టార్గెట్‌ పాలమూరు

ABN , First Publish Date - 2022-06-30T04:42:36+05:30 IST

తెలంగాణపై కన్నేసిన బీజేపీ పాలమూరులోనూ పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా నిలిచిన పాలమూరులో ప్రాభవం చాటేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది.

టార్గెట్‌ పాలమూరు

జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో సమీక్షలు

అన్ని నియోజకవర్గాల్లో జాతీయ నాయకుల టూర్లు

ప్రతీ విభాగంతో మమేకమయ్యేలా ప్రణాళిక

పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం

అప్రమత్తమైన క్యాడర్‌


తెలంగాణపై కన్నేసిన బీజేపీ పాలమూరులోనూ పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా నిలిచిన పాలమూరులో ప్రాభవం చాటేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని అందుకోసం వినియోగిస్తోంది. తాజాగా జూలై 2, 3, 4 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఇందుకోసం ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి పాలమూరులోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం నుంచి జూలై రెండో తేదీ ఉదయం వరకు పార్టీ మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, జాతీయ పదాధికారులు ఒక్కొక్కరు ఒక్కో నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వారి పర్యటనలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- మహబూబ్‌నగర్‌, ఆంఽధ్రజ్యోతి ప్రతినిధి


 బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెల రెండో తేదీ నుంచి హైదరా బాద్‌లో జరుగనున్న నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ నాయకులు అంతకు ముందు రెండు రోజుల పాటు స్థానిక నియోజ కవర్గాల్లో పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నానికి నియోజకవర్గాలకు చేరుకునే వీరు సాయంత్రం 5:30 నుంచి వరుసగా నియోజకవర్గ స్థాయిలో ఒక్కో మోర్చా విభాగం సభ్యులతో సమీక్షలు నిర్వహిస్తారు. సమీక్షల్లో ఆయా వర్గాలు, బృందాల ద్వారా సంబంధిత నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారంపై ఆరా తీస్తారు. మోర్చాల పని తీరుని అంచనా వేసి, భవిష్యత్‌ కార్యాచరణ ఎలా ఉండాలనే అంశంపై అక్కడికక్కడే మార్గ నిర్దేశనం చేస్తారు. రాత్రికి పార్టీ కార్యకర్త ఇంట్లోనే భోజనం చేసి, నియోజకవర్గంలోనే బస చేస్తారు. శుక్రవారం ఉదయం అల్పాహారం తర్వాత తిరిగి వరుసగా శక్తి కేంద్రాలు, బూత్‌ స్థాయి నాయకులు, గ్రామ, మండల కమిటీలు, ఆయా స్థాయిల్లోని మోర్చాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తారు. పార్టీ పరిస్థితి, ఆయా విభాగాల పని తీరు, మెరుగ వ్వాల్సిన అంశాలపై చర్చించి సూచనలు చేస్తారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్లలో అమ లు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకా లపైనా ఈ బృందాలకు అవగాహన కల్పిం చడంతో పాటు వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపైనా సూచనలు చే స్తారు. మహిళా, యువ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మోర్చాలతో పాటు ఇతర విభా గాలు, గ్రామ, మండల, జిల్లా కమిటీలతోనూ సమావేశమై నివేదికలు రూపొందించుకుంటారు. 30న సాయంత్రం నుంచి జూలై రెండు ఉదయం వరకు పూర్తిగా నియోజకవర్గంలోనే ఉండే ఈ నాయకులు నిర్వహించిన సమీక్షలు, సమావేశాల్లో వచ్చిన అంశాల ఆధారంగా సమగ్ర నివేదికలు రూపొదించుకుంటారు. రెండున ఉదయం నియోజకవర్గంలోని ప్రధాన ఆలయాన్ని సందర్శించి, హైదరాబాద్‌లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు వెళ్తారు. ఈ నివేదికలను అక్కడ పార్టీకి అందజేస్తారు. తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికకు ఈ నివేదికలనే జాతీయ నాయ కత్వం ప్రాతిపదికగా తీసుకునే ఛాన్స్‌ ఉండడంతో నాయకుల పర్యటన స్థానిక కమలం నాయకుల్లో అప్రమత్తతను పెంచింది.


