Target 31st.. మహిళతో యాప్‌లో ఫ్రెండ్స్ షిప్.. పబ్‌లో మీటింగ్.. ఇలా సీన్ మొత్తం రివర్స్...!

ABN , First Publish Date - 2021-12-16T17:05:59+05:30 IST

Target 31st.. మహిళతో యాప్‌లో ఫ్రెండ్స్ షిప్.. పబ్‌లో మీటింగ్.. ఇలా సీన్ మొత్తం రివర్స్...!

Target 31st.. మహిళతో యాప్‌లో ఫ్రెండ్స్ షిప్.. పబ్‌లో మీటింగ్.. ఇలా సీన్ మొత్తం రివర్స్...!

  •  భారీ స్థాయిలో డ్రగ్స్‌ సరఫరాకు సన్నాహాలు
  • రెండు గ్యాంగుల ఆటకట్టు 
  • రూ. 25 లక్షలు విలువ చేసే హ్యాష్‌ ఆయిల్‌ స్వాధీనం

మెహిదీపట్నం.. హుమాయన్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ జమీర్‌ సిద్దిఖీ, హఫీజ్‌పేట గోపాల్‌ నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని పులి రమ్య, అల్మా్‌స్‌గూడకు చెందిన కౌకుంట్ల అఖిల్‌ ఓ యాప్‌లో స్నేహితులు. డిసెంబర్‌-31 రాత్రి మత్తుగా నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోవాలని ప్లాన్‌ చేసుకున్నారు. అందుకు డ్రగ్స్‌ను తెచ్చిపెట్టుకోవాలనుకున్నారు. యాప్‌లో డిస్కషన్‌ చేసుకున్న ముగ్గురూ గోవా నుంచి మాదక ద్రవ్యాలను తెప్పించాలని నిర్ణయించుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో కలుసుకుని అవసరమైన డబ్బును సమకూర్చుకున్నారు.


- ఇలా కొందరు న్యూఇయర్‌ వేడుక రోజున మత్తులో మునిగేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. అలాంటి వారే లక్ష్యంగా వ్యాపారులు భారీ స్థాయిలో డ్రగ్స్‌ను దిగుమతి చేస్తున్నారు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌, రాచకొండ పోలీసులు కొన్ని గ్యాంగ్‌లను అదుపులోకి తీసుకుని భారీ ఎత్తున మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా చెలామణి అవుతున్న మహిళా స్మగ్లర్‌ కూడా ఉన్నారు.


హైదరాబాద్‌ సిటీ : కొత్త ఏడాదిని పురస్కరించుకుని మాదకద్రవ్యాల సరఫరాకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో వెస్ట్‌, సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేసి ఓ అంతరాష్ట్ర గ్యాంగ్‌తో పాటు మరో గ్యాంగ్‌ను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 25 లక్షలు విలువ చేసే 3.5 లీటర్ల హ్యాష్‌ ఆయిల్‌, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా, పాయకరావు పేటకు చెందిన సంపతి కిరణ్‌కుమార్‌ (25) అలియాస్‌ జాన్‌ నగరంలోని మణికొండలో నివాసముంటున్నాడు. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పని  చేశాడు.


అదే సమయంలో హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల నుంచి గంజాయి, హ్యాష్‌ ఆయిల్‌ కోసం పలువురు విశాఖకు వస్తున్నారని గమనించాడు. దీంతో విశాఖలో గంజాయి, హ్యాష్‌ ఆయిల్‌ కొనుగోలు చేసి నగరంలో విక్రయించాలని దందా ప్రారంభించాడు. గతేడాది మే నెలలో అతడితో పాటు స్నేహితుడు మోహన్‌ను మాదకద్రవ్యాల కేసులో పిఠాపురం పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆగస్టులో జైలు నుంచి విడుదలైన కిరణ్‌కుమార్‌ హ్యాష్‌ ఆయిల్‌ సరఫరా చేసే వినోద్‌తో స్నేహం పెంచుకున్నాడు. వారం రోజుల క్రితం వినోద్‌ నుంచి 1.5 లీటర్ల హ్యాష్‌ ఆయిల్‌ కొనుగోలు చేసిన కిరణ్‌కుమార్‌ నగరానికి తీసుకొచ్చి గోల్కొండ పీఎస్‌ పరిధిలోని ఓయూ కాలనీలో నిల్వ ఉంచాడు. పక్కా సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్‌  పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వినోద్‌ కోసం గాలిస్తున్నట్లు సీపీ వెల్లడించారు.


మరో గ్యాంగు ఇలా..

దూరపు బంధువులైన మహమ్మద్‌ ఇర్ఫాన్‌ (23), షేక్‌ కమాల్‌ (21) హ్యాష్‌ ఆయిల్‌ను విక్రయించి అధికంగా సంపాదించాలని భావించారు. కొత్త ఏడాది వేడుకల్లో డిమాండ్‌ ఉంటుందని గుర్తించి, వైజాగ్‌కు చెందిన గౌతం వద్ద రెండు లీటర్ల హ్యాష్‌ ఆయిల్‌ కొనుగోలు చేసి తెచ్చారు. మిల్లీలీటర్‌కు రూ. వెయ్యి చొప్పున అమ్మడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. సమాచారం అందుకున్న సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఫలక్‌నుమా పోలీసులతో కలిసి దాడులు చేసి వారిని అరెస్టు చేశారు.



Updated Date - 2021-12-16T17:05:59+05:30 IST