టార్గెట్‌- 2024

ABN , First Publish Date - 2022-05-19T05:19:54+05:30 IST

ఉమ్మడి జిల్లాలో ఆనాటి ప్రాభవాన్ని తీసుకురావాలి..

టార్గెట్‌- 2024

  1. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సై
  2. టీడీపీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్న అధినేత
  3. నేడు ఉమ్మడి జిల్లాల ఇనచార్జిలు, కార్యకర్తలతో భేటీ
  4. దిశా నిర్దేశం చేయనున్న చంద్రబాబు 
  5. సాయంత్రం జలదుర్గంలో ‘బాదుడే బాదుడు’
  6.   జగన పాలనను ఎండగట్టనున్న బాబు

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): 

 ఉమ్మడి జిల్లాలో ఆనాటి ప్రాభవాన్ని తీసుకురావాలి..  గత ఎన్నికలలో ఘోర పరాజయంతో నిస్తేజంగా ఉన్న శ్రేణుల్లో పునరుత్తేజం నింపాలి.. 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం చేయాలి.. మూడేళ్ల వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసికెళ్లడానికి మార్గనిర్దేశం చేయాలి...ఇదీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలులో మళ్లీ పచ్చ జెండా ఎగురవేయడానికి అవసరమైన ఉత్సాహాన్ని శ్రేణుల్లో నింపనున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ...

ఒక్క చాన్స పేరుతో అధికారం చేపట్టిన సీఎం జగన ఉమ్మడి జిల్లా అభివృద్ధికి చేసింది శూన్యం. ఏదో చేస్తారని ఆశించిన ప్రజలకు మూడేళ్లలోపే ఆ భ్రమలు తొలగిపోయాయి. నవరత్నాల ముసుగులో జనంపై పన్నులతో బాదేస్తున్నారు. ఓ వైపు సంక్షేమ ఫలాలు అంటూ.. మరో వైపు నిత్యావసర సరుకులు, పెట్రో, గ్యాస్‌ ధరలు పెంచేశారు. ఆర్టీసీ, విద్యుత చార్జీల భారంతో ప్రజల నడ్డివిరిచారు. సిమెంట్‌, స్టీల్‌, ఇసుక ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో నిర్మాణ రంగం కుదేలైంది. నిరుద్యోగులే కాదు,,, ఉద్యోగులు సైతం ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా ముంగిట ప్రగతి పరుగులు పెడితే.. వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ప్రగతి పట్టాలు తప్పిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం జగన వైఫల్యాలను అధినేత చంద్రబాబు ఎండగడుతున్నారు. ఇందులో భాగంగా గురువారం ప్యాపిలి మండలం జలదుర్గంలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఉదయం కర్నూలులో సమన్వయ కమిటీ, నియోజకవర్గాల ఇనచార్జిలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. 2024 ఎన్నికలే టార్గెట్‌గా వ్యూహ రచన చేయనున్నారు. కందెనవోలు కోటపై మళ్లీ పసుపు జెండా ఎగురవేసేందుకు దిశానిర్దేశం చేయడంతోపాటు టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపనున్నారు. 

ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీకి ఒక్కప్పుడు మంచి పట్టు ఉండేది. అలాంటింది 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. కర్నూలు, నంద్యాల లోక్‌సభ స్థానాలు సహా 14 అసెంబ్లీ స్థానాల్లోనూ ఓడిపోయింది. ఏదో చేస్తారని ప్రజలు వైసీపీకి విజయాన్ని అందిస్తే... అదంతా ఒట్టి భ్రమేనని తెలిసిపోయింది. మూడేళ్లలో ఎక్కడ చూసినా వైసీపీ నాయకుల దాడులు... ప్రశ్నించిన వారిపూఐ అక్రమ కేసులు తప్ప ప్రగతి శూన్యం. దీంతో ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలపై పోరుకు టీడీపీ సై అంది. అందులో భాగంగానే అధినేత చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంక్షేమం ముసుగున వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గ పాలనపై యుద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న తెలుగు తమ్ముళ్లలో అధినేత రాకతో ఒక్కసారి జోష్‌ పెరిగింది.