పాలమూరును చుట్టేయనున్న కమల దళం

పాలమూరులోని నియోజకవర్గాల్లో రెండు రోజుల పర్యటనకు బీజేపీ మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రు లు, పార్టీ జాతీయ నాయకత్వ బాధ్యులను ఎంపిక చేయడం ఈ ప్రాంతంపై పార్టీ పె ట్టుకున్న ఆశలకు నిదర్శనంగా చెప్పొచ్చు. జడ్చర్ల నియోజకవర్గానికి గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపాని, మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం తీర్థసిన్హా రావత్‌, దేవర కద్రకు కర్ణాటక మాజీ సీఎం జగదీష్‌ షెట్టార్‌ రానున్నారు. మహబూబ్‌నగర్‌కు వస్తోన్న ఉత్తరాఖండ్‌ సీఎంకు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసంలో రాత్రి బసకు ఏర్పాట్లు చేశారు. నారాయణపేటకు గోవా ఎమ్మెల్యే అజిత్‌వాడేకర్‌, మక్తల్‌కు కర్ణాటక మాజీ సీఎం సదానందగౌడ్‌ వస్తున్నారు. వనపర్తి నియోజకవర్గానికి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కోశాధికారి రాజేశ్‌ అగర్వాల్‌, అలంపూర్‌కు బీహార్‌కు చెందిన జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రేమ్‌కుమార్‌, గద్వాలకు జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఆశీష్‌ సూద్‌ వస్తున్నారు. నాగర్‌కర్నూల్‌కు గుజరాత్‌ మాజీ డిప్యూటీ సీఎం నీతూభాయిపటేల్‌, కొల్లాపూర్‌కు కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ పొన్‌ రాధాకృష్ణన్‌, కల్వకుర్తికి ఒడిష్శా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీర్‌మహంతి, అచ్చంపేటకు జమ్మూ కశ్మీర్‌ మాజీ డిప్యూటీ సీఎం నిర్మల్‌సింగ్‌ వస్తున్నారు. వీరంతా గురువారం మధ్యాహ్నానికే ఆయా నియోజకవర్గాలకు చేరుకోనుండడంతో స్థానిక నాయకులు వారిని స్వాగతిం చేందుకు, కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


25 వేల మంది సమీకరణ

 మహబూబ్‌నగర్‌కు రానున్న ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం తీర్థసిన్హా రావత్‌కు చిన్నదర్పల్లికి చెందిన పార్టీ కార్యకర్త కిష్ట్యానాయక్‌ ఇంట్లో రాత్రి విందు ఇవ్వ నున్నాం. 30న ఉదయం 12 గంటలకు పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలోనూ ముగ్గురు మాజీ సీఎంలు పాల్గొని, ఆతర్వాత నియోజకవర్గాల సమీక్షలకు వెళ్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత వరుసగా పార్టీ విభాగాలతో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తారు. 30న రాత్రి నియోజకవర్గాల్లోనే బస చేస్తారు. ఒకటవ తేదీ కూడా అన్ని సమీక్షలు నిర్వహించి, నివేదిక రూపొందిస్తారు. రెండో తేదీ స్థానిక ఆలయాల్లో పూజలు జరిపి వెళతారు. మూడున జరిగే బహిరంగ సభకు జిల్లా నుంచి 25 వేల మందిని సమీకరించాలని నిర్ణయించాం. సభకు వెళ్లేందుకు రైళ్లు, బస్సులు మాట్లాడాం. స్థానికంగా కార్లు కూడా తీసుకుం టున్నాం. ప్రధాని మోదీ సభను విజయవంతం చేయడం ద్వారా తెలంగాణలో బీజేపీ సత్తా చాటాలని నిర్ణయించి, పని చేస్తున్నాం. 

- వీరబ్రహ్మచారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

Updated Date - 2022-06-30T04:42:36+05:30 IST