టార్గెట్‌ టీడీపీ!

ABN , First Publish Date - 2020-12-27T09:56:21+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి భారతీయ జనతాపార్టీ స్కెచ్‌ వేసుకుందా? ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని...

టార్గెట్‌ టీడీపీ!

నిజానికి రాజకీయ పార్టీల బలాబలాలు తెలియడానికి ఉపఎన్నికలు ప్రామాణికాలు కావు. గతంలో నంద్యాల అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ దాదాపు 30 వేల మెజార్టీతో గెలిచింది. సాధారణ ఎన్నికల్లో అదే స్థానాన్ని 30 వేలకు పైగా మార్జిన్‌తో కోల్పోయింది. అధికారంలో ఉన్న పార్టీకి ఉపఎన్నికలో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. తిరుపతిలో కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న సందర్భాల్లోనే ఉపఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోతూ ఉంటుంది. తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉపఎన్నిక ఇందుకు ఉదాహరణ. సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న వాళ్లు తమతోనే ఉంటారు గనుక తిరుపతిలో తమ గెలుపు నల్లేరుపై నడక వంటిందని వైసీపీ ముఖ్యుడొకరు విశ్లేషించారు. మొత్తంగా చూస్తే నూతన సంవత్సరంలో జరిగే తిరుపతి ఉపఎన్నిక ఫలితం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ ముఖచిత్రంపై స్పష్టత వస్తుంది.



‘ఏ పార్టీకైనా ఆర్థిక సహాయం చేయగలిగిన స్థాయి ఉన్నవారిలో అత్యధికులు హైదరాబాద్‌లోనే ఉన్నారు. కేసీఆర్‌ తలచుకుంటే హైదరాబాద్‌ నుంచి ఏ పార్టీ కూడా ఆర్థికసాయం పొందలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి జగన్‌ చెప్పుచేతల్లో ఉంది. కేంద్రంలో మేము ఉన్నాం. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒంటరి కాకుండా ఎలా తప్పించుకోగలరు? తిరుపతిలో తెలుగుదేశం పార్టీని అడుగడుగునా అడ్డుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం మాకు అండగా ఉంటాయి. ఇన్ని బలమైన శక్తులను ఎదుర్కొని చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగలరా?’ అని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. తాము అనుకున్నది అన్నుకున్నట్టు జరిగితే తెలుగుదేశం పార్టీ ఓటుబ్యాంకు తమవైపు మళ్లుతుందని భావిస్తున్నామని వారు చెబుతున్నారు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయగలిగితే ఆ తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ పార్టీలో చేరిపోతారని, అదే జరిగితే తాము ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడం అసాధ్యం కాదని కమలనాథులు చెబుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి భారతీయ జనతాపార్టీ స్కెచ్‌ వేసుకుందా? ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని పక్కకు నెట్టి, ఆ స్థానంలోకి తాము రావాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారా? ఇందుకోసం అధికార పార్టీ సహకారం తీసుకోవడానికి భాజాపా తెర వెనుక మంత్రాంగం నడిపించిందా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తున్నది. రాష్ట్రంలో బలంగా ఉన్న రెండు ప్రాంతీయపార్టీల బలహీనతలను ఆసరాగా చేసుకుని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి కమలనాథులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం తిరుపతి లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నికను వేదికగా మార్చుకోబోతున్నారని చెబుతున్నారు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీని తృతీయస్థానంలోకి నెట్టడానికై రూపొందించిన వ్యూహంలో భాగంగా అధికార వైసీపీ సహకారం తీసుకోబోతున్నామని బీజేపీ ముఖ్యుడొకరు చెప్పుకొచ్చారు. ఇది సాధ్యమా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. తెలంగాణలో ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను తృతీయస్థానంలోకి నెట్టి అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని రుజువు చేసుకున్న తమకు, ఏపీలో కూడా ప్రత్యామ్నాయంగా ఎదగడం అసాధ్యం కాదని ఆ ముఖ్యనేత వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రిని కలిసినప్పుడు తిరుపతి ఉప ఎన్నిక విషయం కూడా ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే క్రమంలో తన సహకారం ఉంటుందని జగన్‌ రెడ్డి హామీ ఇచ్చినట్టు కూడా కమలనాథులు చెబుతున్నారు.