  టీడీపీ ప్రభుత్వంలో ప్రగతి పరుగులు 

 ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత టీడీపీ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జెట్‌ స్పీడ్‌తో ముందుకు సాగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరువుకు శాశ్వత పరిష్కారం దిశగా సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసి కడప జిల్లాకు కృష్ణా వరద జలాలు అందించిన ఘనత  చంద్రబాబుదే. ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు, 2.50 లక్షల జనాభాకు తాగునీరు అందించేందుకు దాదాపు రూ.4 వేల కోట్లతో వేదవతి, ఆర్డీఎస్‌ కుడికాలువ పనులు చేపట్టారు. అసంపూర్తిగా ఉన్న గాలేరు-నగరి కాలువ, అవుకు టన్నెల్‌, ముచ్చుమర్రి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేశారు. నంద్యాలలో రోడ్ల విస్తరణ, కర్నూలు నగర సుందరీకరణ, రూ.1,350 కోట్లతో హంద్రీ నీవా విస్తరణ పనులు చేపట్టారు. ఓర్వకల్లు వద్ద 33 వేల ఎకరాల్లో పారిశ్రామిక హబ్‌ ఏర్పాటు చేసి పరిశ్రమలు, మెగా సోలార్‌ ప్లాంట్లు తీసుకొచ్చారు. మంగళవారం సీఎం జగన కాంక్రీట్‌ పనులు ప్రారంభించిన రూ.33 వేల కోట్లతో చేపట్టిన 5,230 మెగావాట్స్‌ ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు కూడా చంద్రబాబు హయాంలోనే ఊపిరి పోసుకుంది. కొమిలిగుండ్లను సిమెంట్‌ హబ్‌గా ఏర్పాటు చేసి సిమెంట్‌ పరిశ్రమలు తీసుకొచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ హయాంలో జరిగిన ప్రగతి ఎంతో ఉంది. ఈ మూడేళ్ల వైసీపీ పాలనలో చెప్పుకోవడానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. జగనన్న కాలనీల పేరుతో చేపట్టిన పేదల ఇళ్లు పునాదుల్లోనే వెక్కిరిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తూ.. సీఎం జగన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. మరో పక్క టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ అధినేత పర్యటన సాగనుంది. 

  బాదుడే బాదుడుకు స్పందన.. గడప గడపలో నిరసన: 

సంక్షేమ పథకాల పేరుతో అప్పులు చేసి ప్రభుత్వం ఉచితాల పంపిణీ చేపట్టింది. మూడేళ్లకే కోతలు పెట్టింది. 11 నిబంధనలతో పింఛన, అమ్మఒడి, ఆసరా వంటి పథకాల లబ్ధిదారులకు కోత పెట్టారు. అర్హతలు ఉండి సచివాయాలలో దరఖాస్తు చేసిన నెలలోపే పథకాలు ఇంటికి వస్తాయని వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పింది. ఏళ్లు గడిచినా కనీసం పింఛన అందని దైన్యం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా టీడీపీ అధిష్టానం ఆదేశాలతో నియోజకవర్గ ఇనచార్జిలు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. ఏ గ్రామానికి వెళ్లినా టీడీపీ నేతలను జనం ఆదరిస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించిన సీఎం జగన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలనే నేరుగా ఇంటింటికి పంపారు. ఏ గ్రామానికి వెళ్లినా ఎమ్మెల్యేలకు నిరసన సెగ తప్పడం లేదు. సంక్షేమ పథకాలు అందడం లేదని, కొర్రీలు పెట్టి తొలగించారని, సీసీ రోడ్లు, మరుగుదొడ్లు లేవని, తాగునీరు ఇవ్వడం లేదంటూ వివిధ సమస్యలపై నిలదీస్తుంటే ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

  వర్గ విభేదాలపై అధినేత దృష్టి పెట్టాలి: 

