ప్రైవేటు దవాఖానాలపై గురి

ABN , First Publish Date - 2022-09-26T06:34:05+05:30 IST

జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీల కోసం అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది.

ప్రైవేటు దవాఖానాలపై గురి
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు (ఫైల్‌)

జిల్లాలో తనిఖీల కోసం రంగంలోకి రెండు ప్రత్యేకబృందాలు 

ల్యాబోరేటరీ, స్కానింగ్‌ సెంటర్‌లపైన నజర్‌ 

డాక్టర్‌ల డిగ్రీ, స్పెషలైజేషన్‌పై ఆరా 

నకిలీబాగోతం గుట్టురట్టుకు చర్యలు 

నిర్మల్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) :  జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీల కోసం అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. గత కొంతకాలం నుంచి ప్రైవేటు ఆసుపత్రులపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల మేరకు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ధన్‌రాజ్‌ ఆసుపత్రుల తనిఖీల కోసం రెండుస్పెషల్‌ టీంలను ఏర్పాటు చేశారు. డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌ఓ ఆధ్వర్యంలో ఈ రెండు టీంలు వారం రోజుల పాటు భైంసా, ఖానాపూర్‌, నిర్మల్‌ తదితర ప్రాంతాల్లోని 120 ప్రైవేటు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నాయి. దీంతో పాటు మరో 100 డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లను కూడా ఈటీంలు పరిశీలించనున్నాయి. స్కా నింగ్‌సెంటర్లు, ఎక్స్‌రే సెంటర్‌లను సైతం పరిశీలించనున్నారు. లైసెన్సు పొందిన హాస్పటల్స్‌, రెన్యూవల్‌ లేకుండా ఆ ఆసుపత్రుల్లో స్థితి గతులను, రోగులకు అందుతున్న వైద్యసేవలను, బిల్లులు, పారిశుధ్యం లాంటి అంశాలను ఈ టీంలు పరిశీలించనున్నాయి. అలాగే ఆ ఆసుపత్రుల లైసెన్సు సరిగ్గా ఉన్నాయా...? లేదా అనే అంశాలను కూడా పరిశీలించి ఈ ఆసుపత్రులకు చెందిన డాక్టర్లు డిగ్రీలతో పాటు వారి ఇతర అర్హలతపై కూడా ఆరా తీయనున్నారు. నిర్మల్‌లో నకిలీ డాక్టర్లు ట్రీట్‌మెంట్‌ దందా నడిపిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టనున్నారు. లైసెన్సులు లేకుండా ఆసుపత్రులను కొనసాగిస్తే వారిపై కేసులు నమోదు చేసేందుకు కూడా రంగంసిద్దం చేస్తున్నారు. అలాగే ఆసుపత్రుల్లో సౌకర్యాలు గాని, ఇతర సమస్యలు ఉంటే షోకాజ్‌ నోటీసులు జారీ చేయనున్నారు. లైసెన్సులు పొంది ఐదేళ్ల గడువు దాటిన ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులతో పాటు జరిమానాలుల కూడా విధించనున్నారు. అలాగే డయాగ్నోస్టిక్‌ సెంటర్‌, ఎక్స్‌రే సెంటర్లను కూడా ఈ టీంలు తనిఖీ చేయనున్నాయి. ముఖ్యంగా రోగనిర్ధారణ పరీక్షల్లో కీలకమైన డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ఇష్టానుసారంగా వెలుస్తున్న సంగతి తెలిసిందే. అర్హతలు, అనుభవం లేకున్నప్పటికి కొంతమంది డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లను ఏర్పాటు చేసి రోగుల జీవితాలతో చెలగామాడుతున్నారంటున్నా రు. డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లలో రోగ నిర్ధారణ పరీక్షలకు సంబందించిన పరికరాలల్లో నాణ్యత ఉందా..? లేదా అన్న విషయంపై కూడా విచారించనున్నారు. 

డాక్టర్ల డిగ్రీపై ఆరా..