నిజానికి రాష్ట్రంలో బీజేపీ బలం నామమాత్రమే. తిరుపతిలో కూడా ఆ పార్టీతో పోల్చితే దాని మిత్రపక్షమైన జనసేన అంతో ఇంతో బలంగా ఉంది. ఈ కారణంగా తిరుపతి నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ బీజేపీ పెద్దల వద్ద ప్రతిపాదించారు. అయితే, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి వ్యూహరచన చేసుకున్న కమలనాథులు పవన్‌ కల్యాణ్‌ ప్రతిపాదనను పక్కనపెట్టి, తిరుపతిలో తామే పోటీ చేయడానికి దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన ముఖ్యులు కొన్ని వారాలుగా తిరుపతిలో మకాం వేసి పార్టీని బలోపేతం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విషయంలో పవన్‌ కల్యాణ్‌ ఎలా స్పందిస్తారో తెలియదు కానీ, తిరుపతిలో బీజేపీ పోటీ చేయడం దాదాపుగా ఖాయమైంది. ఉపఎన్నికలో బీజేపీకి ఆర్థిక సహాయం చేయడానికి కూడా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి అంగీకరించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఉన్నపళంగా తృతీయస్థానంలోకి నెట్టడం ఆషామాషీ కాదు. బీజేపీ నుంచి కవ్వింపులు వస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన వ్యూహంలో భాగంగా మౌనంగా ఉంటున్నారు. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవడానికై రూపొందించుకున్న వ్యూహాన్ని తిరుపతిలో అమలు చేయబోతున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ బలపడటానికి పరోక్షంగా సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నారని అంటున్నారు. అలాంటప్పుడు ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ‌రెడ్డి మాత్రం బీజేపీని ఎందుకు పెంచిపోషిస్తున్నారన్న సందేహం రావడం సహజం. దీనికి కూడా బీజేపీ నాయకుల వద్ద సమాధానం ఉంది. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి పొడ గిట్టదు. తాను జైలుకు వెళ్లడానికి చంద్రబాబే ప్రధాన కారణమని జగన్‌ బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంగా చంద్రబాబుపై పట్టలేనంత కోపం ఉంది. చంద్రబాబు రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని పట్టుదలగా ఉన్నారు.


ఈ నేపథ్యంలో బీజేపీకి పరోక్షంగా సహకరించడానికి సిద్ధమైనట్టు చెబుతున్నారు. వైసీపీ–బీజేపీ మధ్య అవగాహన ఉన్నంత మాత్రాన తెలుగుదేశం పార్టీ బలహీనమైపోతుందా? అంటే గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండని కమలనాథులు అంటున్నారు. ‘అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును అష్టదిగ్బంధనం చేశాం. ఇప్పుడు ఆయన అధికారంలో కూడా లేరు. అందువల్ల ఆయన్ని కట్టడి చేయడం చిటికెలో పని’ అని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘అధికారంలో ఉన్నప్పుడే ఆర్థిక వనరులు అందకుండా చేయగలిగాం. చంద్రబాబుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న రాజకీయ వైరాన్ని కూడా ఇందుకోసం వాడుకున్నాం. ఏ పార్టీకైనా ఆర్థిక సహాయం చేయగలిగిన స్థాయి ఉన్నవారిలో అత్యధికులు హైదరాబాద్‌లోనే ఉన్నారు. కేసీఆర్‌ తలచుకుంటే హైదరాబాద్‌ నుంచి ఏ పార్టీ కూడా ఆర్థికసాయం పొందలేదు. గత ఎన్నికల్లో ఈ చేదు అనుభవాన్ని చంద్రబాబుకు రుచి చూపించాం. ఇప్పుడు కూడా కేసీఆర్‌ ఈ విషయంలో మాకే సహకరిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి జగన్‌ చెప్పుచేతల్లో ఉంది. కేంద్రంలో మేము ఉన్నాం. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒంటరి కాకుండా ఎలా తప్పించుకోగలరు? తిరుపతిలో తెలుగుదేశం పార్టీని అడుగడుగునా అడ్డుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం మాకు అండగా ఉంటాయి. ఇన్ని బలమైన శక్తులను ఎదుర్కొని చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగలరా?’ అని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. తాము అనుకున్నది అన్నుకున్నట్టు జరిగితే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు తమవైపు మళ్లుతుందని భావిస్తున్నామని వారు చెబుతున్నారు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయగలిగితే ఆ తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ పార్టీలో చేరిపోతారని, అదే జరిగితే తాము ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడం అసాధ్యం కాదని కమలనాథులు అంటున్నారు.