జగన ప్రభుత్వ వైఫల్యాలపై అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి ఉందనడంలో ఎలాంటి అనుమానం లేదు. దీన్ని ఓట్లుగా మలచుకొని... రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పక్కా ప్రణాళిక, వ్యూహాత్మంగా ముందుకు వెళ్తున్నారు. అధినేత వేగాన్ని టీడీపీ శ్రేణులు అందుకోలేకపోతున్నారు. ఇప్పటి నుంచి రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసినా చివర్లో తమకే టికెట్‌ వస్తుందా..? చివరి క్షణంలో సామాజిక, రాజకీయ సమీకరణాలు అంటూ వేరొకరికి టికెట్‌ ఇస్తే తమ పరిస్థితి ఏమిటి అన్న ఆందోళన మెజార్టీ టీడీపీ ఇనచార్జిల్లో ఉంది. దీంతో అధిష్టానం పిలుపునిచ్చే కార్యక్రమాలు తూతూ మంత్రంగా చేస్తున్నారు. మిగతా సమయంలో జనం మధ్యకే వెళ్లడం లేదని సమాచారం. మరోవైపు వర్గ విభేదాలు పార్టీకి చేటుగా మారుతున్నాయి. కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, నంద్యాల, డోన, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు టీడీపీని వెంటాడుతున్నాయి. విభేదాలే రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని పార్టీ నాయకులే అంటున్నారు. వీటిపై అధినేత చంద్రబాబు దృష్టి సారించాలి. నాయకులను సమన్వయం చేసి ఏకతాటిపై నడిపించాలి. కార్యక్రమాలను ఇనచార్జి సారథ్యంలో సమష్టిగా నిర్వహించేలా దిశానిర్దేశం చేయాలి. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతోపాటు రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారు. 


 నేత వస్తున్నాడు.. తరలి రండి

  1.   సోమిశేట్టి, గౌరు పిలుపు 
  2.   చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నేతలు

కర్నూలు(అగ్రికల్చర్‌), మే 18: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో నగరంలో తలపెట్టిన ర్యాలీ, డోన నియోజక వర్గం జలదుర్గం గ్రామంలో బాదుడే బాదుడు కార్యాక్రమాలను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లాల టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.  పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగే నందికొట్కూరు రోడ్డులోని కమ్మ సంఘం కమ్యూనిటి హాలులో ఏర్పాట్లను బుధవారం వారు పరిశీలించారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఇనచార్జిలు, ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ  సమావేశంలో వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి  తీసుకుపోవడంపై  చంద్రబాబునాయుడు దిశా నిర్దేశం చేస్తారని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో  పాణ్యం నియోజకవర్గం ఇనచార్జి  గౌరు చరిత, రాష్ట్ర కార్యదర్శులు నాగేంద్రకుమార్‌, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన తదితరులు పాల్గొన్నారు.

  సర్వం సిద్ధం

  1. నేడు చంద్రబాబు పర్యటనకు భారీ ఏర్పాట్లు
  2. డోనలో రోడ్‌ షో
  3. జలదుర్గంలో బాదుడే బాదుడు 

 డోన, మే 18:  డోన నియోజకవర్గంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు సర్వం సిద్ధమైంది. చంద్రబాబు వస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన కర్నూలు నుంచి బయలుదేరి డోన పట్టణానికి సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. పట్టణంలో రోడ్‌షో నిర్వహిస్తారు. కోట్లవారిపల్లి, చింతలపేట, గోసానిపల్లి, కొచ్చెర్వు, చిగురుమానుమిట్ట, గోపాలనగరం మీదుగా జలదుర్గం గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి మహిళలతో మాట్లాడనున్నారు. అనంతరం ప్రజా వేదికకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 

 ఏర్పాట్లు ఇలా: 

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు డోన పట్టణంలో, జలదుర్గం గ్రామంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ రెండు చోట్ల టీడీపీ డోన ఇనచార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర గొర్రెల పెంపకందారుల ఫెడరేషన చైర్మన వై.నాగేశ్వరరావు యాదవ్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, నారా లోకేష్‌ పీఏ శ్రీనివాసులు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన మురళీకృష్ణగౌడు, మాజీ ఎంపీపీ ఆర్‌ఈ రాఘవేంద్ర, మన్నెగౌతమ్‌ రెడ్డి, భరత రెడ్డి, విజయభట్టు, సీ.ఎం.శ్రీనివాసులు, గంధం శ్రీనివాసులు, ప్రజావైద్యశాల మల్లికార్జున, రేగటి అర్జున రెడ్డి, శ్రీనివాసులు యాదవ్‌, అభిరెడ్డిపల్లె గోవిందు, గండికోట రామసుబ్బయ్య, కుమ్మరి సుధాకర్‌ తదితరుల పర్యవేక్షణలో డోనలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రహదారి వెంట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ పసుపుమయం చేశారు. చంద్రబాబు, నారా లోకేష్‌, దేవాన్షలతో ఏర్పాటు చేసిన కటౌట్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చంద్రబాబు ప్రసంగాన్ని వీక్షించేందుకు సభా ప్రాంగణంలో ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నారు.  

Updated Date - 2022-05-19T05:19:54+05:30 IST