ్మెల్యేలకు సూచించినట్టు సమాచారం. నగర కమిటీ ఎంపికపైనా పరోక్షంగా కార్యనిర్వాహక అధ్యక్షుడు సంకేతాలిచ్చినట్టు తెలిసింది. ప్లీనరీ లేదా విజయగర్జన సభ ముగిసిన అనంతరం సిటీ కమిటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారని ఓ నాయకుడు తెలిపారు. 

Updated Date - 2021-10-20T17:56:47+05:30 IST