ఏపీలో కుదిరేనా...

నిజానికి రాజకీయాలలో ఏదీ అసాధ్యం కాదు. అయితే, తెలంగాణలో ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి అనుకూల వాతావరణం లేదు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో పాటు రాజధాని అమరావతిని తరలించకుండా బీజేపీ అడ్డుకోవడం లేదని, పోలవరం ప్రాజెక్టుకు కూడా సహకరించడం లేదన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఈ కారణంగా తెలుగుదేశం పార్టీ ఉన్నపళంగా బలహీనపడిపోయి బీజేపీ బలం పెంచుకునే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు లెక్కలు వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును తూతూ మంత్రంగా ముగించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డితో పాటు బీజేపీ కూడా రాష్ర్టానికి ద్రోహం చేస్తున్నదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఇప్పటికే విమర్శలు చేశారు. జగన్‌ తన స్వార్థం కోసం పోలవరం ప్రాజెక్టును బలిపెడుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును కుదించబోతున్న విషయం ప్రజలపై అంతగా ప్రభావం చూపిస్తున్నట్టుగా లేదు. మున్ముందు ఏం జరుగుతుందో తెలియదు. ప్రత్యేక హోదా అంశం కూడా ప్రస్తుతానికి నివురుగప్పిన నిప్పులా ఉంది. హోదా విషయమై ప్రజల్లో సెంటిమెంట్‌ అలాగే ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా కారణాలు ఏమైనా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టింది. రాష్ట్రంలో తమ రాజకీయ అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతుందని భావించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదే వైఖరితో ఉంటుందనుకోలేం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రణాళిక సక్సెస్‌ అవుతుందా అన్నది ప్రశ్నార్థకం!


లాభ... నష్టాలు!

రాష్ట్రంలో బీజేపీ బలపడితే ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి రాజకీయంగా లాభమా? నష్టమా? చంద్రబాబు బదులు తన రాజకీయ ప్రత్యర్థిగా ఎవరున్నా తనకు అభ్యంతరం లేదని, బీజేపీ బలపడితే తనకు రాజకీయంగా కలిగే నష్టం కూడా ఏమీ ఉండదని జగన్‌ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కుల, మత రాజకీయాలు ప్రధానంగా రాజ్యమేలుతున్నాయి. ముఖ్యమంత్రి కూడా ఈ తరహా రాజకీయాలను ఉద్దేశ్యపూర్వకంగా ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కారణంగా రాష్ట్రంలో బీజేపీ బలపడినా, తన ఓటుబ్యాంకు మాత్రం చెక్కుచెదరదని జగన్‌కు తెలుసు. వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న ముస్లింలు, క్రైస్తవులు, రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ వైపు చూడరు. ఈ కారణంగా రాష్ట్రంలో మతమార్పిడులు జోరుగా సాగుతున్నాయి. మత ప్రాతిపదికన ఓటుబ్యాంకులు ఏర్పడినందువల్ల ఇతరులు, అంటే హిందువుల ఓట్లు టీడీపీ–బీజేపీ మధ్య చీలిపోతే రాజకీయంగా తనకే లాభమన్న అభిప్రాయంతో, రాష్ట్రంలో బీజేపీ వేళ్లూనుకోవడానికి జగన్‌ రెడ్డి సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నారు. మతం, కులం ప్రాతిపదికతోపాటు పేదలు అనే మరో ఓటుబ్యాంకును కూడా జగన్‌ అభివృద్ధి చేసుకుంటున్నారు. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి విషయాన్ని పక్కనబెట్టి సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం ఇస్తోంది. అప్పులు చేసి మరీ పేదలకు పథకాల పేరిట డబ్బులు పంచుతున్నారు. ఈ క్రమంలో తాము ఏం కోల్పోతున్నామో ప్రజలు గ్రహించలేకపోతున్నారు. జగన్‌ రెడ్డికి కావాల్సింది కూడా అదే! ముఖ్యమంత్రి తమ ఖాతాల్లో ఠంచనుగా డబ్బులు వేస్తున్నారని సంబరపడిపోతున్న పేదలు, పన్నులు పెంచడం ద్వారా తమ నుంచి ఎంత వసూలు చేస్తున్నారో గ్రహించడం లేదు. ఉదాహరణకు ఆటోలు, ట్యాక్సీలు నడిపేవారికి ఏటా రూ.10 వేలు ఇస్తున్నారు. పొరుగు రాష్ర్టాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటర్‌కు 3, 4 రూపాయలు పెంచారు. ఈ పెంచిన ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునే వారికి వచ్చే దానికంటే పోయేదే ఎక్కువ. అయినా, పేదల సైకాలజీ తెలిసిన జగన్‌ రెడ్డి తనదైన శైలిలో నగదు పంపిణీ పథకాలకు రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకున్న ఓటుబ్యాంకు ప్రత్యేకమైనది. తాజాగా ప్రాంతాలవారీగా కూడా ప్రజలను విడదీసే ప్రయత్నాలను ముమ్మరం చేసినందున బీజేపీ గానీ, మరో పార్టీ వచ్చినా గానీ తనకు ఎలాంటి ముప్పు ఉండదని జగన్‌ బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంగా తెలుగుదేశం స్థానంలో బీజేపీ రాజకీయ శక్తిగా బలపడినా ఫర్వాలేదని జగన్‌ అండ్‌ కో భావిస్తున్నారు.


