ఏది ఉపాధి చూపిస్తే ఆ పనికి వెళ్తాడు.. ఒంటరిగా ఉన్న మహిళ కనిపించగానే..

ABN , First Publish Date - 2021-09-05T06:24:14+05:30 IST

ఏది ఉపాధి చూపిస్తే ఆ పనికి వెళ్తాడు.. ఒంటరిగా ఉన్న మహిళ కనిపించగానే..

ఏది ఉపాధి చూపిస్తే ఆ పనికి వెళ్తాడు.. ఒంటరిగా ఉన్న మహిళ కనిపించగానే..
మాట్లాడుతున్న సీపీ శ్రీనివాసులు

ఒంటరి మహిళలే టార్గెట్‌

నగరంలో మూడు హత్యల నిందితుడి అరెస్టు

ఆభరణాలు కాజేసి హత్య


విజయవాడ, ఆంధ్రజ్యోతి: ఒక పని కాదు. ఏది ఉపాధి చూపిస్తే ఆ పనికి వెళ్తాడు. అలాగని ఒకే పనిలో ఉండడు. తాపీ పని, పెయింటింగ్‌, ఇంటీరియర్‌ డెకరేషన్‌ ఇలా మారుతూనే ఉంటాడు. ఇలా పనులకు వెళ్లిన చోట ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తిస్తాడు. వారితో పరిచయాలు పెంచుకుంటాడు. తర్వాత వారి మెడలో ఉన్న ఆభరణాలపై కన్నేస్తాడు. అదును చూసుకుని అంతం చేసి ఆభరణాలు కాజేస్తాడు. ఆభరణాల కోసం ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని నేరాలు చేస్తున్న ప్రధాన నిందితుడితో పాటు మరో నిందితుడ్ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆ వివరాలను సీపీ బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు. 


జల్సాలకు అలవాటు పడి నేరాలు

ఖమ్మం జిల్లా మధిరకు చెందిన పల్లె రాము అలియాస్‌ రహీమ్‌ అలియాస్‌ రామాచారి ఉపాధి నిమిత్తం కొన్నాళ్ల క్రితం విజయవాడకు వచ్చి వాంబేకాలనీలో స్థిరపడ్డాడు. తర్వాత మళ్లీ సొంత ప్రాంతానికి వెళ్లిపోయాడు. అనంతరం తిరిగి వచ్చి ఓ ముస్లిం యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. రైలు ప్రమాదంలో ఒక కాలు కోల్పోవడంతో జైపూర్‌ ఫుట్‌ అమర్చుకుని పనులకు వెళ్లడం మొదలుపెట్టాడు. అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఇళ్లు మారుతుండేవాడు. జల్సాలకు అలవాటు పడిన రాము డబ్బు కోసం నేరాల బాట పడ్డాడు. కేదారేశ్వరపేటకు చెందిన ముడోలి నాగరాజుతో పరిచయం పెంచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు మూడు నేరాలు చేశాడు.


ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను కాజేసేవాడు. పాయకాపురం, కుందావారి కండ్రిక ప్రాంతాల్లో చేసిన నేరాల్లో ఇద్దరు వృద్ధురాళ్లను హత్య చేశాడు. అజిత్‌సింగ్‌నగర్‌ డాబాకొట్ల వద్ద చేసిన చోరీలో నాగరాజు సహాయం తీసుకున్నాడు. కుందావారి కండ్రికలో మున్నంగి సుబ్బమ్మ (70) హత్య, ఆభరణాల చోరీ కేసులో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా, బజాజ్‌ సీటీ 100 మోటారు సైకిల్‌పై రాము అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. గడిచిన నెల 26వ తేదీన సుబ్బమ్మ ఇంటికి వెళ్లేటప్పుడు తెల్లచొక్కా ధరించాడు. పని పూర్తయ్యాక నలుపు రంగు చొక్కా ధరించాడు. ఆ దుస్తుల్లో ఉండగానే ఇబ్రహీపట్నంలోని బంకులో పెట్రోలు కొట్టించాడు. ఈ దృశ్యాల ఆధారంగా రామును అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాలు బయటపడ్డాయి. రాము, నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. 


Updated Date - 2021-09-05T06:24:14+05:30 IST