కొంతమంది ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఈ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే డాక్టర్ల డిగ్రీలపై కూడా అనుమానాలుల వ్యక్తమవుతున్నాయంటున్నారు. ఇప్పటికే ఐఎంఎ, ఎన్‌డీఎలు కూడా పలువురిపై ఫిర్యాదులు చేశాయి. మెడికల్‌ ఎంక్వయిరీ టీంలు, డాక్టర్ల ప్రాథమిక డిగ్రీతో పాటు అదనపు అర్హతలపై కూడా ఆరా తీయనున్నారు. స్పెషలిస్టు వైద్యులుగా చెప్పుకుంటున్న వారి డిగ్రీలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టనున్నారు. అలాగే కొన్ని ఆసుపత్రుల్లో ఆర్‌ఎంపీలే డాక్టర్ల తరహా వైద్యసేవలు అందించడమే కాకుండా ఆపరేషన్‌లు కూడా చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇలాంటి అన్ని అంశాలపలై ఈ స్పెషల్‌ టీం విచారించి తగిన చర్యలు తీసుకోనున్నాయి. 

ప్రమాణాలపై విచారణ

కాగా ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు, డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లలో ఏ మేరకు నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారన్న అంశాన్ని ఈ స్పెషల్‌ టీంలు సీరియస్‌గా పరిశీలించనున్నాయి. నాణ్యత ప్రమాణాలను పక్క న పెట్టి అదరబాదరగా వైద్యసేవలతో పాటు రోగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులున్నాయి. ఈ ఫిర్యాదులపై స్పెషల్‌ టీంలు ప్రత్యేకదృష్టి సారించనున్నాయి. గత కొద్దిరోజుల నుంచి జిల్లాలో డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా లాంటి జ్వరాలు విభృంభిస్తుండడంతో బాధితులంతా ప్రైవేటు ఆసుపత్రుల బాట పడుతున్నారు. టైఫాయిడ్‌, డెంగ్యూ సోకిన వారికి ప్రతీరోజు రెండుసార్లు రక్తపరీక్షలు జరుపుతున్నారు. అలాగే ప్లేట్‌లెట్స్‌ తగ్గుతున్న వారికి కూడా ఇదే రకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. యాంటిబయోటిక్‌లు, సెలెన్ల పేరిట అడ్డగోలు వైద్యం అందిస్తున్నారన్న విమర్శలున్నాయి. స్పెషల్‌ టీంలు ఇలాంటి అంశాలన్నింటిని తనిఖీల సందర్భంగా పరిశీలించి చర్యలు చేపట్టనున్నాయి. 

పరిగణనలోకి 50 అంశాలు

ఇదిలా ఉండగా అధికార బృందాలు ఆసుపత్రులను తనిఖీ చేస్తూనే 50 అంశాలపై వివరాలు సేకరించనున్నాయి. ఆసుపత్రి రిజిస్ర్టేషన్‌కు సంబంధించి వివరాలతో పాటు రోగుల సేవలు, సౌకర్యాలు లాంటి అంశాలన్నీ ఈ పరిధిలోకి రానున్నాయి. ఒక్కోఅంశం ఆధారంగా ఈ తనిఖీలు జరగనున్నాయి. ఇలా ఇప్పటికే భైంసా డివిజన్‌ పరిధిలో 3, నిర్మల్‌ డివిజన్‌ పరిధిలో 5 ఆసుపత్రులను కూడా అధికారులు మొదట తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అంశాలను గుర్తించి కొన్ని ఆసుపత్రులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇక పది రోజుల పాటు నిరాటకంగా అధికారుల బృందాలు విసృతస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయబోతున్నాయి. ఈ తనిఖీల ఆధారంగానే ఇక నుంచి ప్రైవేటు ఆసుపత్రులు కొనసాగే అవకాశాలుంటాయంటున్నారు. 

వరుస ఫిర్యాదుల మేరకే..

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే జిల్లాలోని హస్పిటల్స్‌, నర్సింగ్‌ హోమ్స్‌, డయాగ్నోస్టిక్‌ సెంటర్లను తనిఖీ చేసేందుకు స్పెషల్‌ టీంలు ఏర్పాటు చేశాం. వారం రోజుల పాటు ఈ స్పెషల్‌ టీమ్స్‌ నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ తదితర ప్రాంతాల్లోని దాదాపు 120కి పైగా ప్రైవేటు హస్పిటల్స్‌ను తనిఖీ చేయనున్నాయి. రిజిస్ర్టేషన్‌ లేని లైసెన్సులు లేని హస్పిటల్స్‌పై కేసులు నమోదు చేస్తాం. నాణ్యత ప్రమాణాలు పాటించని హస్పిటల్స్‌, డయాగ్నోస్టిక్‌ సెంటర్లకు కూడా షోకాజ్‌ నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకుంటాం. 

- డాక్టర్‌ ధన్‌రాజ్‌, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి 

Updated Date - 2022-09-26T06:34:05+05:30 IST