చంద్రబాబు వ్యూహం ఏమిటి?

ఈ పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లబోతున్నది? ఆ పార్టీ అధినేత చంద్రబాబు తనకు ఎదురవుతున్న సవాళ్లను ఎలా అధిగమించగలరు? అన్నవి చర్చనీయాంశంగా ఉన్నాయి. బీజేపీ విషయంలో మౌనంగా ఉంటున్నప్పటికీ ఆ పార్టీతో తెలుగుదేశం పార్టీకి పూర్వ సంబంధాలు నెలకొనే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. బీజేపీ నుంచి కవ్వింపులు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తుతానికి సంయమనం పాటిస్తున్నారు. ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండకపోవచ్చు. బీజేపీ నాయకులు తిడుతున్నప్పటికీ ఎంతకాలం ఉపేక్షించాలని తెలుగుదేశం నాయకులు తమ అధినేతను ప్రశ్నించడం మొదలుపెట్టారు. బీజేపీ విషయంలో ఇలాగే మౌనంగా ఉండిపోతే మొదటికే మోసం వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తీసుకోబోయే రాజకీయ వైఖరిలో తిరుపతి ఉపఎన్నిక ఫలితాల తర్వాత స్పష్టత వస్తుందని అంటున్నారు. జగన్‌ రెడ్డి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో, ఏయే వర్గాలలో ఉందన్న విషయమై అంచనాకు రాలేకపోతున్నది. తిరుపతిలో విజయం సాధించకపోయినా వైసీపీ మెజార్టీని గణనీయంగా తగ్గించగలిగితే విజయం సాధించినట్లేనని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నిక తర్వాత రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్‌ ఎలా ఉండబోతుందన్న విషయంపై కూడా స్పష్టత వస్తుంది. కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నట్లుగా ఆ పార్టీ బలం పెరిగితే రాష్ట్ర రాజకీయాలలో దూకుడు పెంచుతుంది. తెలుగుదేశం పార్టీని మరింత టార్గెట్‌ చేసుకుంటుంది. అదే జరిగితే తెలుగుదేశం పార్టీ కూడా ఎదురుదాడికి దిగక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. జగన్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతుంది కనుక రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతాయి. ప్రధాన ప్రతిపక్షంగా తాము ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి ఉన్నందున బీజేపీ నాయకులు తమ అధినేతను విమర్శిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి మౌనంగా ఉంటున్నామని తెలుగుదేశం ముఖ్యుడొకరు చెప్పారు. తాము ఇప్పటినుంచే బీజేపీతో తలపడితే అధికార వైసీపీకి మేలు చేసిన వాళ్లమవుతామని, ఆ కారణంగానే సంయమనం పాటిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, బీజేపీ వల్ల తమ రాజకీయ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తే తమ వద్ద ఉన్న రాజకీయ అస్ర్తాలను బయటకు తీస్తామని టీడీపీకి చెందిన మరో నాయకుడు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని తాము భావించడం లేదని, అలాంటి సంకేతాలు కనిపిస్తే మాత్రం ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశాలను తెర మీదకు తెస్తామని ఆయన వివరించారు. నిజానికి రాజకీయ పార్టీల బలాబలాలు తెలియడానికి ఉపఎన్నికలు ప్రామాణికాలు కావు. గతంలో నంద్యాల అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ దాదాపు 30 వేల మెజార్టీతో గెలిచింది. సాధారణ ఎన్నికల్లో అదే స్థానాన్ని 30 వేలకు పైగా మార్జిన్‌తో కోల్పోయింది. అధికారంలో ఉన్న పార్టీకి ఉపఎన్నికలో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. తిరుపతిలో కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న సందర్భాల్లోనే ఉపఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోతూ ఉంటుంది. తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉపఎన్నిక ఇందుకు ఉదాహరణ. సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న వాళ్లు తమతోనే ఉంటారు గనుక తిరుపతిలో తమ గెలుపు నల్లేరుపై నడక వంటిందని వైసీపీ ముఖ్యుడొకరు విశ్లేషించారు. మొత్తంగా చూస్తే నూతన సంవత్సరంలో జరిగే తిరుపతి ఉపఎన్నిక ఫలితం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ ముఖచిత్రంపై స్పష్టత వస్తుంది. 


