టారిఫ్‌ల పెంపు తప్పదు

ABN , First Publish Date - 2022-05-19T06:49:46+05:30 IST

ఈ సంవత్సరం టెలికం ఛార్జీలు మరింత పెంచక తప్పదని ఎయిర్‌టెల్‌ స్పష్టం చేసింది.

టారిఫ్‌ల పెంపు తప్పదు

ఈ ఏడాది రూ.200 స్థాయికి ఆర్పూ

ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విఠల్‌

న్యూఢిల్లీ : ఈ సంవత్సరం టెలికం ఛార్జీలు మరింత పెంచక తప్పదని ఎయిర్‌టెల్‌ స్పష్టం చేసింది. ఛార్జీల పెంపు ద్వారానే ఈ సంవత్సరం ఒక్కో ఖాతాదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఆర్పూ) రూ.200కి చేర్చాలన్న లక్ష్యం సాధ్యమవుతుందని కంపెనీ ఎండీ, సీఈఓ గోపాల్‌ విఠల్‌ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రూ.300 ఆర్పూ సాధించాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇన్వెస్టర్ల కాల్‌కు సమాధానంగా విఠల్‌ ఈ విషయం చెప్పారు. చిప్స్‌ కొరతతో స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగినా 20 కోట్ల మంది పోస్ట్‌పెయిడ్‌ ఖాతాదారులను సంపాదించినట్టు తెలిపారు. ఎయిర్‌టెల్‌ ఆర్పూ గత ఏడాది మార్చి త్రైమాసికంలో రూ.145 కాగా ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో రూ.178కి చేరింది. టారిఫ్‌ల పెంపు, భారీగా 4జీ ఖాతాదారుల నమోదు ఇందుకు కలిసొచ్చింది.  ఆర్పూ కనీసం రూ.300 స్థాయికి చేరితే తప్ప, టెలికం కంపెనీలకు పెట్టుబడులకు అవసరమైన స్థాయిలో లాభాలు రావని ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ ఇంతకు ముందే స్పష్టం చేశారు.

Updated Date - 2022-05-19T06:49:46+05:30 IST