అమరావతిపై అదే వ్యూహం

ఈ విషయం అలా ఉంచితే రాజధానిలో పేదలు, ఇతర కులాల వారు ఉండకూడదనుకుంటే ఎలా? అని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి తాజాగా ప్రశ్నించారు. అమరావతిలో ఒకే కులం వారు ఉన్నారని, ప్రజలను ముఖ్యంగా పేదలను నమ్మించడానికే ఆయన ఈ వాదనను మొదలుపెట్టి ఉంటారు. నిజానికి అమరావతిలో పేదల కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా 8 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. వాటిలో 5వేల ఇళ్లు పూర్తి చేసింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులలో అన్ని కులాల వారు ఉన్నారన్నది కూడా వాస్తవం. అయినా, ముఖ్యమంత్రి పదే పదే కులం ప్రస్తావన తెస్తున్నారంటే దానిని ఎలా అర్థం చేసుకోవాలి? మూడు రాజధానుల పేరిట తాను మొదలుపెట్టిన ఆటకు ప్రజల మద్దతు పొందడంతో పాటు అమరావతిని ఒక్క కులం కోసమే చంద్రబాబు నిర్మించాలనుకున్నారని అదేపనిగా చెప్పడం ద్వారా మిగతా కులాలకు తెలుగుదేశం పార్టీని దూరం చేయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ‘నిజం చెప్పులు వేసుకుని బయల్దేరే లోపే అబద్ధం ఊరంతా తిరిగొస్తుంద’న్న సామెత ఉండనే ఉంది. అమరావతి విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఒక రాజకీయ నాయకుడు తన రాజకీయ వ్యూహంలో భాగంగా అమలు చేస్తున్న అవాస్తవాల ప్రచారంతో నిజాలు సమాధి అయిపోతున్నాయి. ఫలితంగా అమరావతి కోసం భూములిచ్చిన రైతుల పోరాటాన్ని వారి సమస్యగానే మిగతా ప్రాంతాల ప్రజలు చూస్తున్నారు. జగన్‌ నిర్ణయాల వల్ల తాము ఏం కోల్పోతున్నామో కూడా గ్రహించలేకపోతున్నారు. రాష్ట్రం విడిపోయిన ఆరున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి! ముఖ్యమంత్రి జగన్‌ను కనుసైగలతో కట్టడి చేయగల బీజేపీ పెద్దలు కూడా మౌనంగా ఉండిపోవడం ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వమంటే సంక్షేమం పేరిట ప్రజాధనాన్ని పంచిపెట్టడమే అనే నిర్వచనాన్ని జగన్‌ రెడ్డి కొత్తగా ఇస్తున్నారు. అదే సరైనదని ప్రజలను కూడా నమ్మింపజేస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సైతం జగన్‌ వంటి ముఖ్యమంత్రిని తన సర్వీస్‌లో చూడలేదని, తన జన్మ ధన్యమైందని భజన చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇంతకూ అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ చేస్తున్న ప్రచారం వాస్తవమా, కాదా, అన్నది ఎవరు చెప్పాలి? ఎవరు చెబితే ప్రజలు నమ్ముతారు? ఈ ప్రశ్నలకు సమాధానం కూడా దొరకదు. వాస్తవాలను గుర్తించడానికి కూడా అంగీకరించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. కనీసం నూతన సంవత్సరంలోనైనా అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ఉపశమనం లభించాలని కోరుకుందాం. ‘జగనన్న తోడు’ పథకానికి రుణాలు మంజూరు చేయడం లేదన్న కోపంతో కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకు శాఖల ముందు చెత్త వేయించడాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలియడం లేదా!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-12-27T09:56:21+05:30 IST